పాడుబ‌డ్డ‌ బావిలో విష వాయువులు పీల్చి ఐదుగురు మృతి

యూపీ: పాడు ప‌డ్డ బావిలోని విష పూరిత వాయువులు పీల్చ‌డంతో ఐదుగురు వ్య‌క్తులు ప్ర‌మాద‌వ‌శాత్తూ మ‌ర‌ణించారు. యూపీలోని గోండా జిల్లా మ‌హారాజ్ గంజ్ స‌ర్కిల్లో మంగ‌ళ‌వారం ఈ విషాద సంఘ‌ట‌న చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. కొత్వాలి పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని రాజా మొహల్లా లో ఓ దూడ ప్ర‌మాద‌వ‌శాత్తు పాడు ప‌డిన బావిలో ప‌డింది. దానిని ర‌క్షించేందుకు ఓ వ్య‌క్తి నిచ్చెన స‌హాయంతో బావిలోకి దిగాడు. చెత్త‌ను పడ‌వేసేందుకు ఉప‌యోగించే ఆ బావిలో విష‌పూరిత వాయువులు పీల్చ‌డంతో ఆ వ్య‌క్తి అక్క‌డే మూర్ఛ‌పోయాడు.

అతన్ని బ‌య‌ట తీసేందుకు మరో నలుగురు వ్యక్తులు కూడా బావిలోకి దిగారు, కాని వారు కూడా స్పృహ త‌ప్పి ప‌డిపోవ‌డంతో స్థానికులు గ‌మ‌నించి పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. ఘ‌ట‌నా స్థ‌లానికి వ‌చ్చిన పోలీసులు అగ్నిమాప‌క సిబ్బంది సాయంతో ఐదుగురిని వెలికితీసి ద‌వాఖాన‌కు త‌ర‌లించ‌గా అప్ప‌టికే మృతి చెందార‌ని వైద్యులు ధృవీక‌రించారు. చ‌నిపోయిన వారిలో వైభవ్ (18), దినేష్ (30), రవిశంకర్ (36), విష్ణు దయాల్ (35), మమ్ము సైని (36) ఉన్నారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ద‌వాఖాన‌కు త‌ర‌లించిన‌ట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉండ‌డంతో కుటుంబ స‌భ్యుల రోద‌న‌లు మిన్నంటాయి. అయితే దూడను మాత్రం స‌జీవంగా బ‌య‌ట‌కు తీసుకొచ్చిన‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ నితిన్ బన్సాల్ విలేకరులతో అన్నారు.

Latest Updates