ఇంటర్ ఇంగ్లిష్‌లో 5 తప్పులు.. ఆ తప్పులు ఇవే..

11 మార్కులు నష్టపోతామని స్టూడెంట్ల టెన్షన్

ఆఖరి నిమిషంలో.. తప్పులు సరిదిద్దుకోవాలన్న బోర్డు

మార్కులు కలపాలని విద్యార్థులు, పేరెంట్స్​ డిమాండ్

హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియెట్ సెకండ్ ఇయర్ ప్రశ్నపత్రం తప్పులతడకగా మారింది. శనివారం జరిగిన ఇంగ్లిష్​-2 పేపర్ పరీక్షలో ఐదు ప్రశ్నల్లో తప్పులు వచ్చాయి.  పరీక్షకు అధికారులు సెట్–బీ పేపర్ ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,19,148 మంది పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా, 4,04,625 మంది హాజరయ్యారు. అయితే ప్రశ్నపత్రంలో పలు తప్పులు రావడంతో విద్యార్థులు టెన్షన్ పడుతున్నారు. తప్పులు వచ్చిన ప్రశ్నలకు మార్కులు కలపాలని డిమాండ్ చేస్తున్నారు.

ఆ 5 తప్పులు ఇవే..

5వ నెంబర్ ప్రశ్న, బిట్ నెంబర్ ఏలో WHY బదులు WHAT అని పడింది. 7వ నెంబర్ ప్రశ్న, పేరా2లో DISCIPLINE కు బదులుగా DISIPLINE అని వచ్చింది. 12వ నెంబర్ ప్రశ్న, బిట్ నెంబర్ 5లో TURN TO DEAF YEAR కు బదులుగా TURN A DEAF EAR అని పడింది. 17వ నెంబర్ ప్రశ్నలో FELICITATION బదులుగా FELICILATION అని వచ్చింది. క్వశ్చన్ నెంబర్14  కూడా అసంపూర్తిగా ఇచ్చారు. 7వ క్వశ్చన్ మినహా మిగతా క్వశ్చన్లకు11 మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. ఏడో క్వశ్చన్ కూ నాలుగు బిట్స్​ మార్కులున్నాయి. పలు ప్రశ్నల్లో ఒక్క పదమే తప్పుగా కనిపించినా, అది ప్రశ్నను పూర్తిగా మార్చేలా ఉందని అంటున్నారు.

చివరి నిమిషంలో చెప్పిన్రు..

ఐదు ప్రశ్నల్లో తప్పులను ఇంటర్ బోర్డు నియమించిన కమిటీ గుర్తించింది. వీటిని సవరించాలని సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్లకు అధికారులు ఆదేశించారు. అయితే చాలా సెంటర్లలో చివరి నిమిషంలోనే విద్యార్థులకు తప్పులను సవరించుకోవాలని చెప్పినట్టు ఆరోపణలున్నాయి. అధికారుల తప్పిదంతో తమ పిల్లలు సుమారు11 మార్కులు కోల్పోయే అవకాశముందని పేరెంట్స్​ఆందోళన చెందుతున్నారు.

సంస్కృతంలోనూ తప్పులు

గురువారం జరిగిన ఇంటర్ సెకండియర్​సంస్కృతం పేపర్​లోనూ తప్పులు వచ్చాయని తెలుస్తోంది. క్వశ్చన్​నెంబర్13,15లో పలు పదాలు తప్పుగా వచ్చినట్టు విద్యార్థులు చెబుతున్నారు. వీటికీ మార్కులు కలుపాలని
కోరుతున్నారు.

మార్కులు కలపాలి

మొత్తం ఐదు ప్రశ్నల్లో తప్పులొచ్చాయి. వాటిలో రెండు ప్రశ్నలు అసంపూర్తిగా ఉన్నాయి. కాబట్టి వీటికి పూర్తిస్థాయి మార్కులు కలపాలి. లేకపోతే విద్యార్థులు నష్టపోతారు. అధికారులు చేసిన తప్పులు కాబట్టి స్టూడెంట్లకు మార్కులు కలపాలి.

– గౌరీ సతీశ్, ప్రైవేటు కాలేజీల సంఘం ప్రెసిడెంట్

Latest Updates