రోడ్డుపై పడి ఉన్న విషం కలిపిన కూల్‌డ్రింక్ తాగి..

రోడ్డు మీద ఎవరో పడేసిన థమ్సప్ బాటిల్ ను  తీసుకుని, అందులో ఉన్న కూల్ డ్రింక్ తాగి అస్వస్థతకు గురయ్యారు ఐదుగురు వ్యక్తులు. స్థానికులు వెంటనే గుర్తించి ఆసుపత్రిలో చేర్పించడంతో ప్రాణాలు దక్కించుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం నడిపల్లిలో జరిగిందీ సంఘటన.

పెదవేగి ఎస్ఐ వెంకట నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. నడిపల్లి గ్రామంలో  ఇసుకను లోడ్ చేసే  ముఠా వ్యక్తులు రోడ్డుపై పడి ఉన్న కూల్ డ్రింక్ బాటిల్ తీసుకుని దానిలో ఉన్న డ్రింక్ ను తాగారు.  కొద్దిసేపటికి వారంతా అస్వస్థతకు గురవడంతో  స్థానికులు వారిని గుర్తించి చికిత్స నిమిత్తం దగ్గరలో ఉన్న ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వాళ్లు  తాగిన థమ్స్ అప్ లో  ఎవరో విషపు గుళికలు కలిపి ఉంటారని, ఆ కలిపిన  విషయం తెలియక  త్రాగడం వల్ల  ఐదుగురు వ్యక్తులు అనారోగ్యానికి గురయ్యారని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అనుమానిస్తున్నారు. వారందరికీ  సకాలంలో డాక్టర్లు వైద్య సేవలు అందిస్తున్నారని పెదవేగి ఎస్సై తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తులను పరామర్శించి  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు.

Latest Updates