కరోనా పేషెంట్ భోజనం: ఢిల్లీ ఫైవ్ స్టార్ హోటల్ స్టాఫ్ అంతా నిర్భందం

ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ స్టాఫ్ మొత్తాన్ని 14 రోజుల పాటు వాలంటీర్‌గా నిర్భందం (సెల్ఫ్ క్వారంటైన్)లో ఉండాలని కోరింది హోటల్ యాజమాన్యం. కరోనా పేషెంట్ ఒకరు అక్కడ భోజనం చేయడంతో వారికి వైరస్ సోకిందేమోనన్న భయంతో ఇంట్లోనే ఐసోలేటెడ్‌గా ఉండాలని సూచించింది. వారంతా రెండు వారాల పాటు ఇతరులతో కలవకుండా.. జ్వరం, జలుబు లాంటివాటిపై ఎప్పటికప్పడు చెక్ చేసుకుని, ఏ మాత్రం కరోనా లక్షణాలు కనిపించినా ఆస్పత్రికి వెళ్లాలని చెప్పింది.

ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్ హయత్​ రిజెన్సీ​కి చెందిన లా పియాజ్జా రెస్టారెంట్​ సిబ్బందిపై కరోనా ఎఫెక్ట్​ పడింది. ఆ రెస్టారెంట్​లో ఫిబ్రవరి 28న భోజనం చేసిన వ్యక్తికి కరోనా ఉన్నట్లు సోమవారం తేలింది. దీంతో ఆ రోజు డ్యూటీలో ఉన్న సిబ్బందిలో ఎవరికైనా వైరస్ వచ్చిందేమోనన్న అనుమానంతో యాజమాన్యం వారందరినీ క్వారంటైన్‌లోకి వెళ్లాల్సిందిగా కోరింది. “గతనెల 28న లా పియాజ్జా రెస్టారెంట్​లో డిన్నర్​ చేసిన వ్యక్తికి కరోనా సోకినట్లు ప్రభుత్వాధాకారులు వెల్లడించారు. అందుకే ఆ రోజున రెస్టారెంట్​లో డ్యూటీలో ఉన్న వారందరూ 14 రోజులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని కోరాం. హయత్​ రీజెన్సీ ఢిల్లీలోని సిబ్బందితో పాటు హోటల్​లోకి వచ్చే వారికి రోజూ ఉష్ణోగ్రతలను పరీక్షిస్తున్నాం.” అని చెప్పారు హోటల్ జీఎం జూలియన్​ ఆయెర్స్​.

ఆగ్రాలో ఆరుగురికి కరోనా లక్షణాలు

దేశంలో ఇద్దరికి కరోనా సోకినట్లు సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అందులో ఒకరు ఢిల్లీకి చెందిన 45 ఏళ్ల వ్యక్తి. అతడు గతనెల 28న పియాజ్జా రెస్టారెంట్​లో డిన్నర్​ చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆగ్రాకి వెళ్లి అతని బంధువులను కలిశాడు. అక్కడ అతడితో కలిసిన ఆరుగురు బంధువులకు కరోనా లక్షణాలు ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే వారి టెస్టు రిపోర్టులు ఇంకా రావాల్సి ఉందని తెలుస్తోంది.

Latest Updates