చంద్రబాబు పాలనలో అంతా మోసమే: జగన్‌

ఐదేళ్ల చంద్రబాబు పాలనలో అంతా మోసమే జరిగిందన్నారు YCP అధినేత జగన్మోహన్‌రెడ్డి. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో నిర్వహించిన ప్రచార సభలో జగన్‌ మాట్లాడారు. సత్తెనపల్లి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందన్నారు. పంటకు గిట్టుబాటు ధర రావడం లేదన్నారు. కోడెల కుటుంబం అవినీతి సత్తెనపల్లిలో రాజ్యమేలుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా జీఎస్టీ ఉంటే… ఇక్కడ కోడెల సర్వీస్‌ ట్యాక్స్‌ ఉందన్నారు.

వారంలో బాబు దిగిపోతారనే ఆనందం డ్వాక్రా సంఘాల్లో కనిపిస్తోందన్నారు జగన్. బిల్డింగులు కట్టాలంటే కప్పం కట్టాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. శ్మశానాలను కూడా వదిలిపెట్టకుండా భూకబ్జాలు చేశారని విమర్శించారు. వివాదాస్పద భూములను కూడా గుట్టుచప్పుడు కాకుండా దోచుకున్నారని ఆరోపించారు. స్పీకర్‌ పదవికి కూడా కోడెల భ్రష్టుపట్టించారన్నారు. టీడీపీ అనేక దొంగ సర్వేలను చేయిస్తోందని విమర్శించారు. చంద్రబాబు క్రిమినల్ మైండ్‌తో వ్యవహరిస్తున్నారన్నారు వైఎస్ జగన్.

Latest Updates