అబద్ధాలతోనే ఐదేళ్ల పాలన: బీజేపీ పై ప్రియాంక ఫైర్

ఎప్పుడూ విదేశీ పర్యటనలపై వెళ్లే ప్రధాని నరేంద్ర మోడీ.. దేశ ప్రజల మధ్య మాత్రం ఉండడం లేదని ఆరోపించారు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ. అబద్ధాలతోనే ఐదేళ్ల పాలనను కొనసాగించారని విమర్శించారు. ఇప్పటి వరకు వారణాసి పరిధిలోని ఒక్క గ్రామాన్ని కూడా మోడీ సందర్శించలేదన్నారు. బీజేపీ ప్రభుత్వ విధానాలతో పోలిస్తే కాంగ్రెస్‌ సిద్ధాంతాలు పూర్తిగా వ్యతిరేకమన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆమె ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె ప్రధాని మోడీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పర్యటించిన ప్రతి ప్రాంతంలో నిరుద్యోగులే తారసపడుతున్నారన్నారు ప్రియాంక. రైతుల కష్టాలను తీర్చే దిశగా రుణమాఫీ చేస్తామంటే ప్రశ్నిస్తున్న బీజేపీ.. బడా పారిశ్రామికవేత్తల రుణాలను మాత్రం రద్దు చేస్తోందన్నారు. మేనిఫెస్టోలో పొందుపర్చిన న్యాయ్‌ పథకానికి నిధులు ఎక్కడి నుంచి తెస్తారని అధికారపక్షం ప్రశ్నించడాన్ని ఆమె తప్పుబట్టారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు ఆయుధం లాంటిదని.. దాంతో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు. అధికారాన్ని కట్టబెట్టిన ప్రజల సంక్షేమాన్ని మరచిన  బీజేపీ ప్రభుత్వం.. తమ విధానాలతో దేశాన్ని భ్రష్టు పట్టిస్తోందని విమర్శించారు. భావి తరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కాంగ్రెస్‌ను ఎన్నుకోవాలని ప్రియాంకా గాంధీ ప్రజలను అభ్యర్థించారు.

Latest Updates