భార‌త్ రాఫెల్ యుద్ద విమాన తొలి మ‌హిళా పైలెట్ శివంగి సింగ్

ఇటీవల భారత వాయుసేన అంబులపొదిలోకి చేరిన అత్యాధునిక‌ రఫేల్‌ ఫైటర్‌ జెట్ నడిపే తొలి మహిళా పైలట్ ‌గా ఫ్లైట్ లెఫ్టినెంట్ శివంగి సింగ్ ఎంపికయ్యారు. శివంగి సింగ్ త్వరలో అంబాలాలోని 17 స్క్వాడ్రన్‌కు చెందిన రాఫెల్‌ ‘గోల్డెన్ యారో‌స్‌’లో భాగం కానున్నారు. దీని కోసం ఆమె ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. ఫ్రాన్సులో తయారైన 5 రఫేల్‌ ఫైటర్‌ జెట్లు ఈనెల 10న అంబాలా వైమానిక స్థావరం కేంద్రంగా పనిచేస్తున్న గోల్డెన్‌ యారోస్‌ స్క్వాడ్రన్‌లో అధికారికంగా చేరింది. వారణాసికి చెందిన శివంగి సింగ్ 2017లో భారత వైమానిక దళంలో చేరారు. మహిళల రెండో బ్యాచ్‌లో ఫైటర్‌ పైలట్‌గా శిక్షణ పొందారు. మిగ్‌-21 బైసన్‌ యుద్ధ విమానాలు నడిపిన అనుభవం ఆమె సొంతం. గతేడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్ కు చెందిన యుద్ధ విమానం కూల్చివేసిన సందర్భంగా ఆ దేశ చెరలో కొన్ని రోజులపాటు ఉన్న వింగ్‌ కమాండర్‌ అభినందన్‌తో కలిసి ఆమె ఇటీవలే రాజస్థాన్‌లోని వైమానిక స్థావరం నుంచి యుద్ధ విమానంలో అంబాలా ఎయిర్‌ బేస్‌ కు చేరుకున్నట్లు సమాచారం.  వారణాసిలో ప్రాథమిక విద్యనభ్యసించిన శివంగి సింగ్ చిన్ననాటి నుంచే వైమానిక దళంలో చేరాలని కలలు కనేవారు. బెనారస్‌ హిందూ యూనివర్సిటీలో చేరిన తర్వాత తన ఆశయాన్ని నెరవేర్చుకునే దిశగా అడుగులుపడ్డాయి. అక్కడే నేషనల్‌ క్యాడెట్‌ కార్స్ప్‌ 7 యూపీ ఎయిర్‌ స్వాడ్రాన్‌లో భాగస్వామ్యమయ్యే అవకాశం లభించింది. ఈ క్రమంలో 2016లో ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో చేరి శిక్షణ ప్రారంభించారు. పాతకాలపు మిగ్‌ 21 యుద్ధ విమానం నుంచి మొదలైన ఆమె శిక్షణ ప్రస్తుతం కొత్త తరం రాఫెల్‌ యుద్ధ విమానం నడపటం వరకు కొనసాగింది.

Latest Updates