నాన్చొద్దూ..ఆన్ లైన్ కంపెనీలపై మస్తు ఫిర్యాదులు

న్యూఢిల్లీ : ఆన్‌‌లైన్‌‌లో ఏదో వస్తువు ఆర్డర్ చేస్తే, దానికి బదులు మరొకటి డెలివరీ కావడమో.. లేదా డెలివరీ చేస్తామన్న సమయానికి అందివ్వకుండా నాన్చడమో.. డ్యామేజ్‌‌ వస్తువును అందివ్వడమో.. ఇలా ఎన్నో సంఘటనలు మనం తరుచు చూస్తూ ఉంటాం. వీటితో విసిగెత్తిపోయిన కస్టమర్లు ప్రభుత్వ నేషనల్ హెల్ప్‌‌లైన్‌‌కు కాల్‌‌ చేసి, ఆన్‌‌లైన్ కంపెనీలపై  ఫిర్యాదులు మీద ఫిర్యాదులు దాఖలు చేస్తున్నారు. ఇలా కంప్లయింట్స్ ఎక్కువగా వస్తున్న కంపెనీల్లో ఫ్లిప్‌‌కార్ట్‌‌ ముందంజలో ఉంది. వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం నేషనల్ హెల్ప్‌‌లైన్‌‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. హెల్ప్‌‌లైన్‌‌పై దాఖలవుతున్న ప్రతి ఐదు ఫిర్యాదుల్లో ఒకటి  ఆన్‌‌లైన్ కంపెనీకి వ్యతిరేకంగా వస్తున్నట్టు, వాటిలో ఫ్లిప్‌‌కార్ట్‌‌కు వ్యతిరేకంగా ఎక్కువ కంప్లయింట్స్ వస్తున్నట్టు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ డేటాలో వెల్లడైంది.

లక్షకు పైగా కంప్లయింట్స్ ఆన్‌‌లైన్ కంపెనీలపైనే…

ఈ ఏడాది ఇప్పటి వరకు 5 లక్షల కంప్లయింట్స్‌‌ నేషనల్ హెల్ప్‌‌లైన్ డెస్క్ వద్ద దాఖలయ్యాయి. వాటిలో లక్షకు పైగా కంప్లయింట్స్ ఆన్‌‌లైన్ కంపెనీలకు వ్యతిరేకంగానే వచ్చినట్టు తెలిసింది. 41,600 కంప్లయింట్స్ బ్యాంక్‌‌లకు వ్యతిరేకంగా, 29,400 కంప్లయింట్స్ టెలికాం కంపెనీలకు వ్యతిరేకంగా వచ్చినట్టు వెల్లడైంది. గతేడాది కూడా మొత్తంగా దాఖలైన 5,65,000 కంప్లయింట్స్‌‌లో లక్షకు పైగా ఆన్‌‌లైన్‌‌ కంపెనీలకు వ్యతిరేకంగా వచ్చినవే. ఆన్‌‌లైన్‌‌ కంపెనీల కన్జూమర్ బేస్ పెరుగుతున్న కొద్దీ… కంప్లయింట్స్ కూడా బాగా పెరుగుతున్నాయని అధికారులు చెప్పారు. గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది కంప్లయింట్స్ సంఖ్య 40 శాతం నుంచి 50 శాతం పెరిగే అవకాశాలున్నాయని తెలిపారు. ఆన్‌‌లైన్ కంపెనీలకు వ్యతిరేకంగా వస్తోన్న కంప్లయింట్స్‌‌లో డెలివరీ జాప్యం, ఎక్స్చేంజ్‌‌లో సమస్యలు, నకిలీ ప్రొడక్ట్‌‌లు డెలివరీ కావడం వంటివి ఉన్నట్టు చెప్పారు. టెలికాం కంపెనీలకు వ్యతిరేకంగా దాఖలవుతున్న ఫిర్యాదుల్లో ఓవర్‌‌‌‌బిల్లింగ్, కనెక్టివిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫిర్యాదులు రిసీవ్ చేసుకున్న అనంతరం కన్జూమర్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆ ఫిర్యాదులను కంపెనీకి పంపించి, ఒక నిర్దేశిత సమయం లోపల పరిష్కరించమని ఆదేశిస్తోంది. గతేడాది వచ్చిన 5,65,000 ఫిర్యాదుల్లో 5,55,000 కంప్లయింట్స్‌‌ పరిష్కారమైనట్టు ప్రభుత్వాధికారులు చెప్పారు. ఒకవేళ  ఈ పరిష్కారంతో వినియోగదారుడు సంతృప్తి చెందకపోతే, సంబంధిత సిటీలో కన్జూమర్ ఫోరమ్స్‌‌ను ఆశ్రయించమని సూచిస్తున్నట్టు పేర్కొన్నారు.

 

Latest Updates