అమెరికా స్టాక్ మార్కెట్‌‌లోకి ఫ్లిప్‌‌కార్ట్ ..!

-అమెరికా మార్కెట్‌‌లో లిస్టింగ్‌‌
-బోర్డు మీటింగ్‌‌లో నిర్ణయం

దేశీయ ఆన్​లైన్​ కంపెనీ ఫ్లిప్‌‌కార్ట్ అందరికీ సుపరిచితమే. ఈకామర్స్ వ్యాపారాల్లో ఫుల్ పాపులర్ అయిన ఫ్లిప్‌‌కార్ట్‌‌ను, అమెరికన్ రిటైల్ అగ్రగామి వాల్‌‌మార్ట్ చేజిక్కించుకున్న సంగతీ తెలిసిందే. వాల్‌‌మార్ట్‌‌ సొంతం చేసుకున్న ఫ్లిప్‌‌కార్ట్ ఇక ఇప్పుడు అమెరికా ఈక్విటీ మార్కెట్‌‌లో లిస్ట్‌‌ కాబోతుంది. 2022 నాటికి ఫ్లిప్‌‌కార్ట్, అమెరికా స్టాక్ మార్కెట్‌‌లో అడుగుపెడుతుందని, ఈ మేరకు ఫ్లిప్‌‌కార్ట్ బోర్డు ఈ నెల మొదట్లో నిర్ణయం తీసుకున్నట్టు ఈ విషయం తెలిసిన వ్యక్తులు చెప్పారు. ఐపీఓ టైమ్‌‌లైన్ గురించి ఫ్లిప్‌‌కార్ట్ గ్రూప్ సీఈవో కల్యాణ్క్రికృష్ణమూర్తి అధికారికంగా తన టాప్ అధికారులకు చెప్పినట్టు వారు పేర్కొన్నారు. ఈ నెల మొదట్లో ఫ్లిప్‌‌కార్ట్ బోర్డు మీటింగ్‌‌ బెంటోన్‌‌విల్లే, అర్కన్సాస్‌‌లో జరిగింది. వాల్‌‌మార్ట్ వార్షిక షేర్‌‌‌‌హోల్డర్స్ కాన్ఫరెన్స్ సమయంలోనే ఫ్లిప్‌‌కార్ట్ బోర్డు సమావేశమైంది. ఈ సమావేశంలోనే ఐపీఓ, అమెరికా ఈక్విటీ మార్కెట్ లిస్టింగ్ గురించి చర్చించినట్టు సమాచారం. ఈ మీటింగ్‌‌లో కృష్ణమూర్తితో పాటు, ఆయన కోర్ టీమ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌‌లు ఉన్నారు. వచ్చే రెండేళ్లలో లాభాలను ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకోవడంతో పాటు, ప్రజల్లోకి వెళ్లేలా సన్నద్ధం కావాలని నిర్ణయించారు.

ఇన్వెస్టర్లకు మరింత నగదు…

ఫ్లిప్‌‌కార్ట్‌‌ను దక్కించుకోవడంతో, ఫిబ్రవరి–ఏప్రిల్ క్వార్టర్‌‌‌‌లో వాల్‌‌మార్ట్ అంతర్జాతీయ వ్యాపారాల నిర్వహణ లాభం, గ్రాస్ ప్రాఫిట్ రేటు తగ్గిపోయాయి. ఫ్లిప్‌‌కార్ట్ ఐపీఓకి వెళ్తే, దాని ఇన్వెస్టర్లైన వాల్‌‌మార్ట్, టెన్సెంట్, టైగర్ గ్లోబల్‌‌తోపాటు, కంపెనీ ఉద్యోగులకు కూడా మరింత లిక్విడిటీ అందనుంది. ఫ్లిప్‌‌కార్ట్ తాజాగా 100 మిలియన్ డాలర్ల విలువైన ఎంప్లాయీ స్టాక్ ఓనర్‌‌‌‌షిప్ ప్లాన్స్‌‌ను(ఈసాప్స్‌‌) సీనియర్, మధ్య స్థాయి ఉద్యోగులకు జారీ చేసింది. ఈ ఇండియన్ కంపెనీలో మెజార్టీ వాటాలను వాల్‌‌మార్ట్ కొనడంతో, కీలక ఉద్యోగులు సంస్థ నుంచి బయటికి వెళ్లకుండా ఉండేందుకు ఈ ఈసాప్స్‌‌ను జారీ చేసింది. ఫ్లిప్‌‌కార్ట్‌‌ను  ఐపీఓకి తీసుకెళ్లడం, లాభాదాయక కంపెనీగా మలచడమే ప్రస్తుతం వాల్‌‌మార్ట్ ముందున్న లక్ష్యమని తెలిసింది. తాజాగా ఈకామర్స్ సంస్థల కోసం కొత్త ఎఫ్‌‌డీఐ రెగ్యులేషన్స్‌‌ను తీసుకొస్తూ.. ప్రభుత్వం పాలసీలను మార్చింది. డిస్కౌంట్లకు కోత పెట్టింది. అయితే పెద్ద మొత్తంలో డిస్కౌంట్లపైనే ఆధారపడ్డ ఇండస్ట్రీని లాభాదాయక వ్యాపారాలుగా మలచడం వాల్‌‌మార్ట్‌‌కు సవాలేనని ఈ పరిణామాలు తెలిసిన ఓ వ్యక్తి చెప్పారు. ఈ విషయంపై కంపెనీ ఎలాంటి కామెంట్ చేయలేదు. ‘బోర్డు చర్చలపై మేము కామెంట్ చేయం. ఈ విషయంపై ముందు చెప్పిన మాదిరిగానే, ఐపీఓ అనేది ఫ్లిప్‌‌కార్ట్ లక్ష్యాల్లో ఒక భాగం. ఇది దీర్ఘకాలిక స్ట్రాటజీ. కానీ ప్రస్తుతం ఐపీఓకు వెళ్లేందుకు ఎలాంటి టైమ్‌‌ఫ్రేమ్‌‌ మా వద్ద లేదు’ అని ఫ్లిప్‌‌కార్ట్ అధికార ప్రతినిధి చెప్పారు. గతేడాది ఫ్లిప్‌‌కార్ట్‌‌ను వాల్‌‌మార్ట్ సొంతం చేసుకున్నప్పుడే వచ్చే నాలుగేళ్లలో ఐపీఓకు వెళ్తామని చెప్పింది. ఈ విషయంపై ఇటీవలే వాల్‌‌మార్ట్ సీఈవో డాక్ మెక్‌‌మిలాన్, వాల్‌‌మార్ట్ ఇంటర్నేషనల్ అధినేత జుడిత్ మెక్‌‌కెన్నాలు ఇండియాకు వచ్చినట్టు తెలిసింది.

బిన్నీ బన్సాల్‌‌ షేర్లు అమ్మేశారు

ఫ్లిప్‌‌కార్ట్ కో ఫౌండర్, మాజీ సీఈవో బిన్నీ బన్సాల్ మరో 5 లక్షల ఈక్విటీ షేర్లను అమ్మేశారని వాల్‌‌మార్ట్ తెలిపింది. బన్సాల్ 5,39,912 షేర్లను ప్రస్తుత ఎక్స్చేంజ్ రేటులో రూ.531 కోట్లకు వాల్‌‌మార్ట్‌‌ లక్సెంబర్గ్ ఎంటిటీ ఎఫ్‌‌ఐటీ హోల్డింగ్స్ ఎస్‌‌ఏఆర్‌‌‌‌ఎల్‌‌కు అమ్మేశారు. దీంతో ఫ్లిప్‌‌కార్ట్‌‌లో బన్సాల్‌‌ వాటా 3.85 శాతం నుంచి 3.52 శాతానికి పడిపోయింది. గతేడాది  ఫ్లిప్‌‌కార్ట్‌‌ను వాల్‌‌మార్ట్‌‌ కొన్నప్పుడు కూడా బిన్నీ బన్సాల్‌‌ కొన్ని షేర్లను అమ్మేశారు. ప్రస్తుతం ఈ షేర్లను కొనడంతో ఫ్లిప్‌‌కార్ట్‌‌లో వాల్‌‌మార్ట్ తన ఈక్విటీ హోల్డింగ్‌‌ను మరింత పెంచుకుంది. గతేడాది కొనుగోలు చేసిన సమయంలో ఫ్లిప్‌‌కార్ట్‌‌లో వాల్‌‌మార్ట్ 77 శాతం వాటాను దక్కించుకున్న సంగతి తెలిసిందే.

Latest Updates