ఫ్లిప్​కార్ట్​ అవుతోంది.. పక్కా లోకల్​

అగ్రరాజ్యం అమెరికా కంపెనీ వాల్‌‌‌‌మార్ట్‌‌‌‌కు చెందిన ఫ్లిప్‌‌‌‌కార్ట్‌‌‌‌ దిగుమతులను వేగంగా తగ్గించుకుంటోంది. అత్యధిక వస్తువులను ఇండియాలోనే తయారు చేయిస్తోంది. ఫ్లిప్‌‌‌‌కార్ట్‌‌‌‌ సొంతంగా (ప్రైవేట్‌‌‌‌ లేబుల్స్‌‌‌‌) 300 ప్రొడక్ట్స్‌‌‌‌ అమ్ముతోంది. వీటిని చైనా, మలేషియాలో తయారు చేయించి ఇక్కడికి తీసుకొస్తోంది. గత ఏడాది నుంచి దిగుమతులను తగ్గించుకుంటూ, మెజారిటీ వస్తువులను స్థానికంగానే సేకరిస్తోంది. దీనివల్ల దిగుమతి వ్యయాలు తగ్గడమే గాక, ఎన్డీయే ప్రభుత్వం అమలు చేస్తున్న మేకిన్‌‌‌‌ ఇండియా కార్యక్రమానికి అనుగుణంగా వ్యవహరించినట్టు అవుతుందని కంపెనీ భావిస్తోంది.

ఫ్లిప్‌‌‌‌కార్ట్‌‌‌‌ ప్రైవేట్‌‌‌‌ లేబుల్‌‌‌‌ బిజినెస్‌‌‌‌ హెడ్‌‌‌‌ ఆదర్శ్‌‌‌‌ మెనన్‌‌‌‌ దీనిపై మాట్లాడుతూ రెండేళ్ల క్రితం వరకు అన్ని ఎలక్ట్రానిక్‌‌‌‌ వస్తువులను చైనా నుంచే తీసుకొచ్చేవాళ్లమని తెలిపారు. ఇలాంటి దిగుమతులను 50 శాతం తగ్గించామని, ఫర్నిచర్‌‌‌‌ విషయంలోనూ ఇలాగే చేస్తున్నామని వివరించారు. మార్క్‌‌‌‌, ఫెర్‌‌‌‌ఫెక్ట్‌‌‌‌ హోమ్స్‌‌‌‌, బిలియన్‌‌‌‌, స్మార్ట్‌‌‌‌ బై.. ఫ్లిప్‌‌‌‌కార్ట్‌‌‌‌ ప్రైవేట్ లేబుల్‌‌‌‌ బ్రాండ్లు. కంపెనీ అమ్మకాల్లో వీటి వాటా ఎనిమిది శాతం. అండ్రాయిడ్‌‌‌‌ టీవీలు, ఏసీలు, వాషింగ్‌‌‌‌ మెషీన్లు, చిన్న ఎలక్ట్రానిక్‌‌‌‌ వస్తువులను ఇప్పుడు ఇండియాలోనే తయారు చేయిస్తున్నామని మెనన్‌‌‌‌ వెల్లడించారు. ఫ్లిప్‌‌‌‌కార్ట్‌‌‌‌ ద్వారా అమ్ముడయ్యే యాక్సెసరీల్లో 60 శాతం స్థానికంగా తయారైనవేనని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 150 ఫ్యాక్టరీలతో తమకు ఒప్పందాలు ఉన్నాయని, వీటిలో 100 ఫ్యాక్టరీలు ఇండియాలోనే ఉన్నాయని చెప్పారు. అంతర్జాతీయ ఎలక్ట్రానిక్‌‌‌‌ కంపెనీలు ఇండియాలో తమ ప్లాంట్లను తెరవాలని ఇండియా కోరుతున్న నేపథ్యంలో ఫ్లిప్‌‌‌‌కార్ట్‌‌‌‌ తన దిగుమతులను తగ్గించుకుంటోంది.

చిన్న సెల్లర్ల ఆందోళన
స్మార్ట్‌‌‌‌ఫోన్లు, ఇతర ఖరీదైన ఎలక్ట్రానిక్‌‌‌‌ పరికరాల దిగుమతులపై ఇండియా భారీగా సుంకాలు వసూలు చేస్తోంది. దీంతో ఆపిల్‌‌‌‌ వంటి కంపెనీలు ఇండియాలోనే ఫోన్లను తయారు చేయడానికి రెడీ అవుతున్నాయి. ఇందుకోసం విస్ట్రన్‌‌‌‌, ఫాక్స్‌‌‌‌కాన్‌‌‌‌ వంటి కంపెనీలతో జట్టుకడుతున్నాయి. అమెజాన్‌‌‌‌ కూడా దిగుమతులను తగ్గించుకొని స్వదేశీ వస్తువులనే అమ్ముతోంది.  ఏసీ, మొబైల్‌‌‌‌ఫోన్‌‌‌‌ యాక్సెసరీలు, డేలీ ప్రొడక్ట్స్‌‌‌‌, హోం, కిచెన్‌‌‌‌, బేబీకేర్ ప్రొడక్టులను అమెజాన్‌‌‌‌ సొంతంగా తయారు చేయించి అమ్ముతోంది. అయితే ఉత్పత్తి సామర్థ్యం గురించి వెల్లడించడానికి మాత్రం ఇది నిరాకరించింది. ఇదిలా ఉంటే, ఫ్లిప్‌‌‌‌కార్ట్‌‌‌‌, అమెజాన్‌‌‌‌లు ప్రైవేట్‌‌‌‌ లేబుల్స్‌‌‌‌ అమ్మడాన్ని చిన్న సెల్లర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

పోటీని తట్టుకోవడానికి తాము తప్పనిసరిగా ధరలను తగ్గించాల్సి వస్తున్నదని అంటున్నారు. ఈ–కామర్స్‌‌‌‌ కంపెనీల కోసం కేంద్రం గత డిసెంబరులో కొత్త ఎఫ్‌‌‌‌డీఐ విధానాన్ని ప్రకటించింది. ఇలాంటి కంపెనీలు ప్రైవేట్‌‌‌‌ లేబుల్స్‌‌‌‌ అమ్మకూడదని మొదట పేర్కొన్నా, తదనంతరం అనుమతులు ఇచ్చింది. ఈ–కామర్స్ కంపెనీలు స్థానికంగా ఉత్పత్తులు తయారు చేసి అమ్మకుండా నిషేధించడం సరికాదని ఈ రంగంలో నిపుణులు ఆక్షేపించడంతో వెనక్కి తగ్గింది. మార్కెట్లో కొరత ఉన్న ప్రొడక్టులనే తాము ప్రైవేటు లేబుల్స్‌‌‌‌ ద్వారా అమ్ముతున్నామని కంపెనీలు వాదించాయి. స్వదేశంలో వస్తువులను తయారు చేయడం వల్ల స్థానిక కంపెనీలకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నాయి.

Latest Updates