ఫ్లిప్‌కార్ట్‌లో లోక‌ల్ లాంగ్వేజీ: తెలుగు, త‌మిళ్ స‌హా..

క‌స్ట‌మ‌ర్ల‌కు చేరువ‌య్యేందుకు ఈ- కామర్స్‌ దిగ్గజం ఫిప్‌కార్ట్ ఎప్ప‌టిక‌ప్పుడు లోక‌ల్ ఫ్లేవ‌ర్‌ను జోడిస్తూ వ‌స్తోంది. ప్రాంతీయ భాష‌ల‌తో మ‌రింత‌గా వినియోగ‌దారుల‌ను పెంచుకునేందుకు కొత్త ఇన్‌షియేటివ్‌తో ముందుకొచ్చింది. ఇప్పటికే హిందీలో లాంగ్వేజ్ సెట్టింగ్ మార్చుకుని షాపింగ్ చేసే అవ‌కాశం క‌ల్పించిన ఫ్లిప్‌కార్ట్ తాజాగా తెలుగు, త‌మిళం, క‌న్న‌డ వంటి ద‌క్షిణాది భాష‌ల్లో అందుబాటులోకి వ‌చ్చింది. దేశ వ్యాప్తంగా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు సేవ‌ల‌ను అందుబాటులోకి తెచ్చే ల‌క్ష్యంతో ఫ్లిప్‌కార్ట్ యాప్‌ను లోక‌ల్ భాష‌ల్లో వాడుకునేలా అప్‌డేట్ చేసిన‌ట్లు ఆ సంస్థ తెలిపింది. మొత్తం 54 ల‌క్ష‌ల ప‌దాల‌తో (ప్రాంతీయ భాషల్లో) ఫ్లిప్‌కార్ట్ పేజీల‌ను చూడ‌గ‌లిగేలా మార్పులు చేసిన‌ట్లు వెల్ల‌డించింది. గత ఏడాది సెప్టెంబర్‌లో హిందీ భాషలో వినియోగదారులకు సేవలను అందించామని ఫ్లిప్‌కార్ట్‌ గుర్తుచేసింది. హిందీ భాషలో సేవలందించడం ద్వారా వినియోగదారులు సంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారని, ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలలో భారీగా పెరుగుతున్న వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని.. వారికి భాషాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ప్రాంతీయ భాషలలో సేవలందించనున్నట్లు తెలిపింది. ప్రాంతీయ భాషల్లో సేవలందించాల‌న్న ప్లాన్‌లో భాగంగా విశాఖపట్నం, మైసూర్‌లలో భాషలకు సంబంధించిన పదాలను అధ్యయనం చేశామని ఆ సంస్థ చెప్పింది. ఈ కొత్త మార్పుల‌తో దేశవ్యాప్తంగా ఫ్లిప్‌కార్ట్ సేవ‌లు క‌స్ట‌మ‌ర్ల‌కు మ‌రింత చేరువ‌వుతాయ‌ని ఆశాభావం వ్య‌క్తం చేసింది.

Latest Updates