శ్రీశైలం డ్యాం కు మళ్లీ పెరుగుతున్న వరద

కృష్ణా నదిలో వరద స్వల్పంగా పెరగడమే కారణం

1 గేటు ఎత్తి 28 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల

ప్రస్తుతం శ్రీశైలం డ్యాం వద్ద టోటల్ ఇన్ ఫ్లో: 96,646 క్యూసెక్కులు, మొత్తం అవుట్ ఫ్లో: 96,646

విజయవాడ: కృష్ణా నదిలో వరద ప్రవాహం మళ్లీ పెరుగుతోంది. ఎగువన కృష్ణా.. తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల నుండి వరద స్వల్పంగా పెరగడంతో శ్రీశైలం డ్యాం వద్ద ఒక గేటు ఎత్తి నీటి విడుదలను ప్రారంభించారు. ఎగువ నుండి వరద క్రమంగా పెరిగే అవకాశం ఉండడంతో మరిన్ని గేట్లు ఎత్తి నీటి విడుదలను పెంచే పరిస్థితి కనిపిస్తోంది. ఈ సీజన్లో శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తడం ఇది మూడోసారి.

తుంగభద్ర డ్యాం 9 గేట్లు ఎత్తివేత

కర్నాటకలోని తుంగభద్ర డ్యాం కు వరద పెరగడంతో…. తుంగభద్ర డ్యాం వద్ద 9 గేట్లు ఎత్తారు. తుంగభద్ర డ్యాం పూర్తి స్థాయిలో నిండి ఉండడంతో.. నిల్వ చేసే అవకాశం లేక వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర డ్యాం కెపాసిటీ 1633 అడుగులతో.. 100.86 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 1632. అడుగులతో.. 100.39 టీఎంసీల నీటిని నిల్వ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం 36 వేల 689 క్యూసెక్కుల వరద వస్తుండగా.. 9 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 26 వేల 190 క్యూసెక్కులు.. కాలువలు.. నదిలోకి మొత్తం 39 వేల 360 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ఆల్మట్టి నుండి 34 వేల క్యూసెక్కులు

ఎగువన మహారాష్ట్రలో పరిధిలోని కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టి డ్యాంకు వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. ప్రస్తుతం దాదాపు 34 వేల క్యూసెక్కుల వరద వస్తుండడంతో వస్తున్న నీటిని వస్తున్నట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నీళ్లన్నీ నారాయణపూర్.. జూరాల మీదుగా శ్రీశైలం చేరుకుంటున్నాయి. ఆల్మట్టి నుండి వరద నిలకడగా వస్తుండడంతో జూరాల వద్ద వరద ఉధృతిని బట్టి గేట్లు ఎత్తి దిగువన శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు.

జూరాల వద్ద విద్యుత్ ఉత్పత్తి కంటిన్యూ

ఎగువన ఆల్మట్టి నుండి వరద కొనసాగుతుండడంతో జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని ప్రియదర్శిని జూరాల డ్యాం వద్ద విద్యుత్ ఉత్పత్తి కంటిన్యూ చేస్తోంది తెలంగాణ సర్కార్. పీక్ డేస్ లో శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం ప్రమాదానికి గురికావడంతో.. జల విద్యుత్ కోసం ఎక్కువగా జూరాలపైనే ఆధారపడుతోంది. నిరంతరం వరద కొనసాగుతుండడంతో జూరాల వద్ద పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు కెపాసిటీ 1045 అడుగులతో 9.66 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 1044.82 అడుగులతో.. 9.54 టీఎంసీల నీటిమట్టం కొనసాగిస్తూ.. దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. జూరాల వద్ద ఇన్ ఫ్లో 36 వేల 689 క్యూసెక్కులు వస్తుండగా.. 9 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 8 వేల 380 క్యూసెక్కులు.. విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 38 వేల 317 క్యూసెక్కులు కలిపి మొత్తం 46 వేల 697 క్యూసెక్కులు  దిగువన శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం డ్యాంకు క్రమంగా పెరుగుతున్న వరద

కృష్ణ.. తుంగభద్ర నదుల్లో వరద ప్రవాహం మళ్లీ పెరుగుతోంది. దీంతో శ్రీశైలం డ్యాం వద్ద కూడా నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో వరద మరింత పెరిగే అవకాశం ఉండడంతో ఇవాళ ఉదయం 6 గంటలకు అధికారులు శ్రీశైలం డ్యాం 1 గేటు ఎత్తి దిగువన నాగార్జునసాగర్ కు నీటి విడుదలను పెంచారు. వరద మరింత పెరిగే అవకాశం ఉండడంతో.. శ్రీశైలం డ్యాం వద్ద మరికొన్ని గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదలను పెంచే పరిస్థితి కనిపిస్తోంది. శ్రీశైలం డ్యాం కెపాసిటీ 885 అడుగులతో.. 215.807 టీఎంసీలు కాగా.. పూర్తిగా నిండిపోయి ఉంది. దీంతో వస్తున్న వరదను వస్తున్నట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం డ్యాంకు 91 వేల 207 క్యూసెక్కుల వరద వస్తుండగా.. 1 గేటును 10 అడుగుల మేర ఎత్తి నీటి విడుదల చేశారు. శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తడం ఈ సీజన్లో ఇది మూడోసారి. వరద పెరిగే అవకాశం ఉండడంతో మరికొన్ని గేట్లు కూడా తెరిచే అవకాశం ఉంది. ప్రస్తుతం శ్రీశైలం డ్యాం నుండి ఏపీ జల విద్యుత్ కేంద్రంలో పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పత్తి ద్వారా  31 వేల 490 క్యూసెక్కులు.. డ్యాం గేటు ద్వారా 28 వేల 75 క్యూసెక్కులు.. పోతిరెడ్డిపాడు ద్వారా 33 వేల క్యూసెక్కులు..  కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2400 క్యూసెక్కులు.. మల్యాల హంద్రీ-నీవాకు 2026 క్యూసెక్కులు చొప్పున మొత్తం 96 వేల 992 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

Latest Updates