
డైలీ 15 నుంచి 20 మంది వస్తుండగా..
అధికారులను అడిగితే నో రెస్పాన్స్
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బాధితులు
హైదరాబాద్, వెలుగు: “ భారీ వర్షాలు.. వరదల సమయంలో మీ ఇంటి వస్తువులకు జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని, సీఎం రిలీఫ్ ఫండ్ కింద మీకు రూ. 10,000 మంజూరు చేయబడింది. ఈ మొత్తం మీ బ్యాంక్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయబడింది.. ఇది మీ కుటుంబానికి సహాయంగా ఉంటుందని మేం ఆశిస్తున్నాం.. కమిషనర్ జీహెచ్ఎంసీ’’.. అంటూ వరద బాధితులకు మెసేజ్లు వస్తున్నాయి. వాటిని చూసి వెంటనే బ్యాంకుకి పోయి అకౌంట్ చెక్ చేసుకుంటే డబ్బులు పడినట్టు కనిపించడం లేదు. దీంతో ఏం చేయాలో తెలియక బాధితులు జీహెచ్ఎంసీ హెడ్డాఫీస్కు క్యూ కడుతున్నారు. ఎన్నికలకు ముందు బాధితుల బ్యాంకు అకౌంట్లలో డబ్బులు వేస్తామని ప్రభుత్వం చెప్పి రోజులు గడుస్తున్నా ఇంకా ఇవ్వడం లేదు. కానీ అకౌంట్లో వేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ పేరుతో మెసేజ్ లు వస్తున్నాయి. డబ్బులు మాత్రం పడలేదంటూ రోజూ 15 నుంచి20 మంది బల్దియా హెడ్డాఫీసుకు వెళ్తున్నారు. అక్కడికెళ్లి అడిగితే అధికారులు సరైన సమాధానం చెప్పడంలేదు. తమకేమీ తెలియదని దాట వేస్తున్నారు. సెక్యూరిటీ గార్డులు లోపలికి కూడా పోనివ్వడం లేదు. దీంతో సాయం డబ్బులు ఇంకెప్పుడు ఇస్తరంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరాశతో వెనుదిరిగిపోతున్నారు. ఇలా మెసేజ్లు వచ్చి డబ్బులు రాని వారు గ్రేటర్పరిధిలో వేలల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
ఎక్కడికెళ్లినా..
వరదసాయం మెసెజ్ లు వచ్చిన తర్వాత మీ సేవ సెంటర్కి వెళ్లి అడిగినా తమకేమి తెలియదంటున్నారని బాధితులు చెబుతున్నారు. తమ పరిధిలోని బల్దియా జోనల్ఆఫీసులకు వెళ్లినా సరైన సమాధానం రావడం లేదు. ఏం చేయాలో తెలియక బాధితులు 4 రోజులుగా బల్దియా హెడ్డాఫీస్కు వెళ్తున్నారు. ఇటీవల ఓ బాధితురాలు బల్దియా అధికారి కాళ్లపై పడి వరద సాయం ఇవ్వాలని వేడుకుంది. అయినా ఆయన నుంచి సరైన జవాబు రాలేదు.
మెసేజ్ చూపుతూ…
జీహెచ్ఎంసీ కమిషనర్ పేరుతో బాధితులకు మెసేజ్లు వచ్చాయని, సాయం డబ్బులు మాత్రం అకౌంట్లలో జమకాలేదని వరద బాధితులు చెబుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకుంటుందని అనుకున్నాం, కానీ ఇ లా మెసేజ్లు పంపి మోసం చేస్తుందనుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు 7.20లక్షల మందికి వరద సాయం అందించినట్టు ప్రభుత్వం చెప్పింది. వారం రోజుల కిందటి వరకు సాయం అందిస్తున్నట్లు ప్రకటించింది. కానీ వారం రోజులుగా చెప్పడం లేదు. అంటే ఆ తర్వాత ఎవరికి కూడా అందించడం లేదని తెలుస్తోంది.
మెసేజ్ వచ్చింది కానీ డబ్బులు రాలే..
ఎన్నికల ముందు మీసేవ లో సాయం కోసం అప్లై చేసుకున్నా. అకౌంట్లో డబ్బులు జమచేశామని కమిషనర్ పేరుతో మెసేజ్ వచ్చింది. కానీ డబ్బులు రాలేదు. ఆఫీసుకు పోయి అడిగితే ఎవరూ సరైన సమాధానం చెప్పడం లేదు. అసలు ఇస్తరా ? ఇవ్వరా అని కూడా చెప్పడం లేదు.–సునీత, బాగ్అంబర్పేట్