ఉత్తరాఖండ్, ఒడిశా, కేరళలో భారీ వర్షాలు

floods-in-uttara-khand-maharashtra-kerala-odisha

ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. చమోలీ జిల్లాలో ప్రమాదాలు పెరుగుతున్నాయి. కొండ చరియలు విరిగిపడడంతో 10 ఇళ్లు కూలిపోయాయి. దీంతో వారంతా నిరాశ్రయులయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు.. అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరికొన్ని రోజులు ఇలాగే కుండపోత వానలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

ఒడిశాలో వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కలహండి ప్రాంతంలో వరదలు పోటెత్తుతున్నాయి. ఇంద్రావతి డ్యాం రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఒడిశాలోని 6 జిల్లాల్లో 100 మిల్లీమీటర్ల మేర వర్షపాతం రికార్డ్ అయింది. మల్కన్ గిరి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు. రాయగడ జిల్లాలోనూ వసుంధర రివర్ లో ప్రవాహం పెరిగింది. దీంతో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సహాయక చర్యల్లో ఉన్నాయి.

కేరళలో భారీ వర్షాలు, వరదలు పోటెత్తుతున్నాయి. దీంతో చాలా జిల్లాల్లో పరిస్థితి దారుణంగా తయారైంది. గతేడాది కేరళలో వచ్చిన వరదలతో 350 మంది చనిపోయారు. గతంలో 14 జిల్లాలు వరద బారిన పడ్డాయి. ఇప్పుడు కూడా పరిస్థితి అలాగే తయారవుతోంది. వయనాడ్, ఎర్నాకులం, ఇడుక్కి, మలప్పురం, కోజికోడ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే 48 గంటల్లో మరిన్ని భారీ వర్షాలు కురుస్తాయని IMD హెచ్చరించింది. దీంతో అధికార యంత్రాంగం మరింత అలర్ట్ అయింది. భారీ వర్షాలతో కేరళలో విద్యా సంస్థలకు సెలవు ఇచ్చారు. చాలా చోట్ల ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది లాంటి పరిస్థితే రిపీట్ అవుతుందేమోనన్న ఆందోళన కనిపిస్తోంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, కేరళ, కర్ణాటకలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వయనాడ్ లో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి వరకు 100 మంది ndrf సిబ్బంది రక్షించారు. అటు కేరళలో  మొత్తం 315 క్యాంపులు ఏర్పాటు చేశారు. 22 వేల 165 మంది పునరావాస కేంద్రాల్లో ఉన్నారు.

Latest Updates