కారు ప్రమాదం ఇలా జరిగింది..!

అదుపు తప్పి..గాలిలో పల్టీలు కొట్టి
ఫ్లై ఓవర్ పైనుంచి కింద పడ్డ కారు
మహిళ దుర్మరణం.. హైదరాబాద్​లోని గచ్చిబౌలిలో ప్రమాదం
మరో నలుగురికి తీవ్ర గాయాలు.. కేర్​లో చికిత్స
ప్రమాదం సమయంలో 104 కి.మీ స్పీడుతో కారు
మృతురాలి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్​గ్రేషియా

హైదరాబాద్, వెలుగుహైదరాబాద్​లోని గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్​పై మితిమీరిన వేగంతో వచ్చిన కారు.. అదుపు తప్పి పై నుంచి కింద పడటంతో ఓ మహిళ అక్కడికక్కడే దుర్మరణం చెందింది.
మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదంలో మృతి చెందిన మహిళ కుటుంబానికి మేయర్ బొంతు రామ్మోహన్ రూ.5 లక్షల ఎక్స్​గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. వివరాలను పోలీసులు వెల్లడించారు.

బస్సు కోసం ఎదురు చూస్తుండగా..

పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు ప్రాంతానికి చెందిన సోమశేఖర్, సత్యవాణి తన కుమార్తెలతో కలిసి హైదరాబాద్​లోని మణికొండలో నివాసం ఉంటున్నారు. సోమశేఖర్ ఈవెంట్ మేనేజర్​గా పనిచేస్తున్నాడు. శనివారం సత్యవేణి తన కుమార్తె ప్రణితతో కలిసి కూకట్​పల్లిలో రెంట్ కోసం ఇల్లు చూసేందుకు బయలుదేరింది. కూకట్​పల్లి వెళ్లేందుకు బయోడైవర్సిటీ జంక్షన్​వద్ద బస్సు కోసం వారిద్దరూ ఎదురు చూస్తున్నారు. మధ్నాహ్నం 1.04 గంటల సమయంలో ఖాజగూడ సిగ్నల్ నుంచి హైటెక్ సిటీ వైపు ఫోగ్స్​వ్యాగన్​ కారు(టీఎస్​09ఈడబ్లూ5665)లో మిలాన్​ కృష్ణ అనే వ్యక్తి ఫ్లైఓవర్​పై వేగంగా వచ్చాడు. అయితే మూలమలుపు వద్ద వేగాన్ని అదుపు చేయలేక రోడ్డు గోడను ఢీకొట్టాడు. దీంతో కారు ఫ్లైఓవర్​కింద రోడ్డుపైకి పల్టీలు కొడుతూ పడిపోయింది. వేగంగా బౌన్స్ అయి.. చెట్టుని ఢీకొట్టింది.

ఆ సమయంలో అక్కడే నిలబడి ఉన్న సత్యవేణి(56)పై పడింది. ప్రమాదంలో ఆమె చనిపోయింది. ఆమె కుమార్తె ప్రణీత(26), మరో యువతి కుబ్రా(23), ఖానామేట్ ఇజ్జత్​నగర్ ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ బాలు నాయక్​(38)కు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదానికి కారణమైన కృష్ణ మిలాన్ కారులోని ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అతడికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని స్థానికంగా ఉన్న కేర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. ప్రమాదంలో నాలుగు కార్లు, మూడు ఆటోలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. సైబరాబాద్ సీపీ సజ్జనార్, ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్​తోపాటు జీహెచ్ఎంసీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు.

గాయపడ్డ వారి పరిస్థితి ఇదీ..

మిలాన్ కృష్ణ (27): పలు చోట్ల ఫ్రాక్చర్లు అయ్యాయి.
ఇనుప రేకులు గుచ్చుకుని గాయాలయ్యాయి. ఇతడిని ఐసీయూలో ఉంచి మల్టిడిసిప్లినరీ టీమ్ చికిత్స అందిస్తోంది.
బాలు నాయక్ (38): ఎడమ అరికాలికి ఫ్రాక్చర్ అయింది.
ఆర్థోపెడిక్ సర్జన్లు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.
కుబ్రా (23): నడుము ప్రాంతంలో పలు ఫ్రాక్చర్లు అయ్యాయి.
ఆర్థోపెడిక్ సర్జన్లు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.
అందరి ఆరోగ్య పరిస్థితి స్టేబుల్​గానే ఉందని కేర్ ఆస్పత్రి డాక్టర్లు చెప్పారు.

104 స్పీడుతో..

ప్రమాదం జరిగిన సమయంలో గంటకు104 స్పీడ్ తో కార్ వెళుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అంత స్పీడుతో ఢీకొనడంతో 18 మీటర్ల ఎత్తు నుంచి కింద పడిన కారు.. అంతే వేగంతో 5 అడుగుల ఎత్తుకు బౌన్స్ అయింది. రెప్పపాటులో మూడు పల్టీలు కొడుతూ అక్కడే నిల్చున్న ప్రయాణికులు, పార్క్ చేసి ఉన్న కార్లపైకి దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టి కుప్పకూలింది. ఓవర్ స్పీడ్ తో కారు డ్రైవ్ చేసినందుకు కృష్ణపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్ స్టాప్ లో15 నుంచి 20 మంది నిల్చుని ఉన్నారు. పై నుంచి కిందికి పడుతున్న కారు నీడను గమనించి ఓ యువతి వెనక్కి వచ్చింది. సైన్ బోర్డు రాడ్డు ఆమె ముందే పడిపోవడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది.

ఇంటర్వ్యూకి వెళ్లి వస్తూ..

అనంతపురం జిల్లాకు చెందిన కుబ్రా బీటెక్ పూర్తి చేసి ఎస్ఆర్​నగర్​లోని ఓ హాస్టల్​లో నివాసం ఉంటూ జాబ్ కోసం ప్రయత్నిస్తోంది. శనివారం గచ్చిబౌలిలోని పీపుల్ టెక్​ కంపెనీలో ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి తిరిగి హాస్టల్​కు వెళ్లేందుకు బస్సు కోసం ఎదురు చూస్తుండగా ప్రమాదంలో గాయపడింది. ఆటో డ్రైవర్ బాలునాయక్​ఎడమ కాలికి తీవ్ర గాయమైంది. ప్రమాదానికి కారణమైన మిలాన్​ కృష్ణ వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం వీరు కేర్ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద నివారణ చర్యలు చేపట్టేందుకు మూడు రోజుల పాటు ఫ్లైఓవర్ పై రాకపోకలు నిలిపేసినట్లు అధికారులు చెప్పారు.

మరిన్ని వార్తల కోసం

Latest Updates