
ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా నిర్మిస్తున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ పార్కు సమీపంలో ఈ పనులు రాత్రింబవళ్లు కొనసాగుతున్నాయి. మెహిదీపట్నం నుంచి మైండ్‌స్పేస్ వైపు లెవెల్–2 వంతెన ఎల్ షేప్‌లో నిర్మిస్తున్నారు. నగరంలో ఇంత పెద్ద ఫ్లైఓవర్ ఎక్కడా లేదు. మొత్తం6 లైన్ల రహదారితో 990 మీటర్ల పొడుగు, 18 మీటర్ల ఎత్తులో ఉంటుంది. మెహిదీపట్నం నుంచి గచ్చిబౌలి పోలీస్ కమిషనరేట్ వైపు నిర్మిస్తున్న లెవెల్1 ఫ్లైఓవర్ నిర్మాణాన్ని 690 మీటర్ల పొడవుతో నిర్మిస్తున్నారు. ఇది పూర్తయితే మెహిదీపట్నం నుండి మాదాపూర్, గచ్చిబౌలి వెళ్లేందుకు ఇబ్బందులు తప్పుతాయి. 2016లో రూ.98 కోట్ల వ్యయంతో పనులను ప్రారంభించి 2018 లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భూసేకరణ విషయంలో కొందరు భూ యజమానులు కోర్టుకు వెళ్లగా కొంత ఆలస్యమవుతోందని అధికారులు అంటున్నారు. నిర్మాణ పనుల్లో భాగంగా మొత్తం19 ఆస్తులను సేకరించాల్సి ఉండగా మరో 2 ఆస్తులు సేకరించాల్సి ఉంది. ఇందులో ఒకటి కోర్టులో కేసు నడుస్తుండగా, మరొకటి ప్రభుత్వం పరిధిలో ఉంది. పనుల్లో జాప్యం వల్ల ఈ జంక్షన్ వద్ద ట్రాఫిక్ తిప్పలు తప్పడం లేదు. దీంతో రాత్రి 2 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు మాత్రమే పిల్లర్ గడ్డర్ పనులు చేస్తున్నారు. ఎలాగైనా మరో మూడు నెలల్లో లెవల్– 2 ఫ్లైఓవర్‌ను కంప్లీట్ చేసి కొంత మేర అయినా ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు పనులు వేగంగా చేపడుతున్నామని అధికారులు తెలియజేస్తున్నారు.