ఎగిరే క్యాబ్‌‌లు వస్తున్నయ్‌‌

ఎగిరే క్యాబ్‌‌లు వస్తున్నయ్‌‌
  • ఎయిర్‌‌ ఏషియా నుంచి ఫ్లయింగ్‌‌ ట్యాక్సీలు

న్యూఢిల్లీ: మలేషియాకు చెందిన బడ్జెట్‌‌ ఎయిర్‌‌లైన్‌‌ కంపెనీ ఎయిర్‌‌ ఏషియా గ్రూప్‌‌ బెర్హాద్‌‌ వచ్చే ఏడాది నుంచి ఫ్లయింగ్‌‌ ట్యాక్సీ బిజినెస్‌‌ స్టార్ట్‌‌ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్నామని, ఏడాది లేదా ఏడాదిన్నరలో ఫ్లయింగ్‌‌ ట్యాక్సీలను అందుబాటులోకి తెస్తామని గ్రూప్‌‌ సీఈఓ టోనీ ఫెర్నాండెజ్‌‌ చెప్పారు. వర్చువల్‌‌గా నిర్వహించిన యూత్‌‌ ఎకనమిక్‌‌ ఫోరమ్‌‌లో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందులో నాలుగు సీట్లు ఉంటాయని, దీనిని క్వాడ్‌‌కాప్టర్‌‌ అంటారని వివరించారు. డ్రోన్ల ద్వారా డెలివరీ సర్వీసు కోసం మలేషియన్‌‌ గ్లోబల్‌‌ ఇనోవేషన్‌‌ క్రియేటివ్‌‌ సెంటర్‌‌తో చేతులు కలుపుతున్నామని కూడా టోనీ తెలిపారు. ‘‘కరోనా వల్ల అన్ని కంపెనీల మాదిరే మా కంపెనీ వ్యాపారం కూడా దెబ్బతిన్నది. నష్టాల నుంచి కోలుకోవడానికి ఈ–కామర్స్‌‌లోకి ప్రవేశిస్తున్నాం. ఇందుకోసం సూపర్‌‌ యాప్‌‌ను లాంచ్‌‌ చేశాం. దీని ద్వారా ట్రావెల్‌‌, షాపింగ్‌‌, లాజిస్టిక్‌‌ సేవలను అందిస్తాం’’ అని తెలిపారు. ప్రపంచమంతటా కరోనా వ్యాక్సినేషన్‌‌ మొదలైంది కాబట్టి ఏవియేషన్‌‌ సెక్టార్‌‌ పుంజుకుంటుందని అన్నారు. ప్రస్తుతం తాము 22 దేశాలను కలుపుతూ లోకాస్ట్‌‌ విమానాలను నడుపుతున్నామని, ఇవి ఎక్కువగా ఆసియా–పసిఫిక్‌‌ దేశాల్లోనే తిరుగుతాయని టోనీ పేర్కొన్నారు. రాబోయే మూడు వారాల్లోపు ఇంటర్‌‌స్టేట్‌‌ ఫ్లైట్స్‌‌ పూర్తిస్థాయిలో మొదలయ్యే చాన్సులు ఉన్నాయని వివరించారు. జూలై లేదా ఆగస్టులోపు విమానాల సేవలు కరోనా ముందుస్థాయికి చేరవచ్చని చెప్పారు. అయితే ఫ్లయింగ్‌‌ ట్యాక్సీలు ఎక్కడెక్కడ మొదలవుతాయనే విషయాన్ని టోనీ బయటపెట్టలేదు. అయితే ఎయిర్‌‌బస్‌‌ వంటి విమాన తయారీ కంపెనీలు కూడా త్వరలోనే ఫ్లయింగ్‌‌ ట్యాక్సీలను తెస్తామని ప్రకటించాయి. ఇవి కరెంటుతో నడుస్తాయని ప్రకటించింది. తాము కూడా వచ్చే ఏడాది లోపు ఫ్లయింగ్‌‌ కార్లను అందుబాటులోకి తెస్తామని బ్రిటన్‌‌ వెల్లడించింది. కోవెంట్రీ సిటీలో ఇందుకోసం ప్రత్యేక ఎయిర్‌‌పోర్టును నిర్మిస్తామని తెలిపింది. దుబాయిలోనూ ఫ్లయింగ్‌‌ ట్యాక్సీ ట్రయల్స్‌‌ జరిగాయి.