ఫ్లయింగ్​ సాసర్​ వచ్చింది

ఎప్పుడైనా ఫ్లయింగ్​ సాసర్​ చూశారా? దాదాపు ఎవరూ చూసి ఉండరు. కానీ, మన తాత ముత్తాతలు మాత్రం వాటి గురించి కథలుకథలుగా చెబుతూ ఉండేవారు కదా. ఆకాశ దేశాల జీవులు వాటిలో వచ్చేవని కథ చెప్పేటోళ్లు. తినకుండా మారాం చేసే చిన్నపిల్లలను వాళ్లు ఎత్తుకెళ్లిపోతారని అమ్మమ్మలు, నానమ్మలు భయంచెప్పి ముద్దలు తినిపించేటోళ్లు. మనం నిజంగా ఎప్పుడూ వాటిని చూడకపోయినా, ఇకపై చూసేయొచ్చు. ఇదిగో ఇదే ఆ ఫ్లయింగ్​ సాసర్​. నిజంగా నిజమైన ఫ్లయింగ్​ సాసర్​ ఇది. రుమేనియాలో ఇది ఎగిరింది. ఎటువైపు వెళ్లాలంటే అటువైపుకు కదిలింది. అయితే, ఇది గ్రహాంతర వాసుల ఫ్లయింగ్​ సాసర్​ కాదులెండి.

రుమేనియాకు చెందిన ఏరోడైనమిక్​ సైంటిస్ట్​ రజన్​ సాబీ దీనిని తయారు చేశాడు. ఎటువైపంటే అటువైపు వెళ్లేలా దానిని తయారు చేశాడు కాబట్టి దానికి ఆల్​ డైరెక్షనల్​ ఫ్లయింగ్​ ఆబ్జెక్ట్​ (ఆడైఫో) అని పేరు పెట్టాడు. పైలట్​ లేకుండా ఎగిరే దీనిని రిమోట్​తో నియంత్రించేసేయొచ్చు. రుమేనియాలోని నేషనల్​ ఇనిస్టిట్యూట్​ ఫర్​ ఏరోస్పేస్​ రీసెర్చ్​లో మాజీ సీనియర్​ సైంటిస్ట్​, ప్రస్తుతం నేషనల్​ ఏవియేషన్​ ఇనిస్టిట్యూట్​లో ఏరోడైనమిక్స్​ హెడ్​ అయిన యూసిఫ్​ తపోసుతో కలిసి 20 ఏళ్ల పాటు పనిచేసి దీనిని తయారు చేశాడట రజన్​.

నేరుగా పైకి లేచేలా దీని కింది భాగంలో నాలుగు డక్ట్​ ఫ్యాన్లు పెట్టారు. గాల్లో ఎగిరేందుకు శక్తినిచ్చేలా వెనక భాగంలో రెండు థ్రస్టర్​ ఇంజన్లను ఏర్పాటు చేశారు. పక్కకూ దూసుకెళ్లేలా మరికొన్ని థ్రస్టర్లనూ అమర్చారు. సూపర్​సోనిక్​ (ధ్వని వేగంతో దూసుకెళ్లేది) స్పీడ్​తో ఇది దూసుకెళుతుందట. దీని ప్రొటోటైప్​ను విజయవంతంగా టెస్ట్​ చేశారు. దీనిపై కొన్ని దేశాల ప్రభుత్వాలు, ఒక విమానాలను తయారు చేసే సంస్థ ఆసక్తి చూపిస్తున్నాయని రజన్​ చెప్పాడు. 1950–60ల్లో అమెరికా మిలటరీ వాటిపై ప్రయోగాలు చేసినా అనుకున్న ఫలితాలను సాధించలేకపోయింది.

Latest Updates