లైఫ్.. లైవ్లీహుడ్.. రెండూ ముఖ్యమే

న్యూఢిల్లీ:  జీవితం, జీవనోపాధి.. రెండూ ముఖ్యమేనని, రెండింటిపైనా కేంద్రం దృష్టిసారించిందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఒకవైపు అనుమానితులకు కరోనా టెస్టులు, కాంటాక్ట్​ ట్రేసింగ్​ చేస్తూనే మరోవైపు ఎకనామిక్​యాక్టివిటీని పెంచాలని అన్నారు. లాక్​డౌన్​ సడలింపుల తర్వాత దేశంలో కరోనా ప్రభావంపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ భేటీ అవుతున్నారు. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంతో పాటు అదే టైంలో ఎకానమీ కోలుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వారితో చర్చిస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి రోజు 21 మంది సీఎంలతో మంగళవారం ఆయన రివ్యూచేశారు. రెండో రోజు బుధవారం 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సీఎంలు, లెఫ్టినెంట్​ గవర్నర్లతో సమావేశమయ్యారు. ఇప్పుడున్న హెల్త్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ను మరింత పటిష్టంగా మార్చుకోవడంతో పాటు వైరస్​ బాధితులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ చెప్పారు. కరోనా పేషెంట్లపై వివక్ష చూపొద్దని చెప్పారు. దేశంలో కరోనా పేషెంట్ల రికవరీ రేట్​ పెరగడం శుభసూచకమని చెబుతూనే.. టెస్టుల సంఖ్య పెంచాలని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. టెస్టులు పెంచడం ద్వారానే వైరస్​ బాధితులను తొందరగా గుర్తించి, ఐసోలేషన్​ చేయడం, ట్రీట్​మెంట్​ ఇవ్వడం సాధ్యమవుతుందని మోడీ వివరించారు. దేశవ్యాప్తంగా ఇప్పుడు 900 కు పైగా కరోనా టెస్టింగ్​ ల్యాబ్​లు ఉన్నాయని ప్రధాని చెప్పారు. పేషెంట్ల కోసం లక్షలాది బెడ్స్, వేలాదిగా క్వారంటెయిన్, ఐసోలేషన్​ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

కరోనా సోకితే ప్యానిక్​ కావొద్దు
కరోనా ఇన్​ఫెక్షన్​ విషయంలో ప్రజల్లో పేరుకుపోయిన భయాందోళనలను పోగొట్టేందుకు చర్యలు తీసుకోవాలని సీఎంలకు ప్రధాని సూచించారు. వైరస్​ బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య చాలా ఎక్కువే ఉందన్నారు. రోజురోజుకూ రికవరీ అయ్యేవాళ్ల సంఖ్య వేగంగా పెరుగుతోందని, వైరస్​ సోకినంత మాత్రాన ప్యానిక్​ కావాల్సిన అవసరం లేదని మోడీ చెప్పారు.

ఒక్కోచోట ఒక్కోలా వైరస్​ ప్రభావం
దేశంలోని అన్ని చోట్లా వైరస్​ ఒకేలా వ్యాపించడంలేదని, ఒక్కోచోట ఒక్కోలా ప్రభావం చూపిస్తోందని మోడీ తెలిపారు. కొన్ని సిటీల్లో జనసాంద్రత ఎక్కువగా ఉండడం వల్ల బహిరంగ ప్రదేశాల్లో ఫిజికల్​ డిస్టెన్స్ పాటించడం సాధ్యం కావట్లేదన్నారు. ఇలాంటి పరిమితుల కారణంగా కరోనాపై పోరు మరింత ఛాలెంజింగ్​గా మారిందని ప్రధాని చెప్పారు. లాక్​డౌన్​ టైంలో దేశ ప్రజలు క్రమశిక్షణతో నడుచుకున్నారని ప్రధాని మెచ్చుకున్నారు. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్​ షా సహా తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాటక, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్ తదితర రాష్ట్రాల ​సీఎంలు ఈ భేటీలో పాల్గొన్నారు.

మీటింగ్​కు దీదీ డుమ్మా
వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా జరిగిన ప్రధాని మీటింగ్​కు బెంగాల్​ సీఎం మమతా బెనర్జీ డుమ్మా కొట్టారు. మీటింగ్​లో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం వల్లే దీదీ ఈ మీటింగ్​కు హాజరుకాలేదని తెలుస్తోంది. ఇదే టైంలో సెక్రటేరియట్​లో జరిగిన ఓ రివ్యూ మీటింగ్​లో సీఎం పాల్గొన్నారని అధికారులు చెప్పారు. ప్రధాని మీటింగ్​కు బెంగాల్​ తరఫున రాష్ట్ర ప్రభుత్వంలోని సీనియర్​ అధికారి హాజరయ్యారు.

 

 

Latest Updates