మేఘా కంపెనీ డీల్స్​పై ఆరా

కాళేశ్వరం సహా 8 ముఖ్య ప్రాజెక్టులపై ఫోకస్​
మూడో రోజూ తనిఖీలు.. నేడు మెయిన్​ ఆఫీసులో..

హైదరాబాద్‌‌, వెలుగుమేఘా ఇంజనీరింగ్‌‌ అండ్‌‌ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌ లిమిటెడ్‌‌ (ఎంఈఐఎల్‌‌) చేసిన ప్రాజెక్టుల లావాదేవీలపై ఐటీ ఆఫీసర్లు ఫోకస్‌‌ పెట్టారు. బ్యాంక్‌‌ ట్రాన్సాక్షన్స్‌‌తోపాటు ఇతర ఫైనాన్షియల్​ డీల్స్​ను పరిశీలిస్తున్నారు. మేఘా సంస్థ ఎండీ కృష్ణారెడ్డి ఇల్లు, సంస్థ డైరెక్టర్ల నివాసాలు, సంస్థ ఆఫీసుల్లో మూడో రోజు ఆదివారం ఐటీ సోదాలు కొనసాగాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక టీంతోపాటు రాష్ట్రానికి చెందిన ఐటీ ఆఫీసర్లు ఈ తనిఖీల్లో పాల్గొంటున్నారు. దేశంలోని మిగతా ప్రాంతాల్లో గల ఎంఈఐఎల్‌‌ ఆఫీసుల్లో సోదాలు ముగిసినట్టు తెలిసింది. కృష్ణారెడ్డి ఇల్లు, హైదరాబాద్‌‌లో ఆఫీసుల్లో మాత్రం కొనసాగుతున్నాయి.

మేఘా సంస్థ ఆర్థిక గతిని మార్చేసినట్టుగా చెప్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను ఆదివారం నాటి తనిఖీల్లో ఐటీ ఆఫీసర్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అదేవిధంగా రాష్ట్రంలోని మిషన్​భగీరథ, ఇతర రాష్ట్రాల్లోని పవర్‌‌ ప్రాజెక్టులు, పట్టిసీమ ప్రాజెక్టు వివరాలను వాళ్లు సేకరించినట్టు సమాచారం. మొత్తంగా దేశవ్యాప్తంగా ఎనిమిది కీలక ప్రాజెక్టుల సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఆయా ప్రాజెక్టుల్లో ఎంఈఐఎల్‌‌కు సబ్‌‌ కాంట్రాక్టర్లుగా వ్యవహరించిన వ్యక్తుల, సంస్థల వివరాలు తెలుసుకుంటున్నారు. ఆయా ప్రాజెక్టుల టెండర్ల ప్రక్రియలో ఆయా ప్రభుత్వాలు అనుసరించిన విధానం, మేఘా సంస్థకు ఎలా టెండర్‌‌ దక్కిందనే విషయంలోనూ సమాచారం తీసుకున్నట్లు తెలిసింది.

కృష్ణారెడ్డి ఫ్యామిలీ అకౌంట్లపై..

మూడు రోజుల పాటు కొనసాగించిన తనిఖీల్లో మేఘా సంస్థకు చెందిన బ్యాంక్‌‌  అకౌంట్లతో పాటు ఆ సంస్థ ఎండీ కృష్ణారెడ్డి కుటుంబసభ్యుల అకౌంట్లలోని లావాదేవీలను పరిశీలించారు. బ్యాంకుతో నిమిత్తం లేకుండా వారు సాగించిన ఇతర ఆర్థిక లావాదేవీలపైనా కీలక సమచారం సేకరించినట్టు సమాచారం. వారి బ్యాంక్‌‌ లాకర్లపైనా ఐటీ ఆఫీసర్లు ఫోకస్‌‌ చేసినట్టు తెలిసింది. ఎన్నికల సమయంలో జరిపిన లావాదేవీల్లోనూ కీలక సమచారం లభించినట్టు తెలుస్తోంది. సీల్‌‌ చేసిన సూట్‌‌ కేస్‌‌, రెండు బ్యాగుల్లో కీలక డాక్యుమెంట్లను ఐటీ అధికారులు తమ వెంట తీసుకెళ్లారు.

నేడు మెయిన్​ ఆఫీసులో..!

మేఘా సంస్థ ఎండీ కృష్ణారెడ్డి ఇంటితోపాటు హైదరాబాద్‌‌లోని సంస్థ మెయిన్​ ఆఫీసులో సోమవారం సోదాలు కొనసాగే అవకాశమున్నట్లు సమాచారం.  ఆదివారం రాత్రి మేఘా కృష్ణారెడ్డి ఇంటి ముందు ఆయన సిబ్బంది పటాకులు కాల్చారు. దీనిపై ఐటీ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఏఐసీసీ నేతల ఇళ్లలో
ఐటీ సోదాలు

న్యూఢిల్లీ: ఆలిండియా కాంగ్రెస్​ కమిటీ (ఏఐ సీసీ) ఆఫీస్​ బేరర్ల ఇళ్లలో ఢిల్లీ ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఏఐసీసీ ఆర్థిక శాఖలో పనిచేస్తున్న మాథ్యూస్​ వర్గీస్​ ఇంటిపై అధికారులు దాడులు చేశారు. కేరళలోని కొచ్చిలో ఉన్న ఆయన నివాసంలో శుక్ర, శనివారాల్లో తనిఖీలు చేశారు. ఆయన దగ్గర నుంచి కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్​, ఢిల్లీల్లోని మేఘా ఇంజనీరింగ్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ లిమిటెడ్​ కంపెనీలో ఐ–టి అధికారులు తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాథ్యూస్​ ఇంట్లోనూ అధికారులు తనిఖీ చేశారు. మేఘా కంపెనీకి చెందిన ₹100 కోట్లకు సంబంధించిన లావాదేవీలపై సోదాలు జరిగినట్టు ఐటీ అధికారులు చెబుతున్నారు.

Latest Updates