ఆయిల్​ పామ్​పై ఫోకస్​

18 జిల్లాల్లోని 7 లక్షల ఎకరాలు సాగుకు అనుకూలం
అధ్యయనం చేయించిన సర్కారు
మలేసియా, కోస్టారికా  నుంచి విత్తనాలు
కేంద్రానికి ప్రతిపాదనలు.. త్వరలోనే గ్రీన్​సిగ్నల్​
రాష్ట్రంలో తలసరి వాడకం 16 కిలోలు

హైదరాబాద్, వెలుగురాష్ట్రంలో వంట నూనెల లోటును పూడ్చేందుకు ఆయిల్​ పామ్​ తోటల పెంపకంపై సర్కారు దృష్టి పెట్టింది. ఇప్పటికే రిటైర్డ్​ అగ్రిహార్టీ ఆఫీసర్స్​ సొసైటీ అధికారులతో కమిటీ వేసి తోటలపై అధ్యయనం చేసింది. గోదావరి పరివాహక ప్రాంతాలు సహా 18 జిల్లాల్లోని 206 మండలాల్లోని 7 లక్షల ఎకరాల్లో ఆయిల్​పామ్​ తోటలను పెంచొచ్చని గుర్తించింది. ఇప్పటికే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఆయిల్​ పామ్​ను పండిస్తున్నారు. ఇప్పుడు వాటికి తోడు వనపర్తి, గద్వాల, నారాయణపేట, నాగర్​కర్నూలు, మహబూబ్​నగర్​ జిల్లాల్లోని 24 మండలాలు, నిజమాబాద్​, మహబూబాద్​ జిల్లాల్లోనూ సాగుకు అనువైన నేలలున్నట్టు అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో తోటల పెంపకానికి మలేసియా, కోస్టారికా వంటి దేశాల నుంచి విత్తనాలను దిగుమతి చేసుకుని రైతులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించనుంది. మొత్తం 7 లక్షల ఎకరాల్లో ఆయిల్​ పామ్​ తోటలకు సంబంధించి కేంద్రానికి రాష్ట్ర సర్కారు ప్రతిపాదనలు పంపింది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక బృందం రాష్ట్రంలో ఆయిల్​పామ్​ తోటలకు అనువైన స్థలాలను పరిశీలించింది. త్వరలోనే గ్రీన్​సిగ్నల్​ వచ్చే అవకాశముంది.

మూడు ఫ్యాక్టరీలు

ప్రస్తుతం రాష్ట్రంలో పామ్​ ఆయిల్​ను తీసే ఫ్యాక్టరీలు మూడున్నాయి. టీఎస్​ ఆయిల్​ఫెడ్​ ఆధ్వర్యంలో ఓ ఫ్యాక్టరీ నడుస్తోంది. రుచి సోయా, గోద్రెజ్​ఆగ్రోవెట్​ అనే మరో రెండు కంపెనీలు పామ్​ నుంచి నూనెను తీస్తున్నాయి. అశ్వారావుపేటలో టీఎస్​ ఆయిల్​ఫెడ్​ ఫ్యాక్టరీ ఉండగా, మిగతా రెండు ఫ్యాక్టరీలు దమ్మపేటలో ఉన్నాయి. 90 శాతం నూనె టీఎస్​ఆయిల్​ఫెడ్​ ఫ్యాక్టరీలోనే ఉత్పత్తి అవుతోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఒక్క టన్ను ఆయిల్​పామ్​ గెలల నుంచి 18.43 శాతం నూనె వస్తోంది. ఆయిల్​పామ్​కు కేంద్రమే మద్దతు ధరను నిర్ణయిస్తుంది. ప్రస్తుతం అది కేంద్రం తయారు చేసిన ప్రత్యేక చట్ట పరిధిలో ఉండడమే అందుకు కారణం.

సర్కారు రాయితీలు

ప్రస్తుతం రైతులకు విత్తనాలను ఫ్యాక్టరీలే అందిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో పనిచేసే ఆ ఫ్యాక్టరీలు ప్రత్యేక నర్సరీల్లో వాటిని పెంచుతున్నయి. ఇంటర్నేషనల్​ హైబ్రిడ్​ సీడ్​ మొక్కలు రూ.120, మామూలు రకాలైతే రూ.90 వరకు చార్జ్​ చేస్తారు. ప్రభుత్వం 75 శాతం సబ్సిడీ ఇస్తుంది. నాలుగేళ్ల పాటు రూ.20 వేల సబ్సిడీ, ఎరువులూ ఇస్తుంది. ఎస్టీలకు గిరిజన ఉప ప్రణాళిక నుంచి 50 శాతం, ఆయిల్​ఫెడ్​ నుంచి 30 శాతం వరకు సబ్సిడీని అందిస్తున్నారు. యంత్రాలు, డ్రిప్​ ఇరిగేషన్​, తుంపర  సేద్యం కోసం ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, బీసీ, చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం, ఇతర రైతులకు 80 శాతం వరకు రాయితీ ఇస్తున్నారు. ఒక ఎకరా వరిసాగుకు అవసరమయ్యే నీటితో 3 ఎకరాల ఆయిల్​పామ్​ను సాగు చేసుకోవచ్చని అధికారులు, నిపుణులు చెబుతున్నారు. రెండున్నర ఎకరాలకు 15 టన్నుల నుంచి 25 టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందంటున్నారు. అంతర పంటలతో పాటు కంచె వెంట వెదురు, శ్రీగంధం మొక్కలనూ పెంచుకోవచ్చని సూచిస్తున్నారు. చీడపీడలు, కోతుల బెడద ఈ పంటకు ఉండకపోవడం రైతులకు అనుకూలించే అంశమని చెబుతున్నారు.

రాష్ట్రంలో ఒక్కొక్కరు ఏటా 16 కిలోల నూనె వాడుతున్నారు. అంటే దాదాపు 6.4 లక్షల టన్నుల వంట నూనె అవసరమవుతుంది. కానీ, ఉత్పత్తవుతున్న ఆయిల్​ కేవలం 3.4 లక్షల టన్నులు. ఇంకా 3 లక్షల టన్నుల లోటుంది. ఆ లోటును పూడ్చేందుకే ఆయిల్​పామ్​వైపు సర్కారు దృష్టి పెట్టింది. ప్రస్తుతం మనం వాడుతున్న నూనెల్లో పామాయిల్​ వాటా 1.8 లక్షల టన్నులు. రాష్ట్రంలో ప్రస్తుతం 50 వేల ఎకరాల్లో ఆయిల్​పామ్​ను సాగుచేస్తుండగా, 80 వేల టన్నుల ఆయిల్​ వస్తోంది. ఇక, దేశ వ్యాప్తంగా 2.1 కోట్ల టన్నుల వంట నూనెల అవసరం ఉంది. కానీ, ఉత్పత్తవుతున్నది కేవలం 70 లక్షల టన్నులు. 1.5 కోట్ల టన్నుల నూనెను రూ.75 వేల కోట్ల ఖర్చుతో కేంద్రం దిగుమతి చేసుకుంటోంది. అందులో పామాయిల్​ వాటా 60 శాతం. అంటే 84 లక్షల టన్నులను దాదాపు రూ.40 వేల కోట్లతో విదేశాల నుంచి తెప్పిస్తోంది. అయితే, దేశమంతటా 28 లక్షల హెక్టార్లలో ఆయిల్​పామ్​ను సాగు చేస్తే ఈ సమస్యను దాటొచ్చని అధికారులు చెబుతున్నారు.

Latest Updates