విశాఖ ఎజెన్సీని కమ్మేసిన పొగ మంచు

విశాఖ ఏజెన్సీలో ముఖ్యంగా అరకు, పాడేరు తదితర ప్రాంతాల్లో చలిగాలులు విజృంభిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతూ ఉండటంతో, తెల్లారి 8 గంటలైనా భానుడు కన్పించడం లేదు. సాయంత్రం నాలుగు గంటలకే చీకటి పడుతోంది. మన్యంలోని పలు ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా కురుస్తోంది.

పాడేరుకు సమీపంలోని మినుములూరు సెంట్రల్ కాఫీ బోర్డ్ కార్యాలయం, అరకు లోయ తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 11 డిగ్రీల సెంటీగ్రేడ్ కు పడిపోయింది. మధ్యాహ్నం 3 గంటలకే వాహనదారులు లైట్లు వేసుకుని నడపాల్సివస్తోంది. స్కూళ్లు, కాలేజీ విద్యార్థులు మంచు, చలితో ఇబ్బందులకు గురవుతున్నారు.

మరోవైపు.. మన్యంలో పొగమంచు మధ్య ప్రకృతి అందాలను తిలకించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో, హోటళ్లు, అతిథి గృహాలు కిక్కిరిశాయి. జీకే వీధి, చింతపల్లి, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు, అరకు లోయ, డుంబ్రిగూడ మండలాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది.

Latest Updates