ఫోన్లు పేలుతున్నాయి.. ఛార్జింగ్ పెట్టేప్పుడు జాగ్రత్త

టెక్నాలజీ రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతున్న డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్ మానవ జీవితంలో ఎంతటి ప్రాముఖ్యాన్ని సంపాదించుకుందో చెప్పక్కర్లేదు. చేతిలో స్మార్ట్‌ఫోన్ లేనిదే ఏ పని చేయలేని స్థితికి జనాలు వచ్చారు. రోజంతా పనుల మీద బయటికెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబంతో గడపాల్సిన సమయంలో కూడా చేతిలో ఫోన్ లేకపోతే జనాలు ఉండలేకపోతున్నారు. షాపింగ్, బ్యాంకింగ్, ఇతర సేవలు అన్నీ ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి. దాంతో ఫోన్ లేకుండా ఏ పని చేయలేకపోతున్నారు. మరి అటువంటి ఫోన్‌లో ఛార్జింగ్ లేకపోతే.. ఇంకేమైనా ఉందా… జనాలకు పిచ్చెక్కిపోతుంది. అందుకే చాలామంది ఫోన్ ఛార్జింగ్ కోసం పవర్ బ్యాంక్‌లను సైతం వెంటబెట్టుకొని తిరుగుతుంటారు. చాలామంది రాత్రి పడుకునే ముందు ఫోన్ ఛార్జింగ్ పెట్టి పడుకుంటుంటారు. అలా చేయడం వల్ల ఎన్ని ప్రమాదాలున్నాయో తెలిసి కొంతమంది, తెలియక కొంతమంది రాత్రంతా ఛార్జింగ్ పెడుతూనే ఉంటారు. దాంతో ఫోన్లు వేడెక్కి పేలిన సందర్భాలు కూడా ఉన్నాయి.

తాజాగా.. ముంబాయికి చెందిన ఈశ్వర్ చౌహాన్ ఫోన్ పేలిన ఘటనే దీనికి నిదర్శనం. ఆయన తన రెడ్‌మీ 7ఎస్ ఫోన్‌ను అక్టోబర్‌లో ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొన్నారు. ఆ ఫోన్‌ను ఈ నెల నవంబర్ 2న టేబుల్‌పై పెట్టిన చౌహాన్ తన పనుల్లో నిమగ్నమయ్యాడు. కాసేపటి తర్వాత ఏదో వాసన రావడంతో చౌహాన్ ఫోన్‌ను పరిశీలించగా.. అది కాలుతున్నట్లు గ్రహించాడు. కానీ, అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. కాసేపట్లోనే ఆ ఫోన్ పేలిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. నెల రోజుల్లోనే కొత్త ఫోన్ పేలడంతో చౌహాన్ షియోమీ స్టోర్‌ను సంప్రదించాడు. వారు ఆ ఫోన్‌ను పరిశీలించి ఫోన్ నాణ్యత లేకపోవడం వల్లే ఇలా జరిగిందని చెప్పారు. దాంతో చౌహాన్ తన ఫోన్ గురించి చెప్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియో వైరల్ కావడంతో దానిపై స్పందించిన సదరు సంస్థ చౌహాన్ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని చెప్పింది. మరి చౌహాన్ పేలిన ఫోన్‌కు బదులుగా కొత్త ఫోన్ పొందాడో లేదో మాత్రం తెలియదు.

విలువైన మీ ఫోన్ కూడా పాడవకుండా ఉండాలంటే వీటిని పాటించండి చాలు..

 • ఫోన్‌ను రాత్రంతా ఛార్జింగ్ పెట్టకూడదు.
 • ఫోన్‌ను ఛార్జింగ్ పెట్టి మెత్త కింద ఉంచకూడదు. అలా చేయడం వల్ల ఫోన్ పై భారం పడటంతో పాటు, ఫోన్ పై వేడి పెరుగుతుంది.
 • మీ ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి డూప్లికేట్ ఛార్జర్లను లేదా అడాప్టర్లను వాడకూడదు. అంతే కాకుండా ఇతర ఫోన్ల ఛార్జర్లను కూడా వాడకూడదు.
 • ప్రయాణంలో ఉన్నప్పుడు కార్లలోని అడాప్టర్లను చార్జింగ్ కోసం వాడకూడదు. దానికి బదులుగా పవర్ బ్యాంక్‌ను వాడొచ్చు.
 • మీ ఫోన్‌ను ఎడతెరిపి లేకుండా గంటల కొద్దీ వాడకూడదు. అలా చేస్తే ఫోన్ వేడవుతుంది.
 • ఒకవేళ మీ ఫోన్ బ్యాటరీ పాడైపోతే దాని స్థానంలో డూప్లికేట్ బ్యాటరీ వాడకుండా, ఒరిజినల్ బ్యాటరీని మాత్రమే వాడాలి.
 • ఎండ పడే ప్రదేశంలో ఉంచి ఫోన్ ఛార్జింగ్ చేయకూడదు.
 • మీ ఫోన్‌ని ఎక్స్‌టెన్షన్ బాక్స్ ద్వారా ఛార్జ్ చేయకూడదు.
 • మీ ఫోన్‌లో ఏదైనా ప్రాబ్లం వస్తే లోకల్ షాపులలో కాకుండా కంపెనీ అథరైజ్డ్ సర్వీస్ సెంటర్‌ని మాత్రమే సంప్రదించాలి.
 • మీ ఫోన్ కిందపడ్డప్పుడు వెంటనే దాన్ని వాడకుండా మీ దగ్గర్లోని సర్వీస్ సెంటర్‌కి తీసుకెళ్లాలి.
 • మీ ఫోన్‌పై ఎటువంటి ఒత్తిడి కలిగించకూడదు. ముఖ్యంగా ఛార్జింగ్ చేస్తున్నప్పుడు దానిపై ఎటువంటి వస్తువులను పెట్టకూడదు.

మరిన్ని వార్తలు –

ప్రేమ పెళ్లి : నవదంపతుల ఆత్మహత్య
చంద్రయాన్‌‌‌‌ 3కి ఇన్సూరెన్స్‌‌‌‌!

Latest Updates