ఆన్ లైన్ లో క‌స్ట‌మ‌ర్ కేక్ ఆర్డ‌ర్.. భావోద్వేగంతో‌ డెలివ‌రీ బాయ్ కంట‌త‌డి

కరోనా వైరస్ ప్ర‌జ‌లంద‌రి జీవ‌న విధానాన్ని ఒక్క‌సారిగా స్తంభింపజేసింది. ఈ మ‌హ‌మ్మారి ధాటికి చాలామంది ఇళ్ల‌కే ప‌రిమిత‌య్యారు. అయితే కొంత‌మంది మాత్రం త‌మ ప్రాణాల‌ను కూడా లెక్క‌చేయ‌కుండా ఈ లాక్ డౌన్ వేళ‌లో విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. మ‌న దేశంలో మాదిరిగానే, తొలిసారిగా క‌రోనా బ‌య‌ట‌ప‌డ్డ చైనాలోని వూహాన్ న‌గ‌రంలో కూడా లాక్డౌన్ వేళ నిత్యావ‌సర స‌రుకులు, ఆహారాన్ని అందించ‌డానికి డెలివ‌రీ బాయ్స్ నిరంత‌రం శ్ర‌మిస్తున్నారు. ఆ న‌గ‌రంలో ప‌నిచేసే ఓ ఫుడ్ డెలివ‌రీ బాయ్ కి త‌న జీవితంలో మ‌‌‌ర్చిపోలేని అనుభ‌వం ఎదురైంది.

త‌న ప‌నిలో భాగంగా ఎప్ప‌టిలాగే ఓ క‌స్ట‌మ‌ర్ ఆర్డ‌ర్ చేసిన కేక్ కోసం బేకరీ షాప్ కి వెళ్ళాడు. అక్క‌డ‌ కేక్ ఆర్డర్ గురించి అడ‌గ్గా ఆ షాపులో ప‌నిచేసే వ్య‌క్తి కేక్ అందించి అది త‌న ‌కోస‌మేన‌ని చెప్పాడు. స‌ద‌రు క‌స్ట‌మ‌ర్ త‌న కోస‌మే ఆర్డ‌ర్ చేశార‌న్న విష‌యాన్ని చెప్పాడు. ఆ విష‌యాన్ని న‌మ్మ‌లేక పోయిన అత‌ను.. త‌న కోసం కేక్ ఎవ‌రూ ఆర్డ‌ర్ చేసి ఉండ‌ర‌‌ని, ఏదైనా పొర‌పాటు జ‌రిగి ఉంటుంద‌ని ఒక‌టికి రెండు సార్లు అడగ్గా.. మీ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఓ క‌స్ట‌మ‌ర్ ఆర్డ‌ర్ చేసిన‌ట్టు బేక‌రీలో ప‌ని చేసే వ్య‌క్తి చెప్పాడు.

ఓ అజ్ఞాత వ్య‌క్తి త‌న కోసం కేక్ ఆర్డ‌ర్ చేశార‌ని ఆ డెలివ‌రీ బాయ్ ఒక్క‌సారిగా భావోద్వేగానికి లోన‌య్యాడు. క‌‌న్నీళ్ల‌తో షాప్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి అ‌క్క‌డున్న‌ మెట్ల మీద కూర్చొని , ఆ కేక్‌ను ఆదుర్దాగా తిన్నాడు. ఈ సంఘ‌ట‌న అక్క‌డి సీసీ కెమెరాల్లో రికార్డ‌యింది. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన ఈ వీ‌డియోని చూసి నెటిజ‌న్లు… ఆ అజ్ఞాత వ్య‌క్తి డెలివ‌రీ బాయ్ కి మ‌ర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చార‌ని ప్ర‌శంసిస్తున్నారు.

 

Latest Updates