ప్ర‌తీ బీజేపీ కార్య‌క‌ర్త ఐదుగురికి ఆహారం

కీలక దశలో బాధ్యతగా చేయూతనిద్దాం.. కరోనా నివారణకు ఇంటి వద్దకే ఆహారం అందిద్దామ‌ని పిలుపునిచ్చారు రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్. రాష్ట్ర ప్ర‌ధానాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్చార్జీల‌తో బండి సంజయ్ సోమ‌వారం టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ప్రపంచ దేశాలు కరోనా మహమ్మారితో విలవిలలాడుతున్న సందర్భంలో లాక్ డౌన్ సమర్థంగా అమలయ్యేలా చూడాల‌న్నారు. సామాజిక బాధ్యతగా బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఐదుగురికి ఆహారం అందించే ప్రణాళికలో ముందుకు సాగాలని కోరారు.

వివిధ దేశాల్లో వేగంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని, కట్టడి చేసేందుకు పేద, బడుగు, సామాన్య ప్రజలకు నిత్యావసర సరుకులు, ఆహార సమస్య తలెత్తకుండా చూసుకోవాల్సిన సామాజిక బాధ్యత బీజేపీ కార్యకర్తలదేనని స్పష్టం చేశారు. అందుకు జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా, నగరాలు, పట్టణాల, మండలాల వారీగా ప్రణాళికా బద్ధంగా నిరుపేదలకు వలస కూలీలకు నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాలను అందించే బాధ్యతను సమర్థంగా అమలు చేయాలని రాష్ట్రపదాధికారులకు, జిల్లా అధ్యక్షులకు, జిల్లా ఇన్చార్జిలకు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశానుసారం కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు, నిర్మూలించేందుకు ప్రతి బీజేపీ కార్యకర్త క్షేత్రస్థాయిలో ఫీడ్ ద నీడ్ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు బండి సంజ‌య్.

Latest Updates