ఇండియాకు చావోరేవో

నేడు ఒమన్‌‌‌‌తో కీలక మ్యాచ్‌‌‌‌
గెలిస్తేనే రేసులో ఛెత్రీసేన
వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ క్వాలిఫయింగ్‌‌‌‌ టోర్నీ
రాత్రి 8 నుంచి స్టార్​ స్పోర్ట్స్​​లో

మస్కట్‌‌‌‌: నాలుగు మ్యాచ్‌‌‌‌ల్లో విజయం రుచి చూడని ఇండియా ఫుట్‌‌‌‌బాల్‌‌‌‌ టీమ్‌‌‌‌.. వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ క్వాలిఫయింగ్‌‌‌‌ సెకండ్​ రౌండ్‌‌‌‌లో కఠిన పరీక్షకు సిద్ధమైంది.  గెలిస్తేనే తర్వాతి రౌండ్‌‌‌‌ రేసులో నిలిచే స్థితిలో మంగళవారం జరిగే మ్యాచ్‌‌‌‌లో తనకంటే మెరుగైన ర్యాంకర్‌‌‌‌ ఒమన్‌‌‌‌తో చావోరేవో తేల్చుకోనుంది.  సెప్టెంబర్‌‌‌‌లో  గువాహటి వేదికగా ఆ జట్టుతో జరిగిన ఫస్ట్‌‌‌‌ లెగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో  కెప్టెన్‌‌‌‌ సునీల్‌‌‌‌ ఛెత్రీ ఫస్టాఫ్‌‌‌‌లోనే గోల్‌‌‌‌ కొట్టి విజయంపై ఆశలు రేపినా.. చివరి పది నిమిషాల్లో రెండు గోల్స్‌‌‌‌తో ఇండియా హార్ట్‌‌‌‌బ్రేక్‌‌‌‌ చేసిన గల్ఫ్‌‌‌‌ టీమ్‌‌‌‌ మరోసారి అదే జోరు చూపించాలని భావిస్తోంది. పైగా, నాలుగు రోజుల కిందట జరిగిన తమ చివరి మ్యాచ్‌‌‌‌లో 4–1తో బంగ్లాదేశ్‌‌‌‌ను చిత్తు చేసిన ఒమన్‌‌‌‌ ఫుల్‌‌‌‌జోష్‌‌‌‌లో ఉంది. మరోవైపు ఏషియన్‌‌‌‌ చాంపియన్స్‌‌‌‌ ఖతార్‌‌‌‌తో చివరి పోరులో లేట్‌‌‌‌ గోల్‌‌‌‌  డ్రాతో గట్టెక్కిన ఇండియా… తనకంటే తక్కువ ర్యాంకులో ఉన్న బంగ్లాదేశ్‌‌‌‌, అఫ్గానిస్థాన్‌‌‌‌పై కూడా ఈ విధంగానే ఓటమి తప్పించుకుంది.

ఓవరాల్‌‌‌‌గా నాలుగు మ్యాచ్‌‌‌‌ల్లో ఒక ఓటమి, మూడు డ్రాలతో గ్రూప్‌‌‌‌–ఇలో ఇండియా మూడు పాయింట్లతో నాలుగో ప్లేస్‌‌‌‌లో ఉంది. అదే సమయంలో నాలుగు మ్యాచ్‌‌‌‌ల్లో తొమ్మిది పాయింట్లు సంపాదించిన ఒమన్‌‌‌‌ సెకండ్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో ఉండగా.. ఖతార్‌‌‌‌ 10 పాయింట్లతో టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఒమన్‌‌‌‌కు ఇండియా షాక్‌‌‌‌ ఇవ్వగలిగితే తర్వాతి రౌండ్‌‌‌‌ ఆశలను సజీవంగా నిలుపుకుంటుంది. ఓడిపోతే మాత్రం 2022 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ క్వాలిఫికేషన్‌‌‌‌ నుంచి దాదాపు నిష్క్రమిస్తుంది.  మిగిలిన మూడు మ్యాచ్‌‌‌‌ల్లోనూ గెలిచి తొమ్మిది పాయింట్లు సాధించినా కూడా ఇండియా ముందంజ వేయడం సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే ఎనిమిది  గ్రూప్స్‌‌‌‌లో రన్నరప్స్‌‌‌‌గా  నిలిచిన జట్లకు కూడా థర్డ్‌‌‌‌ రౌండ్‌‌‌‌లో బెర్తు గ్యారంటీ లేదు.  ఒకవేళ ఒమన్‌‌‌‌తో మ్యాచ్‌‌‌‌ను  డ్రా చేసుకొని ఒక పాయింట్‌‌‌‌ సాధిస్తే  ఇండియా టెక్నికల్‌‌‌‌గా రేసులో ఉంటుంది. అయినా.. టోర్నీలో ముందంజ వేయడం దాదాపు అసాధ్యమే అనొచ్చు. కానీ, 2023 ఆసియా కప్‌‌‌‌ క్వాలిఫయర్స్‌‌‌‌లో మూడో రౌండ్‌‌‌‌కు నేరుగా అర్హత సాధించేందుకు ఈ పాయింట్‌‌‌‌ ఎంతో కీలకం కానుంది.

ఎందుకంటే ఈ టోర్నీ.. వచ్చే ఆసియా కప్‌‌‌‌కు జాయింట్ క్వాలిఫయింగ్‌‌‌‌ రౌండ్‌‌‌‌గా కూడా ఉంది. ఎనిమిది గ్రూప్స్‌‌‌‌లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లతో పాటు నాలుగో ప్లేస్‌‌‌‌ల్లో నిలిచే బెస్ట్‌‌‌‌–4 టీమ్స్‌‌‌‌ ఆసియా క్వాలిఫయర్స్‌‌‌‌ థర్డ్‌‌‌‌ రౌండ్‌‌‌‌కు క్వాలిఫై అవుతాయి. కనీసం ఆసియా కప్‌‌‌‌ అవకాశాలను మెరుగు పరుచుకోవాలన్నా గత నాలుగు మ్యాచ్‌‌‌‌ల్లో బయటపడిన బలహీనతలను ఛెత్రీసేన సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. డిఫెన్స్‌‌‌‌తో పాటు అఫెన్స్‌‌‌‌ను కూడా మెరుగు పరుచుకుంటేనే ఇండియా ముందడుగు వేయగలదు. గోల్స్‌‌‌‌ విషయంలో  కేవలం కెప్టెన్‌‌‌‌ సునీల్‌‌‌‌ ఛెత్రీ ఒక్కడిపైనే ఆధారపడితే జట్టు మూల్యం చెల్లించుకోక తప్పదని గత మ్యాచ్‌‌‌‌ల్లో నిరూపితమైంది. మిగతా సభ్యులు కూడా సత్తా చాటాల్సిందే.  ఒమన్‌‌‌‌తో ఇప్పటిదాకా ఆడిన 11 మ్యాచ్‌‌‌‌ల్లోనూ ఇండియా ఒక్కసారి కూడా విజయం సాధించలేదు. మరి, ఈ అడ్డంకిని దాటి.. స్వదేశంలో ఆ జట్టు చేతిలో ఎదురైన ఓటమికి ఛెత్రీసేన రివెంజ్‌‌‌‌ తీర్చుకుంటుందో లేదో చూడాలి.

Latest Updates