పెళ్ల‌యిన రెండ్రోజుల‌కే వ‌రుడు మృతి.. 111 మందికి సోకిన క‌రోనా

అజాగ్ర‌త్త ఒక యువ‌కుడి నిండు ప్రాణం తీసింది. పెళ్లియిన కొన్ని గంట‌ల‌కే.. కాళ్ల పారాణి ఆర‌క ముందే.. న‌వ వ‌ధువు నుదుటిలో సిందూరాన్ని తుడిచేసింది. వైవాహిక జీవితంపై ఎన్నో ఆశ‌లు పెట్టుకునున్న ఆ యువ‌తికి పుట్టెడు దుఖాన్ని మిగిల్చింది. వంద‌ మందికి పైగా బంధువుల‌ను క‌రోనా కోర‌ల్లోకి నెట్టింది. క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో ఉన్న నిబంధ‌న‌లు ప‌ట్టించుకోకుండా గ్రాండ్‌గా పెళ్లి చేసుకోవ‌డ‌మే భారీ సంఖ్య‌లో ఈ క‌రోనా కేసుల‌కు కాణ‌మ‌ని అధికారులు చెబుతున్నారు. బీహార్‌లోని పాలిగంజ్ టౌన్ స‌మీపంలోని ఓ గ్రామంలో జ‌రిగింది ఈ ఘ‌ట‌న‌.

బీహార్ రాష్ట్రంలోని దీహపాలికి గ్రామానికి చెందిన 26 ఏళ్ల యువ‌కుడికి జూన్ 15న‌ పెళ్లి చేయాల‌ని పెద్ద‌లు ముహుర్తం నిశ్చ‌యించారు. ఢిల్లీలో సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌గా ప‌ని చేస్తున్న ఆ యువ‌కుడు వివాహానికి వారం రోజుల ముందు ఇంటికి చేరుకున్నాడు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో పెళ్లికి 50 మంది కంటే ఎక్కువ అతిథులు హాజ‌రు కాకూడ‌ద‌ని నిబంధ‌న‌లు ఉన్న‌ప్ప‌టికీ అత‌డు వాటిని లెక్క చేయ‌లేదు. వివాహాన్ని వేడుక‌గా చేసుకోవాల‌నుకున్నాడో ఏమో వంద‌ల మందిని ఆహ్వానించేశాడు. పెళ్లి రోజుకు కొద్ది రోజుల ముందే అత‌డికి క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించిన‌ప్ప‌టికీ మామూలు జ్వ‌ర‌మే అయ్యుంటుంద‌ని లైట్ తీసుకున్నాడు. లోక‌ల్‌గా ఉన్న క్లినిక్‌లో చూపించుకుని.. పెళ్లికి సిద్ధ‌మ‌య్యాడు. జూన్ 15న దాదాపు 400 మంది అతిథుల మ‌ధ్య గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నాడు. కానీ, వైభ‌వంగా ఆ వివాహ వేడుక చేసుకున్న రెండు రోజుల‌కే ఆ యువ‌కుడి స‌డ‌న్‌గా ఆరోగ్యం క్షీణించింది. ఆస్ప‌త్రికి తీసుకుని వెళ్లేలోపే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అప్ప‌టి వ‌ర‌కు సంతోషంగా ఉన్న ఆ ఇంట విషాదం అలుముకుంది. పెళ్లి త‌ర్వాత కొత్త జీవితాన్ని ఊహించుకున్న న‌వ వ‌ధువు అంత‌లోనే భ‌ర్త చ‌నిపోవ‌డంతో శోక సంద్రంలో మునిగిపోయింది. సంతోషంగా ఉన్న ఇంట్లో ఇలా జ‌ర‌గ‌డంతో బంధువులంతా ద‌గ్గ‌రుండి.. ఆ యువ‌కుడి మృదేహానికి అంత్య‌క్రియ‌లు పూర్తి చేశారు. దాదాపు 200 మందికి పైగా అంతిమ యాత్ర‌లో పాల్గొన్నార‌ని అధికారులు చెబుతున్నారు.

పెళ్లి కూతురుకి నెగ‌టివ్

ఈ ఘ‌ట‌న జ‌రిగిన కొద్ది రోజుల‌కే ఆ పెళ్లికి, అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌రైన కొంద‌రిలో క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో ఆస్ప‌త్రికి వెళ్ల‌గా.. క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో కాంటాక్ట్ ట్రేసింగ్ చేసేందుకు రంగంలోకి దిగిన అధికారుల‌కు ఈ పెళ్లి, అంత్య‌క్రియ‌ల విష‌యం తెలిసింది. అయితే ఆ పెళ్లి కొడుకు మ‌ర‌ణించిన త‌ర్వాత క‌రోనా టెస్టు చేయ‌కుండానే అంత్య‌క్రియ‌లు చేసేయ‌డంతో క్లారిటీ లేకుండా పోయింది. ఆ పెళ్లి కొడుకు కుటుంబ‌స‌భ్యులు, పెళ్లి కూతురు ఏ ఒక్క‌రికీ క‌రోనా పాజిటివ్ రాలేద‌ని అధికారులు చెబుతున్నారు. అయితే ఆ పెళ్లికి, అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌రైన వారిలో ఇప్ప‌టి వ‌ర‌కు 111 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌ని పాట్నా చీఫ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ రాజ్ కిశోర్ చౌద‌రి చెప్పారు. ఇంత పెద్ద క‌రోనా హాట్ స్పాట్‌కు మూలం ఏంట‌న్న‌ది తేల‌లేద‌ని, అయితే ఆ పెళ్లి, అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన్న వారంద‌రినీ గుర్తించి క్వారంటైన్ చేశామ‌ని తెలిపారు. ఆ పెళ్లికొడుకుకి వైర‌స్ సోకి ఉంటుంద‌ని, అత‌డి ద్వారానే వీరికి వ‌చ్చింద‌ని క‌చ్చితంగా చెప్ప‌లేక‌పోతున్నామ‌ని అన్నారు.

Latest Updates