మగ్గం బతుకులకు భరోసా ఏది..?

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నుంచి ఇప్పటి వరకూ 350 మందికిపైగా నేతన్నలు ఆత్మహత్యలు, అనారోగ్యం, ఆకలిచావులకు బలయ్యారు. బతుక్కి భరోసా దక్కకపోవడంతో నేతన్నలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. దీంతో రెండు వేల కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. సిరిసిల్లలో ఆత్మహత్య బాధిత నేతన్నల కుటుంబాలను ఆదుకునేందుకు ఉద్యమ నేతగా ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసిన కేసీఆర్.. నేడు సీఎం హోదాలో అలాంటి కుటుంబాలను పట్టించుకోవడం లేదు. కనీసం వారిని పరామర్శించడానికి కూడా రాలేదు. చేనేత సమస్యలు పూర్తిగా తెలిసిన కేసీఆర్..​ఆత్మహత్యలు చేసుకున్న, ఆర్థికంగా బక్కచిక్కిన నేతన్నల కుటుంబాలను, వారి పిల్లలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికైనా నేతన్నలకు రూ.5 లక్షల ఉచిత బీమా సదుపాయాన్ని అమలు చేయాలి.

 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరేండ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ చేనేత కార్మికుల బతుకులు మారలేదు. మంత్రి కేటీఆర్​ సొంత నియోజకవర్గం సిరిసిల్లలో 75 శాతం మందికి ఉపాధి కల్పించేది చేనేతే. కానీ, పనికి తగిన ప్రతిఫలం దక్కకపోడం, అప్పులు పెరిగిపోవడంతో ఎంతో మంది నేతన్నలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఒక్క సిరిసిల్లలోనే కాదు.. తెలంగాణలోని చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంది. నేతన్నలు గోస పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా అనిపించడం లేదు.

 

 2016లో సీఎంకు రిపోర్ట్​

అప్పుల బాధలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న చేనేత కుటుంబాలను ఆదుకోవాలని, వారికి అండగా నిలవాలనే లక్ష్యంతో వీవర్స్ డెవలప్​మెంట్​ ఫౌండేషన్ ఆవిర్భవించింది. చేనేత కుటుంబాలకు అండగా ఉంటూ, వారికి ఉచితంగా ఇన్స్యూరెన్స్​ కల్పించేలా కార్యాచరణను రూపొందించుకున్నాం. సీకేఎం కాలేజ్​ రిటైర్డ్​ ప్రిన్సిపాల్ కూచన మోహన రావు సహాయంతో రెండు నెలల పాటు క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టాం. ఆత్మహత్య బాధిత చేనేత కుటుంబాల గోసను రిపోర్ట్ రూపంలో నిక్షిప్తం చేసి.. ఆ రిపోర్ట్ ను 2016లో సీఎం కేసీఆర్​కు అందజేశాం. బాధితులను ఆదుకోవడమెలాగని సీఎం ప్రశ్నించగా, ప్రతి చేనేత రైతు, చేతివృత్తుల కుటుంబాలకు జీవిత బీమా చేయించాలని కోరాం. తగిన ప్రతిపాదనలు తీసుకురమ్మని సీఎం సూచించగా.. దాదాపు 25 ఇన్సూరెన్స్ కంపెనీలను పరిశీలించి ప్రజల నమ్మకానికి మారుపేరైన, పెద్ద మొత్తంలో క్లెయిమ్స్​ చెల్లించే ఎల్‌‌ఐసీని ఎంచుకుని, ఆ సంస్థ పెన్షన్స్ అండ్ గ్రూప్ స్కీమ్స్ హైదరాబాద్ రీజినల్ హెడ్ రవి వర్మ, రమేశ్​ జోషిని సంప్రదించాం. సమస్య నేపథ్యాన్ని అర్థం చేసుకున్న ఎల్ఐసీ అధికారులు, బీమా పొందాల్సిన అభ్యర్థులు వివిధ వయసుల వారు కావడం వల్ల వారి నామినీ, అడ్రస్ తదితర వివరాలను సమీకరించాలని సూచించారు.

2017లో ప్రభుత్వానికి ప్రపోజల్

తొలుత కొంతమంది ప్రముఖుల సహకారంతో ఫౌండేషన్ ఒక పైలట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించింది. క్షేత్ర స్థాయిలో అనేక కార్యక్రమాలు చేపట్టి, దాదాపు మూడు వేల మంది నేతన్నలను, చేతివృత్తిదారులను సభ్యులుగా చేర్చుకున్నాం. ఇలా సేకరించిన సమాచారాన్ని ఎల్ఐసీకి అందించాం. వీటి ఆధారంగా ఏ కారణాల చేతైనా చేనేత రైతు లేదా చేతివృత్తిదారుడు మరణిస్తే రూ.5 లక్షల ఇన్స్యూరెన్స్​ సొమ్మును ఎలాంటి ఆంక్షలు లేకుండా బాధిత కుటుంబానికి అందించడానికి ప్రీమియం సొమ్మును నిర్ణయించారు. ఈ ప్రపోజల్​ను 2017 సెప్టెంబర్​లో సీఎం కేసీఆర్​కు అందజేశాం. ఆ తర్వాత ఈ పథకం ఆవశ్యకతను పలు సమావేశాల్లో చేనేత, మంత్రి కేటీఆర్, అప్పటి స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు జోగు రామన్న, ఈటలకు సమర్పించాం.

రైతు బీమాకు ఇదే స్ఫూర్తి

ఈ పథకం ఆవశ్యకతను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం 2018 ఆగస్టు 15 నుంచి రూ.5 లక్షల ఉచిత బీమా పథకాన్ని రాష్ట్రంలోని దాదాపు 55 లక్షల మంది రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకూ ఈ పథకం ద్వారా 35 వేల రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పది రోజుల లోపలే సహాయం అందింది. చేనేత రైతులు, చేతివృత్తిదారుల కోసం పుట్టిన ఈ పథకం.. కష్టకాలంలో అనేక మంది రైతులకు అండగా నిలిచింది. ప్రభుత్వానికి గొప్ప పేరు తెచ్చింది. కానీ, బీమా పథకం వెనుక దాగిన భారీ ప్రయత్నాలను నేటి సమాజం తెలుసుకోవడం ఎంతో అవసరం. ‘‘రైతు బీమా నా మదిలో మెదిలిన ఆలోచన. నా మానస పుత్రిక’’అని సీఎం కేసీఆర్​ ఇటీవల జనగామ జిల్లాలో జరిగిన సభలో ప్రకటించారు. కానీ ఇది పచ్చి అబద్దం. బీమా పథకాన్ని రెండేండ్లు కష్టపడి రూపొందిస్తే.. కేసీఆర్ దానిని కాపీ కొట్టారు. చేనేత చేతివృత్తుల కోసం చేసిన ఈ ప్రయోగాన్ని రాజకీయ లబ్ధి చేకూరుతుందని రైతు బీమాగా మార్చారు. కష్టపడి రూపకల్పన చేసిన బీమా పథకాన్ని రైతు సోదరులకు అన్వయించుకోవడం అర్థవంతమే కానీ, మూల కారణమైన చేనేత, చేతివృత్తిదారుల దయనీయ పరిస్థితులను విస్మరించడం ఎంత వరకు సమంజసం.

ఇప్పటికైనా ప్రభుత్వ విధానాలు మారాలి

ప్రభుత్వం స్పందించకపోవడంతో ఫౌండేషన్ తరపున చనిపోయిన నేతన్నలు, చేతి వృత్తిదారుల కుటుంబాలకు రూ.5 వేలను విరాళంగా ఫౌండేషన్​ చెల్లిస్తోంది. తెలంగాణలో పోరాడితే గానీ పౌరుల హక్కులు సాధించలేమని అర్థమై గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమాలు చేశాం. ఎవరూ అడగక ముందే రైతు బీమా ఇచ్చి.. ఇన్నేండ్లుగా ఉచిత బీమా కల్పించాలని ఉద్యమాలు చేస్తున్న నేతన్నల గురించి సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ విధానాలను సమీక్షించుకోవాలి. శాస్త్రీయ పద్ధతిలో ఆలోచించి తగిన చర్యలు తీసుకుంటేనే మార్పు సాధ్యమవుతుంది.

రూ.10 కోట్లతో 50 వేల కుటుంబాలకు మేలు

రాష్ట్రంలో ఉన్న 50 వేల చేనేత, జౌళి కార్మికులకు రూ.ఐదు లక్షల ఉచిత బీమా చేయించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అయ్యే ఖర్చు రూ.పది కోట్లు. చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి రూ.10 కోట్లు పెద్ద ఖర్చేమీ కాదు. ఇది 50 వేల కుటుంబాలకు భరోసా ఇచ్చే అంశం. చేనేత చేతివృత్తులకు జీవిత బీమా కోసం అనేకమార్లు సీఎం కేసీఆర్ ను కలిసినా సమాధానం చెప్పలేక కేటీఆర్ ను కలవమని చెప్పారు. కేటీఆర్ ను కలిసి ఈ విషయాలన్నీ వివరించగా.. ఏ పని ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో తనకు తెలుసని చెప్పారు. ఆత్మహత్య బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి తెలంగాణ ఏర్పడక ముందు మీరిచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలని మొర పెట్టుకున్నా స్పందించలేదు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతీ ఇరానీని ఫౌండేషన్​ ప్రతినిధులందరం కలిసి దేశంలోని చేనేత కార్మికులందరికీ ఉచిత బీమా వర్తింపజేసేలా ఒక జాతీయ పథకాన్ని ప్రారంభించాలని కోరాం. విచిత్రం ఏమిటంటే మా బీమా ప్రతిపాదనలను పట్టించుకోని మంత్రి కేటీఆర్.. 2018 అసెంబ్లీ ఎలక్షన్ల టైమ్​లో తమను గెలిపిస్తే నేత కార్మికులకు రూ.ఐదు లక్షల ఉచిత బీమాను రైతు బీమా మాదిరిగా అందిస్తామని ఎన్నికల ప్రచారాస్త్రంగా వాడుకున్నారు. కానీ, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ నేటికీ అమలుకు నోచుకోలేదు.

Latest Updates