అమేజాన్ తెగలు: కాపాడుకునేందుకు మంటలు

  •                వేట కోసం, తమను తాము కాపాడుకునేందుకు మంటలు
  •                 వాళ్లుంటున్న చోటే జీవ వైవిధ్యం ఎక్కువ
  •                 అడవుల నాశనం తక్కువ.. కార్బన్​ స్టోరేజీ అక్కడే అధికం
  •                 వారిపై లేనిపోని ఆరోపణలు

ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద ఏదైనా హాట్​ టాపిక్​ ఉందంటే అది అమెజాన్​ కార్చిచ్చే. భూమికి ఊపిరితిత్తుల్లాంటి అడవులు తగలబడిపోతున్నాయని, కొందరు తమ స్వార్థం కోసం అడవులను కొట్టేస్తూ ఇలా అమెజాన్​ను నాశనం చేసేస్తున్నారని పర్యావరణవేత్తలు, ప్రకృతి ప్రేమికులు ఆందోళనలు చేస్తున్నారు. అమెజాన్​ అడవులను కాపాడేందుకు ఇప్పటికే చాలా దేశాలు డబ్బు సాయం కూడా చేశాయి. మరి, అక్కడి అడవుల్లో బతుకుతున్న కొన్ని తెగల జనాల పరిస్థితి ఏంటి? అమెజాన్​ తగలబడుతోందని బాధపడడం బాగానే ఉన్నా, అవే మంటలను అక్కడి జనాలు వాళ్ల బతుకుదెరువు కోసం వాడుకుంటున్నారన్న సంగతి ఏంటి? దీనిపైనే బ్రిటన్​కు చెందిన రాయల్​ హాలోవే యూనివర్సిటీ సైంటిస్టులు రీసెర్చ్​ చేశారు. జాగ్రఫీ ప్రొఫెసర్​ జయలక్ష్మి మిస్త్రీ ఆధ్వర్యంలో వాళ్లు ఆ మంటలను ఎలా వాడుకుంటున్నారో, మంటలు వారికి ఎలా ఉపయోగపడుతున్నాయో తెలుసుకున్నారు.

మంటే వాళ్ల చరిత్ర, సంస్కృతి

బ్రెజిల్​లోని అమెజాన్​ అడవుల్లో మారుమూల ప్రాంతంలో ఉంటుంది మీబెన్​గోకర్​ (కయాపో) అనే తెగ. వాళ్లకు తాబేళ్ల వేట ప్రధాన జీవనాధారం. ఆ తాబేళ్లను వేటాడేందుకు వాళ్లు మంటనే వాడుకుంటారు. సావన్నాల్లో ఉండే గడ్డికి నిప్పు పెట్టడం వల్ల తాబేళ్లుండే బొరియలు సులభంగా కనిపిస్తాయి. గడ్డిలో వెతుక్కోవాల్సిన పని ఉండదు. ఇలాంటి వేటలు వాళ్లకు సంప్రదాయబద్ధంగా వస్తుంటాయి. వర్గంగా కలిసికట్టుగా ఉండేందుకు ఆ మంటలు ఉపయోగపడుతుంటాయి. అంతేకాదు, భావితరాలకు అదే జ్ఞానాన్ని వాళ్లు పంచుతుంటారు. గయానాలో ఉండే వపిషనా, మకుషి అనే తెగలు నీళ్లు, తేనెని కలెక్ట్​ చేసుకునేందుకు మంటలను వాడుకుంటారు. వర్షం పడినప్పుడు అడవుల్లో పారే వంకల పొంటి మంటలతో పొగబెడుతుంటారు ఆ తెగ జనం. దాని వల్ల చెట్ల కొమ్మలకుండే తేనెని సేకరిస్తుంటారు. తేనెని తీసేటప్పుడు ముందు పొగబెట్టి తేనెటీగలను దూరంగా తరిమేస్తారు కదా. అలాగే అక్కడి తెగవాళ్లూ చేస్తుంటారు. చెట్లు మంచిగా పండ్లిచ్చేలా మంటను ఉపయోగించుకుంటూ ఉంటారు. అడవుల్లో పవిత్రమైన చోటుగా భావించే ప్రదేశాలను, ఇళ్లు, వాకిళ్లను కాపాడుకునేందుకు రక్షణగా మంట పెట్టుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఆ మంటే వాళ్ల జీవనవిధానం, సంస్కృతి, చరిత్ర. ఇంకా చెప్పాలంటే ఓ నమ్మకం.

వాళ్లున్నచోటే అడవులెక్కువ

నిజానికి అమెజాన్​లోని వేరే ప్రాంతాలతో పోలిస్తే వాళ్లున్న చోటే అడవుల నరికివేత చాలా తక్కువ. అందుకు కొన్ని శాటిలైట్​ స్టడీలే నిదర్శనం. వాళ్లున్న ప్రదేశాల్లోనే జీవ వైవిధ్యం ఎక్కువగా కనిపిస్తుంది. కార్బన్​ డయాక్సైడ్​ వంటి విషవాయువులూ అక్కడే ఎక్కువగా స్టోర్​ అవుతున్నాయి. అయినా కూడా కొందరు స్వార్థంతో అక్కడి తెగలపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. వెనెజులాలోని పీమన్​ తెగ వాళ్లపై మంటపిచ్చోళ్లంటూ (పీమన్​ లోస్​ క్విమోన్స్​) మండిపడుతున్నారు. బ్రెజిల్​లో అయితే, మంటలతో అడవులను నాశనం చేసేస్తున్నారన్న ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి. వాళ్లకు అది తరతరాలుగా వారసత్వంగా వస్తోందని అంటునారు. నిజానికి ఇప్పుడు అమెజాన్​ అడవుల మంటలను ట్రాక్​ చేయడానికి 4కిలోమీటర్లుX4 కిలోమీటర్ల రిజల్యూషన్​ ఉన్న శాటిలైట్​ ఇమేజ్​లనే వాడుతున్నారు. అంటే ఎటు చూసినా నాలుగు కిలోమీటర్ల పరిధిలోనే అవి ఫొటోలను తీయగలుగుతాయి. దీంతో చిన్న, పెద్ద, నియంత్రిత, అనియంత్రిత, ఉద్దేశపూర్వక, ప్రమాదవశాత్తూ ఏర్పటే మంటలు, జీవనోపాధికి వాడే మంటలను గుర్తించలేకపోతున్నారు. కాబట్టి ఏ మంట ఏదో తెలుసుకునేందుకు, దానికి తగ్గట్టు అడవులను, అందులో బతికే తెగలను కాపాడేందుకు విధానాలను తయారు చేయాలి. పర్యావరణ మార్పులతో అమెజాన్​ అడవులకు ముప్పు పొంచి ఉందన్నది నిజమే అయినా, వాటితో అక్కడ బతికే తెగలను ముడిపెట్టడం సరైంది కాదు.

పోడు వ్యవసాయం కోసం

అక్కడి తెగలు మంటలను పోడు వ్యవసాయం కోసం వాడుకుంటున్నాయి. అడవుల్లోని చిన్న చిన్న ప్రాంతాల్లో పంటలు వేసుకునేలా అక్కడి చెత్తా చెదారాన్ని తగలబెడుతుంటారు. ఆ ప్రాంతంలోనే వారికి జీవనోపాధినిచ్చే చెట్లు, మొక్కలను నాటి ఏళ్లతరబడి వాటిని పెంచుతుంటారు. అంటే, మళ్లీ చెట్లు వాటంతట అవే పెరిగే వరకు వేచి చూడకుండా సొంతంగా చెట్లను పెంచుతున్నారన్నమాట. అంతేకాదు, సావన్నా (చెట్లు, గడ్డితో ఉండే అటవీ భూములు)ల్లో గిరిజన తెగలు పందులు, జింకలను వేటాడేందుకు మంటలనే ఆధారం చేసుకుంటున్నారు. పొడి వాతావరణం ఉండే టైంలో వేర్వేరు చోట్ల, వేర్వేరుగా ఆయా తెగలు నిప్పు పెడుతుంటాయి. దాని వల్ల కొన్ని చోట్ల పచ్చగా ఉంటే, మరికొన్ని చోట్ల కాలిపోయి ఉంటాయి. దీంతో వాతావరణంలోకి ఎక్కువ మొత్తంలో కార్బన్​ డయాక్సైడ్​ వంటి విషవాయువుల విడుదల సమతూకంగా ఉంటుంది. కార్చిచ్చు ముప్పు తగ్గుతుంది.

Latest Updates