ప్రైవేటు యూనివర్సిటీల కోసం.. ప్రభుత్వ వర్సిటీలను పట్టించుకోవట్లే

తెలంగాణ వచ్చిన తర్వాత కేజీ నుంచి పీజీ వరకు ఫ్రీ అని కేసీఆర్ చేసిన ప్రకటన వెనుకబడిన వర్గాల్లో చెప్పలేని ఆనందాన్ని నింపింది. సొంత రాష్ట్రం కోసం చదువులు, ఉద్యోగాలను లెక్క చేయకుండా కొట్లాడినం.. ఇక తెలంగాణ ఏర్పడినంక వచ్చే తొలి తరం బిడ్డలైనా మంచి చదువులు చదివి గొప్పగా ఎదుగుతరులే.. అని అంతా అనుకున్నారు. కానీ కేసీఆర్ ఇచ్చిన ఆ హామీ అమలును గాలికొదిలేశారు. వెనుకబడిన వర్గాలు ఎప్పటికీ ఉన్నత స్థానాల్లోకి వెళ్లకూడదన్నట్లు బర్రెలు, గొర్రెలు పంపకాల గురించి తప్ప చదువుల గురించి మాట్లాడడం లేదు. పేదలకు ఫ్రీ ఎడ్యుకేషన్ సంగతి ఏమో గానీ అసలు ఉన్న డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీలను పట్టించుకోకుండా సర్కారు నాశనం చేసేస్తోంది. ఫ్యాకల్టీ మొదలు వీసీలు, పాలకమండళ్ల నియామకం వరకు అన్నీ ఆపేసి విద్యా ప్రమాణాలను దెబ్బ తీస్తూ రాబోయే జనరేషన్స్ భవిష్యత్తుతో ఆడుకుంటోంది. అధికార పార్టీలోని కొంత మంది నేతలకు ప్రైవేటు వర్సిటీలకు అనుమతిస్తూ వారిని పెద్దోళ్లను చేస్తున్నారు. పేదలు, వెనుకబడిన వర్గాలకు చదువు అందకుండా చేస్తే ఎప్పటికీ తమ మాయమాటలు నమ్ముతూ ఉంటారని, తమ అధికారానికి ఢోకా ఉండదని టీఆర్ఎస్ ఈ పని చేస్తున్నట్లు కనిపిస్తోంది.

దేశంలోనే గొప్ప ఆర్థికవేత్తలు, శాస్త్రవేత్తలు, రాజకీయ నేతలు.. ఇలా ఒకటేంటి అన్ని రంగాల్లో ప్రముఖులను అందించిన ఘనమైన చరిత్ర మన ఉస్మానియా యూనివర్సిటీది. కానీ నేడు పర్మనెంట్ ఫ్యాకల్టీ లేక రోజు రోజుకీ విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి. క్యాంపస్‌‌‌‌‌‌‌‌లో అవసరానికి తగ్గట్టు వసతుల కల్పనలోనూ ప్రభుత్వం ఫెయిల్ అవుతోంది. ఒక్క ఓయూనే కాదు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలనూ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ఇటీవల ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు మూసేయాలన్న ఆలోచన చేయడం మరీ ఘోరం. ఇదంతా టీఆర్ఎస్ పార్టీ ఒక కుట్రప్రకారం చేస్తున్నట్లు కనిపిస్తోంది. పేద, వెనుకబడిన వర్గాల పిల్లలు చదువుకునే ప్రభుత్వ కాలేజీలు, యూనివర్సిటీల్లో ప్రమాణాలు లేకుండా చేయడం, మూసివేత ఆలోచనలు చేయడం ఒకవైపు జరుగుతుంటే.. మరోవైపు తమ పార్టీలోని కొంత మంది నేతలకు ప్రైవేటు యూనివర్సిటీలు పెట్టుకునేందుకు బాటలు వేయడం చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ సమాన విద్యా అవకాశాలు ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ పాలక పార్టీ నేతలు పెట్టుబడిదారుల్లా మారి పేదోడికి అన్యాయం చేయాలని చూస్తున్నారు. ముఖ్యంగా ఈ రకమైన భావజాలం ఒక్క టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌లోనే కాదు పలు ప్రాంతీయ పార్టీల్లో ఎక్కువగా కనిపిస్తోంది.

ప్రభుత్వాలను ప్రశ్నిస్తారన్న భయం

తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడింది యువకులు, ఉద్యోగులే. ప్రత్యేక రాష్ట్రం సాధించుకుంటే మన నీళ్లు, నిధులు, నియామకాల్లో ఆంధ్ర పాలకుల దోపిడీని అరికట్టొచ్చని, మన హక్కులు మనమే సొంతం చేసుకోవచ్చని ఆత్మబలిదానాలకు సైతం వెనుకడుగేయలేదు. పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలో కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్, లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు అని సీఎం కేసీఆర్ ఘనంగా ప్రకటనలు చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఏడేండ్లు గడుస్తున్నా.. నేటికీ ఆ హామీలను నిలబెట్టుకోలేదు. ఇప్పటికే ఉద్యోగాలు లేక, వయసు దాటిపోతుండడంతో బడుగు, బలహీన వర్గాల యువకుల్లో కొందరు తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలన్న ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు చూస్తున్నాం. మరికొందరు చిన్నాచితకా ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుబండి నడిపించేస్తున్నారు. ఇలా ఒక తరం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసిన టీఆర్ఎస్.. తెలంగాణ ఏర్పడ్డాక చదువుల్లో ఉన్న తొలి తరాన్ని కూడా నిర్వీర్యం చేసే పనిలో పడింది. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీలు, ప్రభుత్వ యూనివర్సిటీల్లో చదువుకునే బడుగు వర్గాల పిల్లలకు ఆ చదువును అందనీయకుండా చేస్తోంది. నియామకాలు చేపట్టకుండా ప్రమాణాలను దెబ్బతీస్తోంది. మంచిగా చదువుకుని సమాజం పట్ల అవగాహన పెరిగితే ప్రభుత్వాన్ని ప్రశ్నించే తత్వం వస్తుందన్న భయం అధికార పార్టీలో కనిపిస్తోంది.

ఔట్ సోర్సింగ్ పేరుతో ఉద్యోగుల్లో అభద్రత

పార్ట్ టైమ్, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాల కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌లోనే బూర్జువా ప్రాంతీయ పార్టీల కుట్ర కనిపిస్తుంది. ఒక వ్యక్తి పర్మినెంట్ ఉద్యోగి అయితే అతడికి కొన్ని హక్కులు ఉంటాయి. ఉద్యోగ నిర్వహణలో సమస్యలు వచ్చినా, మౌలిక సదుపాయాలు లేకపోయినా, ప్రమాణాలు కొరవడినా ప్రభుత్వాన్ని ధైర్యంగా నిలదీస్తారు. కానీ అదే ఆ ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితి నెలకొంటే ఏ వసతులు ఉన్నా లేకపోయినా, అరకొర జీతాలు ఇచ్చినా సరే తమ జీవనం సాగడం కోసం ఏమీ మాట్లాడకుండా డ్యూటీ చేస్తారన్న భావన ఈ ప్రభుత్వాల్లో కనిపిస్తోంది. సీఎం కేసీఆర్ పెట్టుబడిదారుడిలా వ్యవహరిస్తూ ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో ఉన్న అభద్రత ప్రభుత్వాలు క్యాష్ చేసుకుంటున్నారు. ఒక పర్మినెంట్ ఉద్యోగికి ఇచ్చే జీతంలో ఇద్దరు, ముగ్గురు కాంట్రాక్ట్ ఉద్యోగులను తీసుకుని నడిపిస్తున్నారు. ఇలా యూనివర్సిటీల్లో, డిగ్రీ కాలేజీల్లో తమ పార్టీకి జేజేలు కొట్టే వాళ్లనే నియమించుకుంటూ, ఎవరైనా ఎదురుతిరిగితే తొలగించేస్తామన్న రీతిలో కేసీఆర్ సర్కారు వ్యవహరిస్తోంది. ఈ ఆలోచనా ధోరణితో పర్మినెంట్ ఫ్యాకల్టీ ముచ్చటనే పక్కనపెట్టేసింది.

లెక్చరర్లు, ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలె

ప్రభుత్వ కాలేజీలు, వర్సిటీల్లో టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉన్నా వాటిని భర్తీ చేయకుండా టీఆర్ఎస్ సర్కారు విద్యా ప్రమాణాలను దిగజారుస్తోంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1517, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 1500 లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో ఉన్న 11 యూనివర్సిటీలలో 1600 పైగా ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఓయూ, కాకతీయ వర్సిటీల్లోనే 800పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెండేళ్లుగా వాటి భర్తీపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. అన్ని వర్సిటీల్లోనూ 60 నుంచి 70 శాతం నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. మరోవైపు వంద ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలకు ప్రభుత్వ నిధులను ఆపేయడం మరో పెద్ద కుట్రగా కనిపిస్తోంది. ఈ రకమైన విధానాల వల్ల తెలంగాణ బిడ్డలు పెద్ద చదువులకు దూరమవుతున్నారు. భావి తరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునైనా ప్రభుత్వం తన తీరు మార్చుకోవాలి. ఖాళీగా ఉన్న లెక్చరర్, ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయడంతో పాటు రాష్ట్రంలో రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయాలి. విద్యా రంగంలో ప్రమాణాలు పెంచడంపై ఆలోచన చేయాలి.

రెండేళ్లుగా వీసీలూ లేరు

వర్సిటీల అడ్మినిస్ట్రేషన్, సరైన విద్యా ప్రమాణాలను కాపాడాలంటే ముందు వాటిలో పాలకమండళ్లు, వీసీల నియామకం జరగాలి. కానీ తెలంగాణలోని 11 వర్సిటీల్లో రెండేండ్లుగా పాలక మండలి, వీసీలు లేకపోవడం, వాటిని భర్తీ చేయడంలో అలసత్వాన్ని చూస్తే ఉన్నత విద్య పట్ల టీఆర్ఎస్ సర్కారు నిబద్ధత అర్థమవుతోంది. దీని వెనుక తమ పార్టీలోని నేతల ప్రైవేటు విద్యా సంస్థలను పెంచి పోషించాలన్న లక్ష్యమే కనిపిస్తోంది. ఇలా చేస్తే పేదలను విద్యకు దూరం చేయొచ్చన్న ఆలోచనలో సర్కారు ఉందా అన్న డౌట్​ వస్తోంది. సరైన ప్రమాణాలు లేని చదువు అందిస్తే వారు పోటీ ప్రపంచంలో నిలవలేక చిన్న చిన్న ఉద్యోగాలతో సర్దుకుంటారని, ఊర్లోనే ఉండి బతుకుదెరువు చూసుకుంటారని కుట్రలు చేస్తోంది. వీటి నుంచి జనాలను డైవర్ట్ చేసి, కేంద్రం ఏదో అన్యాయం చేస్తోందన్న భ్రమ కల్పించాలని, తమ పరిధిలో లేని  ఎస్టీ, మైనారిటీల రిజర్వేషన్ల పెంపు లాంటి వాటిపై మాట్లాడడం కుట్రపూరితమైన ఆలోచనే అనిపిస్తుంది. మరి నిజంగా ఈ విషయంలో కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చిత్తశుద్ధి ఉంటే తన అనుమతితో ఏర్పాటు చేసిన ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఆ రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయరు? -డాక్టర్ కర్నాటి కిరణ్ కుమార్, పొలిటికల్ ఎనలిస్ట్.

ఇవీ చదవండి..

పతంగులు ఎందుకు ఎగరేస్తరో తెలుసా?

జాక్‌మా కంపెనీలను జాతీయం చేసే యోచనలో చైనా

సంక్రాంతి వేడుకంతా రైతుదే

Latest Updates