ఈకలనే పరుపులుగా మార్చుకున్న రాజులు

ఈకలనే పరుపులుగా మార్చుకున్న రాజులు

హాయి నిద్ర కోసం ఎన్నెన్ని పరుపులున్నయిప్పుడు. దూది, కొబ్బరిపీచు,  స్ప్రింగ్​ పరుపులని రకరకాలుగా మార్కెట్​లో దొరుకుతున్నయి. ఇప్పుడంటే అవి ఉన్నయిగానీ.. మరి, అప్పట్లో.. ఇంకా చెప్పాలంటే రమారమి ఏడో శతాబ్దం అనుకోండి.. ఏమున్నయి! మనకేం తెలుసు అంటరా? ఇప్పట్లా అప్పట్లో పట్టెపాన్పులు లేకపోయినా.. పక్షి ఈకలను పరుపుల్లా వాడేవారు. స్వీడన్​లోని ఉప్సలా యూనివర్సిటీ రీసెర్చర్లు చెప్తున్న మాట. అవునట! స్వీడన్​లో వాల్స్​గార్డె అనే ఓ శ్మశానాన్ని 1900ల్లోనే సైంటిస్టులు గుర్తించిన్రు. అక్కడ 90కిపైనే సమాధులున్నయట. వాటన్నింటికీ 1, 2, 3 అని నంబర్లూ ఏసుకుంటూ పోయిన్రు. అట్లట్ల 1938ల వాల్స్​గార్డెలోని 7, 8 సమాధులను తవ్వితే.. రెండు పడవలల్ల ఇద్దరు ఐరన్​ ఏజ్​ రాజులను సమాధి చేసిన శిలాజాలు దొరికినయి. వాటిలో ఈకల మీద ఆ రాజులను పడుకోబెట్టి సమాధి చేసినట్టు సైంటిస్టులు గుర్తించిన్రు. అంతేకాదు, గుడ్లగూబ తల నరికి పెట్టిన ఆనవాళ్లూ ఉన్నయి. ప్రతి దానికీ కారణమున్నట్టు వీటికీ.. ఓ ప్రత్యేక కారణముందని అనుకున్నరు సైంటిస్టులు. ఈకలమీద దృష్టి పెట్టిన్రు. ఆ ఈకలెక్కడివి? ఏ పక్షివని తేల్చే పనిల పడ్డరు. దాంట్ల ఓ జాతికి చెందిన బాతు ఈకలున్నట్టు తేల్చిన్రు. అయితే, అవన్నీ కూడా ఆ బాతు ఈకలు కాదని ఈతర్వాత గుర్తించిన్రు. 

ఈకల మీదే  ఎందుకు పడ్డరు?
అన్నీ వదిలేసి ఈకల మీద ఎందుకు పడ్డరీళ్లు అనే డౌట్​ వచ్చిందా? ఒక్క బాతులు తప్ప మిగతా ఈకలున్న పక్షులు ఆ నాటి కాలంలో వారుండే చోట లెవ్వట. అందుకే, వాటిని ఎక్కడి నుంచి తెప్పించిన్రు? ఎలా తెప్పించిన్రు? ఆ ప్రాంతంతో ఈ రాజుల వ్యాపారం ఎట్ల సాగింది? వంటి వివరాలు తెలుసుకునేందుకే ఈకలపై ఫోకస్​ పెట్టిన్రు. ఈకలపై అక్కడోళ్లకు ఓ స్పెషల్​ ఆచారమూ ఉందట. కోళ్లు, కాకులు, గుడ్ల గూబలు, పావురాలు, ఇతర పక్షుల ఈకలపై పడుకుంటే ‘నరక యాతన (చావు బాధ)’ పెరిగిపోతుందని అప్పటోళ్లు అనుకునే వాళ్లట. హంస ఈకలైతే ‘స్వర్గానికి దారులు’గా భావించేవారట. అదీ వాళ్ల ఈకల కథ. ఇక, గుడ్ల గూబ తలెందుకు పెట్టడమంటరా? గిట్టినోళ్లు పుట్టక తప్పదంటరు కదా.. ఇక్కడ మాత్రం చనిపోయినోళ్లు మళ్లీ పుట్టకుండా ఉండేందుకే గుడ్లగూబ తలను నరికి.. రాజులకు తోడుగా సమాధి చేసిన్రట. వంచిన కత్తినీ గుర్తించిన సైంటిస్టులు.. అప్పటికీ సమాధి చేసిన ఆ రాజు మళ్లీ పుట్టొస్తే కత్తి పట్టకుండా ఉండేందుకే అట్ల వంచిన్రట.