లోకల్‌‌ స్టార్టప్స్‌‌కు విదేశీ దెబ్బ

  • చైనా, అమెరికా కంపెనీల రాకతో ఎగిరిపోయిన ఇండియా ఇంటర్‌‌నెట్‌ స్టార్టప్స్‌
  • యూనికార్న్‌‌లు పెరిగినా తగ్గుతున్న స్టార్టప్స్‌ సంఖ్య

ఇండియాలో ఏటేటా ఇంటర్‌‌నెట్‌‌ స్టార్టప్స్‌‌ సంఖ్య తగ్గుతోంది. 2016 లో ఏకంగా 6 వేల ఇంటర్‌‌నెట్‌‌ స్టార్టప్స్‌‌ మొదలవగా, ఆ తర్వాత ఏడాది ఆ సంఖ్య వెయ్యికి పరిమితమైంది. ఇక 2018, 2019 లలోనూ ఇదే ట్రెండ్‌‌ కంటిన్యూ అయిందని ట్రాక్సన్​ డేటా వెల్లడిస్తోంది.

2018 ప్రారంభంలో బెంగళూరుకి చెందిన వీడియో కంటెంట్‌‌ ప్లాట్‌‌ఫామ్‌‌ క్లిప్‌‌ చాలా ప్రామిసింగ్‌‌గా భావించారు.  లక్షలాది మంది యూజర్లను ఈ కంపెనీ తక్కువకాలంలోనే ఆకట్టుకుంది. యూజర్లు 60 సెకన్ల నిడివితో వీడియోలను క్రియేట్‌‌ చేయడానికి, ఎడిట్‌‌ చేయడానికి, షేర్‌‌ చేయడానికి క్లిప్‌‌ అనుమతించేది. టిక్‌‌టాక్‌‌ కంటే కొంచెం ఎక్కువ నిడివి ఉండే వీడియోలను యూజర్లు షేర్‌‌ చేసేందుకు క్లిప్‌‌లో వీలుండేది. ఈ స్టార్టప్‌‌ కంపెనీలో షున్‌‌వీ క్యాపిటల్‌‌, మ్యాట్రిక్స్‌‌ పార్ట్‌‌నర్స్‌‌, ఇండియా కోషెంట్‌‌ లాంటి ఇన్వెస్టర్లు 70 లక్షల డాలర్లను పెట్టుబడిగా పెట్టారు. విస్తరణ కోసం మరో 250 కోట్ల డాలర్ల పెట్టుబడులు తెచ్చుకోవాలని కంపెనీ ప్రయత్నించింది. కానీ, నెలల తరబడి డిస్కషన్స్‌‌ తర్వాత ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. చివరికి ఈ కంపెనీ మరో సోషల్‌‌ మీడియా కంపెనీ షేర్‌‌చాట్‌‌ చేతికి ఈ ఏడాది మొదట్లో వెళ్లిపోయింది.

చైనా దిగ్గజాలు బైట్‌‌డాన్స్‌‌, క్వాయ్‌‌ ఇండియా మార్కెట్లోకి రావడమే కాకుండా, యూజర్లను ఆకర్షించేందుకు కోట్లాది డాలర్లను కుమ్మరించాయి. వాటితో పోటీ తట్టుకునే సామర్ధ్యం క్లిప్‌‌కు ఏమాత్రం లేదు. ఒక్క క్లిప్‌‌ అనే కాదు, చాలా ఇండియన్‌‌ ఇంటర్‌‌నెట్‌‌ స్టార్టప్స్‌‌దీ అదే పరిస్థితి. ఫలితంగానే ఇండియాలో కంటెంట్‌‌ స్టార్టప్స్‌‌కు పెట్టుబడుల అవకాశాలు సన్నగిల్లాయి. 2017 నుంచి చూస్తే ఇండియాలోని స్టార్టప్స్‌‌లో పెట్టుబడులు విలువపరంగా భారీగానే పెరిగాయి. 2018 నుంచి చూస్తే యూనికార్న్స్‌‌ సంఖ్య (బిలియన్‌‌ డాలర్ల వ్యాల్యుయేషన్) మూడు రెట్లయింది. వేగంగా ఎదిగే కంపెనీలు అంతే వేగంగా భారీ నిధులు సమకూర్చుకుంటున్నాయి. డీల్స్‌‌ సంఖ్య, కొత్త  స్టార్టప్‌‌ల ఏర్పాటు మందగించడానికి వివిధ కారణాలున్నాయని ఇన్వెస్టర్లు, ఎంట్రప్రెన్యూర్లు చెబుతున్నారు. ఒక ప్రధానమైన కారణమేమంటే, చైనా, అమెరికాలకు చెందిన ఇంటర్‌‌నెట్‌‌ కంపెనీల ధాటిని తట్టుకోలేకపోవడమే. బాగా ఎస్టాబ్లిషయిన విదేశీ కంపెనీలు– అమెజాన్‌‌, ఉబర్‌‌, బైట్‌‌డాన్స్‌‌ వంటివి ఇండియాలో అడుగుపెట్టినప్పుడు, అదే విభాగంలోని ఇండియా స్టార్టప్స్‌‌ సంఖ్య తగ్గిపోయింది. ఫ్లిప్‌‌కార్ట్‌‌, ఓలా, షేర్‌‌చాట్‌‌ వంటి కంపెనీలు మాత్రమే ఇందుకు మినహాయింపుగా నిలవగలిగాయి. ఏ రంగంలోనైనా అమెరికా, చైనా ఇంటర్‌‌నెట్‌‌ కంపెనీలు ఇండియాలో అడుగుపెడితే ఇండియాలోని  ఆ రంగ స్టార్టప్స్‌‌కు కష్టకాలం వచ్చినట్లేనని వెంచర్ క్యాపిటల్‌‌ సంస్థలో భాగస్వామి ఒకరు వ్యాఖ్యానించారు. ఆ విదేశీ కంపెనీలకు అందుబాటులో ఉండే డబ్బు చాలా ఎక్కువ. టెక్నాలజీ పరంగానూ అవి సమర్ధమైనవే. దాంతో లోకల్‌‌ స్టార్టప్స్‌‌కు వాటితో పోటీపడటం చాలా కష్టమైన పనేనని ఆయన పేర్కొన్నారు.  అప్పటికే రంగంలో ఉన్న కంపెనీలు తమ సేవలను నిరంతరం మెరుగుపరచుకోవడం కూడా స్టార్టప్స్‌‌కు ఇబ్బందికరమైనదే. ఆన్‌‌లైన్‌‌ కామర్స్‌‌ తీసుకుంటే, పోటీదారులతో పోలిస్తే ఫ్లిప్‌‌కార్ట్‌‌, అమెజాన్‌‌లు చాలా వేగంగా ఎదిగాయి.