ప్రాణహితలో ఇద్దరు బీట్ ​ఆఫీసర్లు గల్లంతు

కాగ జ్ నగర్, వెలుగు:  ప్రాణహితలో నాటు పడవ బోల్తా పడి ఇద్దరు బీట్​ఆఫీసర్లు గల్లంతయ్యారు. ఈ ఘటన ఆదివారం కుమ్రం భీం జిల్లా కాగజ్​నగర్​డివిజన్​లోని చింతలమానేపల్లి మండలం గూడెంలో జరిగింది. కాగజ్​నగర్​ మండలం చింతగూడ కు చెందిన ముంజం బాలకృష్ణ, కెరమెరి మండలం టేక్లం గూడకు చెందిన బానోత్ సురేష్, బెల్లంపల్లికి చెందిన ఎండీ సద్దాం నాలుగు నెలల క్రితం బీట్ ఆఫీసర్లుగా నియమితులయ్యారు. బాలకృష్ణ కేతినిలో, సురేష్ చిత్తంలో, సద్దాం శివపల్లిలో విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా గూడెం గ్రామంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పెట్రోలింగ్ చేయడంతోపాటు, ఆదివారం సరదాగా ఉంటుందని ముగ్గురు కలసి తెల్లవారుజామున గ్రామ సమీపంలోని ప్రాణహిత నది వద్దకు వెళ్లారు. అక్కడ నూతనంగా నిర్మిస్తున్న గూడెం- అహేరి అంతర్రాష్ట్ర వంతెన మీద నుంచి మహారాష్ట్రలోని అహీరికి వెళ్లారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో తిరిగి వచ్చేందుకు ప్రాణహిత వద్దకు వచ్చారు. అప్పటికి అహేరి వంతెనపై కూలీలు వచ్చి పనులు కొనసాగిస్తున్నారు. వంతెన పైనుంచి వెళ్లద్దని వారు అంటారేమోనని భావించి నాటు పడవ ద్వారా నదిని దాటేందుకు ప్రయత్నించారు. అక్కడ పెద్ద పడవలు అందుబాటులో లేవు. చిన్న పడవ కనిపించింది. పడవ నడిపే వ్యక్తి పానెం లింగయ్యను అవతల ఒడ్డుకు చేర్చాలని బీట్ ఆఫీసర్లు కోరారు. పడవ చిన్నదే అయినా పదిమందిని తీసుకెళ్తాను అంటూ లింగయ్య అక్కడే ఒడ్డు దాటేందుకు వేచి చూస్తున్న కౌటాల మండలం శీర్ష గ్రామానికి చెందిన సూర కత్తెరయ్యను, తనకు తోడుగా పడవ నడిపేందుకు పేదం అంజయ్యను ఎక్కించుకున్నాడు. పడవలో సుమారు 400 మీటర్ల దూరం వెళ్లారు. అక్కడ నది ప్రవాహం వేగంగా ఉండడంతోపాటు, పడవకు చిల్లులు పడి లోపలికి నీళ్లు రావడం మొదలైంది. దీనికితోడు పడవలో ఎక్కువమంది ఉండడంతో ఒక్కసారిగా నదిలో బోల్తా పడింది. ఏం జరుగుతుందో తెలిసేలోపు అంతా కొట్టుకుపోసాగారు. ఈ క్రమంలో సురేష్, బాలకృష్ణ ఇద్దరు ఒకరినొకరు పట్టుకొని నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. మరో బీట్ ఆఫీసర్ సద్దాం, కత్తెరయ్య, లింగయ్య, అంజయ్య ఈదుకుంటూ పబ్బ(చిన్నచెట్లు)లను పట్టుకొని ప్రాణాలు కాపాడుకున్నారు. వారి అరుపులు విన్న సమీపంలోని వ్యక్తులు ఒడ్డుకు చేర్చారు. విషయం తెలిసిన వెంటనే స్థానికులు పెద్దఎత్తున ఘటనా స్థలానికి చేరుకుని వెతికినా ఫలితం లేకుండా పోయింది.

సాయంత్ర వరకు గాలించినా…

నాటు పడవ మునిగి ప్రాణహిత నదిలో ఇద్దరు బీట్ ఆఫీసర్లు గల్లంతైన విషయం తెలుసుకున్న మహారాష్ట్ర, తెలంగాణ పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. సంఘటన జరిగిన ప్రదేశం మహారాష్ట్ర భూభాగంలోకి వస్తుండడంతో అహేరి  పోలీస్ ఇన్స్​పెక్టర్​ప్రవీణ్ సిబ్బందితో కలిసి నది వద్దకు  చేరుకున్నారు. కొద్దిసేపటికి చింతల మానేపల్లి ఎస్సై రామ్మోహన్ నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి మీద నుంచి అక్కడకు చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. పడవ నడిపే వ్యక్తులు, స్థానికులతో కలసి లైఫ్​ బోట్, నాటు పడవల్లో గాలింపు చేపట్టారు. సాయంత్రం వరకు ఇద్దరు బీట్ ఆఫీసర్ల  జాడ దొరకలేదు.

కళ్ల ముందే కొట్టుకుపోయారు

ముగ్గురం కలసి డ్యూటీ లో భాగంగా ప్రాణహిత నది వద్దకు వచ్చాం. అవతలి వైపు వెళ్లి వస్తూ చిన్న పడవ ఎక్కినం. పడవలోకి నీళ్లు ఎక్కువగా వస్తుండడంతో కొద్దిగా భయపడ్డాం. అయితే ప్రధాన ధార దాటేటప్పటికి నీళ్లు ఎక్కువయ్యాయి. సెకన్ల వ్యవధిలోనే పడవ బోల్తా పడింది. ఏం జరుగుతుందో తెలిసేలోపు ఒకరికొకరు అందకుండాపోయినం. సురేష్, బాలకృష్ణ కళ్లముందే గల్లంతయ్యారు, నాకు చెట్టు దొరకడంతో ప్రాణాలు నిలిచాయి. పడవ నడిపే వ్యక్తి అజాగ్రత్తే నా ఇద్దరు దోస్తుల ప్రాణాలు తీసింది.

– సద్దాం, బీట్ అధికారి

Latest Updates