ఆదివాసీల గుడిసెలు, ఇళ్లు కూల్చిన అటవీ ఆఫీసర్లు

forest-officers-demolish-adivasi-houses-in-komaram-bhem-dist
  • కట్టుబట్టలతో రోడ్డున పడ్డ 16 కుటుంబాలు
  • పిల్లాజెల్లా అందర్నీ టింబర్‌ డిపోకు తరలింపు
  • చెట్ల కింద బిక్కుబిక్కుమంటున్న అడవి బిడ్డలు
  • ఇప్పటికిప్పుడు ఎక్కడికి పోవాలంటూ కన్నీళ్లు
  • ఆసిఫాబాద్‌ జిల్లా కొలంగోందిగూడ ఆదివాసీల గోస

కాగజ్​నగర్, వెలుగు: వాళ్లంతా ఆదివాసీలు. పదేళ్లుగా అడవి తల్లినే నమ్ముకొని బతుకుతున్నరు. పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ పొట్ట బోసుకుంటున్నరు. చిన్నచిన్న గుడిసెలు, ఇళ్లల్లో పిల్లాజెల్లాతో కాలం గడుపుతున్నరు. బుధవారం ఉన్నట్టుండి అటవీ అధికారులు, పోలీసులు వచ్చారు. ఇళ్లు కూల్చేస్తున్నం.. బయటకెళ్లండని గద్దించారు. ‘ఇప్పటికిప్పుడు ఎక్కడికి పోవాలె సారూ..’ అంటూ కాళ్లావేళ్లా పడ్డా కనికరించలేదు. బుల్డోజర్‌తో ఇళ్లు, గుడిసెలను నేలమట్టం చేశారు. 16 కుటుంబాలను అడవి నుంచి బలవంతంగా తీసుకెళ్లి అటవీ శాఖ టింబర్ డిపోలో పెట్టారు. అక్కడ తినడానికి తిండిలేక, ఉండటానికి గూడు లేక ఆదివాసీలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ రేంజ్‌లోని కొలంగోందిగూడకు చెందిన ఆదివాసీల గోడు ఇదీ! ఎలాంటి పునరావాసం చూపించకుండా వారిని నిరాశ్రయులను చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రాత్రి 12 దాకా అన్నం పెట్టలే

కొలంగోందిగూడలో కొలం, గోండు తెగలకు చెందిన 16 ఆదివాసీ కుటుంబాలు పదేళ్లుగా జీవనం సాగిస్తున్నాయి. చిన్నాపెద్దా కలిపి మొత్తం 50 మంది దాకా ఉన్నారు. వీరంతా అటవీ భూముల్ని ఆక్రమించినట్టు గతంలో అధికారులు నోటీసులు పంపారు. బుధవారం అధికారులు ఒక్కసారిగా వచ్చి కోర్టు ఆదేశాలతో ఇళ్లు కూల్చేస్తున్నామని చెప్పారు. ఆ వెంటనే గుడిసెలు, ఇళ్లు కూల్చేశారు. తర్వాత వారందరినీ కాగజ్ నగర్ డివిజన్​లోని వేంపల్లి వద్ద గల అటవీ శాఖ టింబర్ డిపోకు తరలించారు. బుధవారం సాయంత్రం తెచ్చి అర్ధరాత్రి 12 వరకు కనీసం భోజనం కూడా పెట్టలేదని ఆదివాసీలు చెప్పారు. గురువారం ఈ విషయం బయటకు పొక్కడంతో మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. దీంతో అధికారులు అప్పటికప్పుడు వారికి వండుకునేందుకు బియ్యం, కొన్ని సరుకులు ఇవ్వడంతో చెట్ల కిందే వండుకొని తిన్నారు. ఆరుబయట కావడంతో చిన్న పిల్లలు, వృద్ధులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ‘‘అందరినీ ఇళ్ల నుంచి పంపించి బుల్డోజర్‌తో కూల్చేసిన్రు. సామాన్లు జల్దిజల్ది తీసుకెళ్లాలని అన్నరు. మా పశువులు, కోళ్లు అడవిలోనే ఉన్నయి. వేంపల్లి టింబర్ డిపోలో రాత్రి 12 గంటలకు అన్నం పెట్టారు. పొద్దున చాయ్ నీళ్లు కూడా పోయలే. పది గంటలకు  అన్నం వండుకునేందుకు బియ్యం, పప్పు, ఇచ్చిన్రు’’ అని ఆదివాసీలు చెప్పారు.

Latest Updates