గ్రౌండ్‌‌లోనే కొట్టుకున్నారు..!

ఢాకా: బంగ్లాదేశ్‌‌ క్రికెటర్లు షాహదత్‌‌ హొస్సేన్‌‌, అరాఫత్‌‌ సన్నీ గ్రౌండ్​లోనే కొట్టుకున్నారు. నేషనల్‌‌ క్రికెట్‌‌ లీగ్‌‌లో భాగంగా ఢాకా–ఖుల్నా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌‌లో ఈ సంఘటన చోటు చేసుకున్నది. మ్యాచ్‌‌లో బౌలింగ్‌‌ చేసేందుకు సిద్ధమవుతున్న షాహదత్‌‌.. బంతిని షైన్‌‌ చేస్తున్నాడు. దీనిని గమనించిన టీమ్​మేట్​ సన్నీ.. బాల్‌‌ను ఒకవైపే షైన్‌‌ చేయొద్దని, రెండువైపుల చేయమని సలహా ఇచ్చాడు. దీంతో కోపం తెచ్చుకున్న షాహదత్‌‌.. సన్నీపై దాడికి దిగాడు. వెంటనే తేరుకున్న మిగతా ఆటగాళ్లు ఇద్దర్ని విడదీశారు. ఈ మొత్తం అంశంపై బంగ్లా క్రికెట్‌‌ బోర్డు (బీసీబీ) సీరియస్‌‌ అయ్యింది.

విచారణ అనంతరం షాహదత్‌‌.. బీసీబీ క్రమశిక్షణ నియమావళిలోని లెవల్‌‌–4ను ఉల్లంఘించినట్లు తేల్చారు. ఫలితంగా ఏడాది పాటు సస్పెన్షన్‌‌, 50 వేల టాకాల జరిమానా విధించారు. 2005–2015 మధ్య బంగ్లా తరఫున 100 వికెట్లు తీసిన షాహదత్‌‌.. సన్నీ అసభ్యంగా ప్రవర్తించడంతోనే దాడి చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చాడు. మైదానంలో సహనం కోల్పోయిన మాట వాస్తవమేనని అంగీకరించిన షాహదత్‌‌.. ఫ్యూచర్‌‌లో ఏం జరుగుతుందో చెప్పలేమన్నాడు.

Latest Updates