హైకోర్టు మాజీ సీజే జస్టిస్ చెన్నకేశవరెడ్డి కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పాలెం చెన్నకేశవరెడ్డి (96) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న తన ఇంట్లో ఆయన సహజ మరణం పొందారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం పంజాగుట్ట శ్మశానంలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా తాటిమాకులలో 1924 నవంబరు 3న జన్మించారు. అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో బీఏ పూర్తి చేశారు. ఆ తర్వాత మద్రాస్ యూనివర్సిటీలో LLB కోర్సు చదివారు. ఆ సమయంలో కాలజీ ఆంధ్రా లా స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా పని చేశారు. 1952లో మద్రాసు హైకోర్టు లాయర్‌గా ఎన్‌రోల్ అయ్యారు చెన్నకేశవరెడ్డి. ఆ తర్వాత 1953లో ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గుంటూరుకు, 1956లో హైదరాబాద్‌కు మారారు. 1969లో  సీబీఐ లాయర్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత 1972లో 47 ఏళ్ల వయసులోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. 1984, 1985ల్లో ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా సేవలందించారు.  1985 సెప్టెంబరులో గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. 1986 నవంబర్‌లో అక్కడే పదవీ విరమణ చేశారు. రిటైర్మెంట్ తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కమిషన్లలో చైర్మన్ పదవులకు అవకాశం వచ్చిన జస్టిస్ చెన్నకేశవ రెడ్డి తిరస్కరించారు. నంది అవార్డుల కమిటీ, మెడికల్ ఎథిక్స్ కమిటీలకు చైర్మన్‌గా సేవలందించారు. ఆ తర్వాత జస్టిస్ పీసీ రెడ్డి ట్రస్టును స్థాపించారు. 2000 సంవత్సరం నుంచి ఈ ట్రస్టు ద్వారా కడప, రాయలసీమలో స్త్రీ విద్య, స్త్రీ సాధికారతను ప్రోత్సహించారు.

Latest Updates