‘ప్రాజెక్టుల అవినీతిపై పార్టీ పెద్ద‌ల‌కు వివ‌రించాను’

ఢిల్లీ: మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు గడ్డం వివేక్ వెంక‌ట‌స్వామి శుక్ర‌వారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాతో భేటీ అయ్యారు. భేటీ అనంత‌రం మీడియాతో మాట్లాడిన వివేక్.. రాష్ట్రంలోని తాజా రాజకీయాలపై చర్చించామ‌ని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ చేపడుతున్న పలు కార్యక్రమాలను జేపీ నడ్డాకి వివరించాన‌న్నారు.

అదే విధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అవినీతిని వివరించానని, అన్ని ప్రాజెక్టుల్లో కేసీఆర్ అవినీతి చేస్తున్నాడని అన్నారు వివేక్. ధనిక రాష్ట్రాన్ని సీఎం అప్పుల రాష్ట్రంగా మార్చి వెనక్కి నెట్టారని, రాష్ట్రం మొత్తం అప్పులపాలు చేశాడ‌న్నారు. కేసీఆర్ అవినీతిపై విజిలెన్స్ ఎంక్వయిరి చేయాలని చెప్ప‌గా.. అందుకు న‌డ్డా సానుకూలంగా స్పందించార‌న్నారు. బీజేపీ పార్టీ పైన, కేంద్ర ప్రభుత్వంపైన కేసీఆర్ తప్పుడు విమర్శలు చేస్తున్నాడ‌ని అన్నారు.

రాష్ట్రంలో బండి సంజయ్ ఆధ్వర్యంలో పార్టీ బలోపేతంగా అయిందని, బీజేపీ అంటే కేసీఆర్ కు భ‌యం ప‌ట్టుకుంద‌ని వివరించిన‌ట్టు వివేక్ తెలిపారు. రాబోయే మునిసిపల్, హైదరాబాద్ మేయర్ ఎన్నికలపై జేపీ నడ్డాకి వివరించాన‌న్నారు.

Latest Updates