
రూల్ సరికాదంటున్న క్రికెట్ వర్గాలు
న్యూఢిల్లీ: వంద ఓవర్ల ఆటలో, సూపర్ ఓవర్లోనూ స్కోర్లు సమమైనప్పటికీ బౌండరీ కౌంట్ ఆధారంగా ఇంగ్లండ్‌ను వరల్డ్‌కప్ విజేతగా ప్రకటించడాన్ని క్రికెట్ వర్గాలు తప్పు పడుతున్నాయి. ఫైనల్లో ఐసీసీ అనుసరించిన బౌండరీ–కౌట్ రూల్‌ను ప్రస్తుత, మాజీ క్రికెటర్లు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ఇలాంటి నిబంధనలపై సీరియస్‌గా పరిగణించాలని ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ భావిస్తుంటే చాలా మంది దీన్ని చెత్త రూల్ అంటున్నారు.
‘ఆటలో ఇవేం ప్రమాణాలో నాకు అర్థం కావడం లేదు. వరల్డ్‌కప్ ఫైనల్లో ఎక్కువ బౌండరీలు కొట్టిన జట్టును విజేతగా తేల్చారు. ఐసీసీ తెచ్చిన చెత్త రూల్ ఇది. ఈ మ్యాచ్‌ను టైగా ప్రకటించాల్సింది. ఉత్కంఠభరిత ఫైనల్ ఆడిన ఇరు జట్లను నేను అభినందిస్తున్నా’ని మాజీ క్రికెటర్గౌతమ్ గంభీర్ ట్వీట్ చేశాడు.
ఇటీవలే ఆటకు వీడ్కోలు పలికిన యువరాజ్ సింగ్ కూడా ఈ రూల్‌పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘ఈ నిబంధనతో నేను ఏకీభవించను. కానీ, రూల్స్ అంటే రూల్సే. వాటిని పాటించాల్సిందే. ఎట్టకేలకు వరల్డ్‌కప్ నెగ్గిన ఇంగ్లండ్‌కు కంగ్రాట్స్. చివరి వరకూ పోరాడిన కివీస్‌ను చూసి నా గుండె బరువెక్కింది’ని ట్విటర్లో రాసుకొచ్చాడు. న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ స్కాట్ స్టైరిస్ ఐసీసీని ఓ జోక్‌గా అభివర్ణించాడు. ఇరు జట్లను జాయింట్ విన్నర్లగా ప్రకటించాల్సిందని ఇండియా స్పిన్ లెజెండ్ బిషన్ సింగ్ బేడీ అభిప్రాయపడ్డాడు.
ఇక చేసిన రన్స్, కోల్పోయిన వికెట్స్ ఆధారంగా డక్‌వర్త్ లూయిస్ పద్ధతి నడుస్తున్నప్పుడు కేవలం ఎక్కువ బౌండరీలు కొట్టిన జట్టును విజేతగా ఎలా ప్రకటిస్తారని ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మన్ డీన్ జోన్స్ ఐసీసీని ప్రశ్నించాడు.
అడుగుతామని మీరు.. చెబుతానని నేను ఊహించలేదు: విలియమ్సన్
టైటిల్ ఫైట్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నామని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ చెప్పాడు. అయితే, తమ పరాజయానికి కారణమైన బౌండరీ కౌంట్ రూల్‌పై కోపం లేదన్నాడు. ఫైనల్ అనంతరం బౌండరీ కౌంట్ రూల్‌పై అభిప్రాయం చెప్పాలన్న మీడియా ప్రశ్నకు ‘ బహుశా ఈ ప్రశ్న అడుగుతామని మీరు ఊహించి ఉండరు. అలానే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి వస్తుందని నేను అనుకోలేదు (నవ్వుతూ). రూల్ అంటే రూలే. అది టోర్నీ ఆరంభం నుంచి ఉందని అందరికీ తెలుసు. కానీ, దాని ద్వారా ఫలితం తేల్చాల్సివస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. క్రికెట్లో గ్రేట్ గేమ్ ఇది. మీరంతా దీన్ని ఎంజాయ్ చేశారు’ అని కేన్ బదులిచ్చాడు.