ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న గురువుకు ‘గురుద‌క్షిణ’ పేరుతో చేయూత‌

జగిత్యాల: చిన్న‌త‌నంలో ‌త‌మ‌కు విద్యాబుద్ధులు నేర్పించిన గురువు కష్టాల్లో ఉన్నాడన్న విష‌యం తెలుసుకొన్న‌ శిష్యులు.. అత‌నికి ఆర్ధిక‌సాయం చేసి, అత‌ని చేత ఓ టిఫిన్ సెంట‌ర్ పెట్టించారు. కథలాపూర్ మండలం అంబాజీపేట వద్ద రఘు అనే ఓ ప్ర‌యివేట్ ఉపాధ్యాయుడు గ‌త కొంత‌కాలంగా ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. 1997- 98లో సిరిసిల్ల జిల్లా రుద్రంగి జిల్లా పరిషత్ పాఠశాలలో అప్పటి పదో తరగతి విద్యార్థులకు ర‌ఘు పాఠాలు బోధించాడు. త‌మ ఉపాధ్యాయుడు క‌ష్టాల‌ను ఎదుర్కొంటున్నాడ‌న్న వార్త తెలిసి.. అత‌నికి ఉపాధి కల్పించేందుకు షెడ్డు నిర్మించి టిఫిన్ సెంటర్ & చికెన్ సెంటర్ ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందించారు అప్ప‌టి ప‌ద‌వ త‌ర‌గ‌తి విద్యార్థులు. పూర్వ విద్యార్థుల సమక్షంలో ఇవాళ “గురు దక్షిణ” పేరుతో టిఫిన్ సెంటర్ ప్రారంభించారు. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న త‌న‌కు టిఫిన్ సెంట‌ర్ ఏర్పాటు చేసి చేయూత‌నిచ్చిన‌ విద్యార్థులకు ర‌ఘు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

Latest Updates