కేంద్ర మాజీ మంత్రి ర‌ఘువంశ్ ప్ర‌సాద్ సింగ్‌ మృతి

కేంద్ర మాజీ మంత్రి, ఆర్జేడీ మాజీ నేత ర‌ఘువంశ్ ప్ర‌సాద్ సింగ్‌ (74) అనారోగ్యంతో మృతిచెందారు. గ‌త‌కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న‌ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారు. అయితే ఆదివారం ఆయన ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఈరోజు ఉద‌యం మ‌ర‌ణించార‌ని ఎయిమ్స్ వైద్యులు వెల్ల‌డించారు. క‌రోనా నుంచి కోలుకున్న త‌ర్వాత.. కొత్త స‌మ‌స్య‌లు త‌లెత్త‌డంతో వారం క్రితమే ఆయన ఎయిమ్స్‌లో చేరారు. రఘువంశ్ ప్రసాద్ సింగ్ ఇటీవ‌లే లాలూ ప్ర‌సాద్ నేతృత్వంలోని ఆర్జేడీ పార్టీకి రాజీనామా చేశారు.

రఘువంశ్ ప్రసాద్ సింగ్.. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్ర‌భుత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ‌ మంత్రిగా ప‌నిచేశారు. ఆయ‌న ప‌ద‌వీకాలంలోనే మ‌హాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. బీహార్‌లోని వైశాలీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న‌ లోక్‌స‌భకు ప్రాతినిథ్యం వ‌హించారు. ఆ నియోజ‌కవ‌ర్గం నుంచి రికార్డుస్థాయిలో ఐదుసార్లు గెలుపొందారు. కాగా.. ఆయన 2014, 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీచేసి ఓడిపోయారు.

ర‌ఘువంశ్ ప్ర‌సాద్ సింగ్‌ మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు. మోడీ ఈ రోజు బీహార్‌లో మూడు పెట్రోలియం ప్రాజెక్టులను ప్రారంభించారు. ఆ సమయంలో కేంద్ర మాజీ మంత్రి ర‌ఘువంశ్ ప్ర‌సాద్ సింగ్‌ మనతో లేరు అనే విషయాన్ని తెలియజేస్తూ.. సంతాపం వ్యక్తం చేశారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి తదితరులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

For More News..

యూఎస్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్స్ గెలుచుకున్న ఒసాకా

దేశంలో 47 లక్షలు దాటిన కరోనా కేసులు

రాష్ట్రంలో మరో 2,216 కరోనా పాజిటివ్ కేసులు

క్రెడిట్ కార్డులపై ఫీజుల మోత.. రికవరీ కోసమేనంటున్న బ్యాంకులు

Latest Updates