కంపెనీపై పాత ఉద్యోగి కక్ష : కోట్లు విలువ చేసే ఫార్ములాలు చోరీ

నలుగురిని అరెస్ట్​ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు
ఉద్యోగం నుంచి తీసేసిందని కంపెనీపై పాత ఉద్యోగి కక్ష

హైదరాబాద్ , వెలుగు: ఫార్మా ఉత్పత్తుల ఫార్ములాలను చోరీ చేసి, మందులను తయారు చేస్తున్న నలుగురిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్​ చేశారు. ఆ వివరాలను సైబరాబాద్ సీపీ సజ్జనార్ మంగళవారం వెల్లడించారు. ఏపీ అచ్యుతాపురానికి చెందిన జీఎంఎఫ్ సీ, సీపీఆర్ ల్యాబ్స్​తో పాటు మరో రెండు కంపెనీలను కలిపి ఓ కంపెనీ బల్క్​డ్రగ్, మందులను తయారు చేస్తోంది. జీఎంఎఫ్ సీలో 2013 నుంచి హైదరాబాద్ మేడ్చల్ కు చెందిన గుంటూరు శ్రీకాంత్ రెడ్డి బిజినెస్ డెవలప్ మెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. 2009 నుంచి కంపెనీలోనే పనిచేస్తున్న డిప్యూటీ మేనేజర్ (ప్రొడక్షన్ ) మేకల కృష్ణారెడ్డి, కెమిస్ట్​గా పనిచేస్తున్న గుంటూరు జిల్లా మిరియాల గ్రామానికి చెందిన మేకల వెంకట్ రెడ్డితో పరిచయం ఏర్పడింది. వారి ద్వారానే శ్రీకాంత్ రెడ్డి ఫార్ములాలను చోరీ చేసి మందులను తయారు చేశాడు.

జాబ్ నుంచి తీసేయడంతో కక్ష కంపెనీకి నష్టం కలిగేలా ప్రవర్తిస్తున్నాడన్న కారణంతో శ్రీకాంత్ రెడ్డిని 2017లో కంపెనీ ఉద్యోగంలో నుంచి తీసేసింది. దీంతో కంపెనీపై కక్ష పెంచుకున్నాడు. దెబ్బకొట్టాలన్న ఉద్దేశంతో ఫార్ములాల చోరీకి స్కెచ్ వేశాడు. కంపెనీ నుంచి బయటకొచ్చి జీడిమెట్లలో హ్యూబర్ట్​ హెల్త్​కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ పెట్టాడు. జీఎంఎఫ్ సీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో పనిచేస్తున్న కృష్ణారెడ్డితో ఫార్ములాలను చోరీ చేసేందుకు ప్లాన్ వేశాడు. తన కంపెనీలో ఎక్కువ జీతంతో మంచి ఉద్యోగం ఇస్తానని ఆశ చూపించాడు.

అతడితో పాటు వెంకట్ రెడ్డి, విశాఖపట్నానికి చెందిన ఎస్. యోగేశ్వరరావు అనే వ్యక్తికీ అదే ఆఫర్ చేశాడు. తర్వాత కృష్ణారెడ్డి తాను పనిచేస్తున్న కంపెనీలో డేటాను చోరీ చేశాడు. ప్రొడక్షన్ కంట్రోల్ రికార్డులను వెంకట్ రెడ్డి దొంగిలించాడు. ఆ డేటానంతా కంప్యూటర్ లో స్టోర్ చేసేవాడు యోగేశ్వరరావు. విశాఖపట్నంలో మరో కంపెనీని స్టార్ట్​ చేసిన శ్రీకాంత్ రెడ్డి, దొంగిలించిన ఫార్ములాల డేటాతో మందుల తయారీని ప్రారంభించాడు. దేశవ్యాప్తంగా ఆ నకిలీ ఉత్పత్తులను సప్లై చేయడం మొదలుపెట్టాడు. శ్రీకాంత్ రెడ్డి గ్యాంగ్ పై అనుమానం వచ్చిన జీఎంఎఫ్ సీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎం.కోటేశ్వరరావు సైబరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మెయిల్ ఐడీ ద్వారా నిందితులను అరెస్ట్​ చేసిన పోలీసులు, డేటా చోరీ వల్ల కంపెనీకి భారీ నష్టం జరిగిందని తేల్చారు.

Latest Updates