సముద్రంలో మునిగిపోయిన ఓ నగరం దొరికింది

found-a-city-drowned-in-the-ocean

దేవీపుత్రుడు సినిమా చూశారా? అందులో శ్రీకృష్ణుడు పాలించిన ద్వారకా నగరం సముద్రం అడుగున ఉంటది.  ఆ నగరం గురించి పరిశోధన చేసేందుకు పురావస్తు అధికారిగా వెంకటేశ్​ రీసెర్చి మొదలుపెడతాడు. సేమ్​ టు సేమ్​.. అలాంటి నగరమే ఒకటి ఈజిప్టులో సముద్రగర్భంలో కలిసిపోయింది. ఆ నగరాన్ని ఓ పురావస్తు అధికారి ప్రపంచానికి పరిచయం చేశాడు.

ఈజిప్టు చరిత్రకు వన్నెలద్దిన ఓ నగరం. వందల ఏండ్ల క్రితమే సముద్రగర్భంలో కలిసిపోయింది.  జనాలంతా ‘అప్పట్లో ఒక నగరం ఉండేదట. దాని నిర్మాణం చూస్తే.. కండ్లు చెదిరిపోయేవట’ అని కథలు కథలుగా చెప్పుకున్నారు. ‘ఫలానా నగరం ఉంది’ అనే చెప్పుకోవడమే తప్ప.. ఎక్కడుందో, ఎలా ఉందో, అసలు ఉందో లేదో కూడా తెలియదు వాళ్లకి. ‘అదంతా ఓ కట్టుకథ’ అని కొట్టి పారేసిన వారూ ఉన్నారు. అయితే.. ఏదైనా ఒక విషయాన్ని నిరూపించాలంటే.. దానికి సంబంధించిన ఆధారాలు కావాలి.  సరైన ఆధారాలతో ఓ పరిశోధకుడు ఆ కథలన్నీ కల్పించినవి కాదు.. నిజంగా జరిగినవని తేల్చాడు. నీటిపాలైన ఆ చారిత్రక నగరం అవశేషాలను ఆధారాలతో సహా నిజంగా ఉందని నిరూపించి ప్రపంచానికి మరోసారి పరిచయం చేశాడు. క్రీ.పూ 3వ శతాబ్దంలో ఈజిప్టు మీద దండయాత్ర చేసిన అలెగ్జాండర్​ పరాక్రమాన్ని ప్రత్యక్షంగా చూసింది హెరాక్లియాన్​ నగరం. 2,5‌‌‌‌00 సంవత్సరాల క్రితమే అపారమైన సంపదకు, ప్రజా సంక్షేమానికి చిరునామాగా విలసిల్లిన నగరం అది. దీని పూర్వనామం  థోనిస్​. కానీ.. హెరాక్లియన్​ అనే పేరుతోనే ఎక్కువమందికి పరిచయం. ఫారోల పతనం ఈ నగరం నుంచే ప్రారంభమైంది. ఈజిప్టు మీద అలెగ్జాండర్​ విజయంతో ఈ నగరం క్రమక్రమంగా తన వైభవాన్ని కోల్పోయింది. ఆ తర్వాత వంద సంవత్సరాలకు సముద్రగర్భంలో కలిసిపోయింది. ఆ తర్వాత ఆ నగరం గురించి మెల్లమెల్లగా జనాలు కూడా మరిచిపోయారు. అసలు హెరాక్లియన్​ నగరం ఎందుకు సముద్రంలో కలిసిపోయిందనే విషయం కొన్ని వందల ఏళ్లుగా అంతుపట్టని మిస్టరీగానే మిగిలిపోయింది.

అసలేంటీ నగరం కథ?..

గ్రీకుల రేవుపట్టణంగా హెరాక్లియాన్ నగరానికి చరిత్రలో ప్రముఖ స్థానం ఉంది. కేవలం రేవు పట్టణంగా మాత్రమే కాదు. . గ్రీకు పురాణాల్లో అత్యంత పురాతనమైన నగరంగా హెరాక్లియన్​కు పేరుంది. అయితే.. దీని అసలు పేరు థోనిస్​ నగరం. కానీ గ్రీకు పురాణాల్లో హెరాక్లియన్​ నగరంగా నమోదయింది. రోమన్​ పురాణాల ప్రకారం గ్రీకుల దేవుడైన హెరాక్లిస్​ (హెర్క్యులస్​) ఈజిప్టులో అడుగుపెట్టినప్పుడు మొట్టమొదటిసారి ఇక్కడే బస చేశాడట. గ్రీకులు ఆరాధించే దేవుడు హెర్క్యులస్​​ కాబట్టి ఆయన పేరు మీదుగానే థోనిస్​ సగరం పేరును హెరాక్లియాన్​గా మార్చుకున్నారు. దాదాపు రెండువేల సంవత్సరాలు సుసంపన్నంగా వర్ధిల్లింది ఈ నగరం.

ఎలా బయటపడింది?…

ఈ నగరం గురించి జనాలు చెప్పుకుంటున్న  కట్టుకథలు విన్న ఫ్రెంచ్​ సబ్​మెరైన్​ ఆర్కియాలజిస్ట్ ఫ్రాంక్​ గోడ్డియో అవి నిజమో, కాదో తేల్చేందుకు ఐదేళ్లపాటు అన్వేషించాడు. చివరికి 1999లో మధ్యదరా సముద్రంలో దీని ఆచూకీ కనిపెట్టాడు. ప్రస్తుతం ఉన్న ఈజిప్షియన్​ తీరానికి ఆరుకిలోమీటర్ల దూరంలో సముద్రం అడుగున గోడ్డియో ఒక చారిత్రక గోడను గుర్తించాడు. కుతుహలంతో అదెంత వరకు ఉందో చూద్దామని ముందుకు వెళ్లి చూడగా ఆ గోడ వెనుక ప్రాచీన ఈజిప్టుకు చెందిన పెద్ద దేవాలయం ఉంది. సున్నపురాయితో నిర్మించిన ఆ దేవాలయం చాలావరకు శిథిలమై, అవశేషాలు మాత్రమే మిగిలాయి. అది హెరాక్లియాన్ నగరం అనుకున్నాడు. దాంతో  గోడ్డియో, యూరోపియన్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ సబ్​మెరైన్​ ఆర్కియాలజీ బృందాన్ని తీసుకొని మరోసారి హిరాక్లియాన్​ నగర వేటకు బయల్దేరాడు. బృందం మొత్తం నిర్వహించిన గాలింపులో కిలోమీటరు వెడల్పు, రెండు కిలోమీటర్ల పొడవు ఉన్న నగరం అవశేషాలు దొరికాయి. ఆ నగరంలో ప్రాచీన ఈజిప్టు నిర్మాణ శైలిలో రాజభవనాలు, ఆలయాలు, జనావాసాల ఆధారాలు లభించాయి.

అంతులేని సంపద దొరికింది!..

మధ్యదరా సముద్రంలో అన్వేషణ మొదలుపెట్టిన పరిశోధకులకు భారీ విగ్రహాలు, కంచుతో చేసిన కళాఖండాలు, భారీ నౌకలు, బంగారు, వెండి నాణేలు దొరికాయి. ఇక్కడ దొరికిన అవశేషాల్లో ఎక్కువభాగం చెక్కతో చేసినవే. అయితే.. రెండువేల ఏండ్ల తర్వాత కూడా ఆ అవశేషాలు చెక్కు చెదరకుండా ఉండడం విశేషం. జనాలు చెప్పుకున్న కథల్లో ప్రధానమైన ‘బరి’ అనే నౌక అవశేషాలు కూడా పరిశోధకులు కనిపెట్టారు. వారు గుర్తించిన వాటిలో మొత్తం 70 నౌకలున్నాయి. వాటిలో ఒక నౌక మిగతావాటి కంటే భిన్నంగా ఉంది. ఆ నౌకనే జనాలు చెప్పుకునే భారీ ‘బరి’ నౌకగా భావించారు. కొన్ని సంవత్సరాల పాటు పరిశోధన చేసిన తర్వాత క్రీ.పూ 5వ శతాబ్దంలో గ్రీకు తత్వవేత్త హెరటోడస్​ ఈజిప్టును సందర్శించినప్పుడు ‘బరి’ అనే భారీ నౌక గురించి రాశాడు. అది చూసిన తర్వాత అక్కడ దొరికిన నౌక ‘బరి’ నౌకనే అని ధృవీకరించారు. అప్పట్లో  వ్యాపారాలకు, వేడుకలకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వేర్వేరు నౌకలను వాడేవారట. అందుకే అక్కడ జరిపిన పరిశోధనల్లో ఎక్కువగా నౌకలకు చెందిన అవశేషాలు దొరికాయంటున్నారు పరిశోధకులు.

ఎన్నో ఆధారాలు..

సముద్రం అడుగు భాగంలో హిరాగ్లఫిక్స్​తో రోసెట్టా అనే పురాతనమైన రాయి మీద చెక్కిన శాసనం ఒకటి దొరికింది. దీని ఆధారంగా రెండువేల ఏండ్ల క్రితం ఈ రేవు పట్టణంలో విదేశీ నౌకల నుంచి వసూలు చేసే సుంకాల వివరాలు కనుగొన్నారు. రెండువేల సంవత్సరాల నుంచి అన్ని ఆటుపోట్లను తట్టుకొని ఈ రోసెట్టా శిలా శాసనం ఇంకా చెక్కు చెదరకుండా ఉండడం సైంటిస్టులను సైతం నివ్వెరపోయేలా చేసింది. దీంతో పాటు హెర్క్యులస్​ ఆలయం లోపల ‘నాస్​’ అనే రాతిపెట్టెను కూడా గుర్తించారు. దీని చుట్టూ హెరాక్లియాన్​ను పాలించిన ఫారోలు పొందే అధికారాల వివరాలు చెక్కి ఉంచారు.

అసలెందుకు మునిగింది?..

ఇంత చారిత్రక నేపథ్యం, ఆ కాలంలోనే వాడిన టెక్నాలజీ ఉన్న నగరం సముద్రంలో ఎందుకు మునిగిపోయింది?  అంత తెలివి ఉన్న పాలకులు, ప్రజలు, మేధావులకు హెరాక్లియాన్​ నగరాన్ని నీటిలో మునగకుండా కాపాడుకునే శక్తి లేకుండా పోయిందా? అనే సందేహం తలెత్తక మానదు. నైలు డెల్టాలో  నిర్మించుకున్న ఈ నగరం కుప్పకూలి సముద్రంలో కలవడానికి కారణం ప్రకృతి విపత్తులే అని భావిస్తున్నారు. నైలు డెల్టాలో భూమి స్థిరంగా ఉండకపోవడం వల్ల నగరమంతా కూలిపోయి సముద్రంలో కలిసిపోయి ఉండొచ్చని పరిశోధకుల అభిప్రాయం. అయితే.. ఏ నైలు డెల్టా భూమి వల్ల హెరాక్లియాన్​ నగరం మునిగిపోయిందో.. అదే మట్టి వల్ల ఇన్నిరోజుల తర్వాత కూడా చెక్కు చెదరకుండా ఉంది. నైలు డెల్టాలోని మట్టి ఆ నగరం అవశేషాల మీద పేరుకొని శతాబ్దాల తరబడి ఆ అవశేషాలు చెదిరిపోకుండా కాపాడిందంటున్నారు పరిశోధకులు.

Latest Updates