నలుగురు కొడుకులున్నా తిండి పెడ్తలేరు

స్టేషన్లో పోలీసులకు మొరపెట్టుకున్న అమ్మానాన్న

కమలాపూర్, వెలుగు: ఆదరించాల్సిన కొడుకులు కనీసం తిండి కూడా పెట్టకపోవడంతో పోలీస్​స్టేషన్​మెట్లెక్కారా దంపతులు. ఈ ఘటన వరంగల్​అర్బన్​ జిల్లా కమలాపూర్​మండలం గుండేడ్​గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుండేడ్​ గ్రామానికి చెందిన కుకట్ల మెండయ్య, -బొందమ్మ దంపతులకు నలుగురు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. కొడుకులు తల్లిదండ్రులను నెలకు ఒకరు వంతులవారీగా చూసుకుంటున్నారు. చిన్నకొడుకు ఇంటి స్థలంలో వేసిన గుడిసెలో వృద్ధులు నివాసం ఉంటున్నారు. రెండు నెలల క్రితం చిన్న కొడుకు ఇంటికి తాళం వేయడంతోపాటు తల్లిదండ్రులకు తిండికూడా సరిగా పెట్టడం లేదు.

కూతురు, బంధువుల ఇళ్లలో రెండు నెలలుగా కాలం గడుపుతున్న వృద్ధులు చివరకు కొడుకులు పెడుతున్న ఇబ్బందులను శనివారం పోలీస్​స్టేషన్​కు వచ్చి చెప్పుకున్నారు. కొడుకులు తిండిపెట్టడం లేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆకలితో ఉన్నవారికి పోలీసులు బయటి నుంచి భోజనం తెప్పించారు. స్టేషన్​సమీపంలోని చెట్టుకింద వృద్ధులిద్దరు ఆ భోజనాన్ని తిన్నారు. ఒకటి రెండు రోజుల్లో కొడుకులను పిలిపించి మాట్లాడతామని, తల్లిదండ్రులను చూసుకునేలా చర్యలు తీసుకుంటామని సీఐ రవిరాజు తెలిపారు.

మరిన్ని వార్తల కోసం

Latest Updates