ఫోర్‌‌ డే టెస్ట్‌‌.. జరగబోయే మార్పులివే

రోజుకు కనీసం 90 ఓవర్లు.. రెండేసి ఇన్నింగ్స్‌‌లు.. మూడు సెషన్లు.. ఐదు రోజులు..! చాన్నాళ్ల నుంచి మనం చూస్తున్న  టెస్టు మ్యాచ్‌‌ జరిగే తీరిది !  కానీ, మూడేళ్ల తర్వాత ఈ లెక్కలు మారబోతున్నాయి..! ఐదు రోజుల టెస్టుల స్థానంలో  నాలుగు రోజుల మ్యాచ్‌‌లు కనిపించబోతున్నాయి..!  మ్యాచ్‌‌ రూల్స్‌‌లో కూడా తేడాలుంటాయి..!  2023 నుంచి  ఫోర్‌‌ డే  టెస్టులే నిర్వహించాలన్న ఐసీసీ ప్రపోజల్‌‌ కార్యరూపం దాల్చితే జరగబోయే మార్పులివి!  మరి ఈ మార్పు మంచిదేనా?  టెస్టులకు ఆదరణ పెంచేందుకు ఫోర్‌‌ డే మ్యాచ్‌‌ పనికొస్తుందా?

(వెలుగు క్రీడా విభాగం)

టీ20ల యుగంలో  టెస్టులకు ఆదరణ రోజు రోజుకు తగ్గిపోతోంది. దాంతో, లాంగ్‌‌ ఫార్మాట్‌‌ను కూడా ఆసక్తికరంగా మార్చేందుకు డే నైట్‌‌ టెస్టులను ప్రవేశపెట్టిన ఐసీసీ ఇప్పుడు మరో విప్లవాత్మక మార్పు తీసుకురావాలని చూస్తోంది. టెస్టులను ఐదు నుంచి నాలుగు రోజులకు కుదించాలని భావిస్తోంది. 2023 నుంచి మొత్తం ఫోర్​ డే టెస్టులు నిర్వహించి.. తద్వారా మిగిలే సమయంలో మరిన్ని టోర్నమెంట్లు నిర్వహించాలనుకుంటోంది. అయితే, దీనిపై క్రికెట్‌‌ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.   ఆస్ట్రేలియా కోచ్‌‌తో పాటు ఆ దేశానికి చెందిన పలువురు టాప్‌‌ క్రికెటర్లు ఫోర్‌‌ డే టెస్టు ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. ఒక రోజు తగ్గిస్తే  ఐసీసీ ఆశించిన ‘సమయం’ లభించినా.. ఈ ఫార్మాట్‌‌ స్వభావమే దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేసున్నారు. మరోవైపు  నాలుగు  రోజులకు జై కొడుతున్న  వాళ్లు.. కమర్షియల్‌‌ ప్రయోజనాల దృష్ట్యా ఈ మార్పు మంచిదే అంటున్నారు.  ఇంకోవైపు చాలా మంది అడ్మినిస్ట్రేటర్లు, బ్రాడ్‌‌కాస్టర్లు కొత్త ఫార్మాట్‌‌ వైపే మొగ్గు చూపుతున్నారు. నాలుగు రోజుల టెస్టుతో కూడిన సరికొత్త వరల్డ్‌‌ టెస్ట్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ మొదలైతే సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినట్టు అవుతుందని భావిస్తున్నారు.

 నాలుగు రోజుల్లోనే ఖేల్‌‌ఖతం..

ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా..  ఈ మధ్య కాలంలో టెస్టులు చాలా తొందరగా ముగుస్తున్నాయన్నది వాస్తవం. మూడు, నాలుగు పెద్ద దేశాలు తలపడే మ్యాచ్‌‌లు మినహా సింహభాగం నాలుగు రోజుల్లోపే పూర్తవుతున్నాయి. 2010 నుంచి 2019 చివరి వరకు మొత్తం 349 టెస్టులు జరిగితే అందులో సగం కూడా ఐదు రోజు దాకా రాలేదు. కేవలం 149 మ్యాచ్‌‌లు ఐదో రోజు వరకు వస్తే.. 140 మ్యాచ్‌‌లు నాలుగో రోజే ముగిశాయి. మరో 58 మూడో  రోజునే పూర్తయితే.. రెండు మ్యాచ్‌‌ల్లో సెకండ్‌‌ డేలోనే రిజల్ట్‌‌ వచ్చేసింది.  మిగతా ఫార్మాట్లతో పోలిస్తే సహజంగానే టెస్టు మ్యాచ్‌‌ల నిర్వహణ భారంతో కూడిన పని. ఇలా టెస్టు మ్యాచ్‌‌లు ముందుగానే ముగియడం వల్ల బ్రాడ్‌‌కాస్టర్లకు నష్టాలు వస్తున్నాయి. ముఖ్యంగా  రెండు, మూడు రోజుల్లో ముగిసే మ్యాచ్‌‌లపై ఆర్గనైజర్స్‌‌ ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. ఆట ఎన్ని రోజులు సాగాలన్నది తమ చేతుల్లో లేని పని కాబట్టి.. ఈ నష్టాన్ని వన్డేలు, టీ20ల ద్వారా వచ్చే ఆదాయంతో భర్తీ చేసుకుంటున్నారు.

ప్లేయర్లకు నో రెస్ట్‌‌.. ఫ్యాన్స్‌‌కు కిక్‌‌

టెస్టు మ్యాచ్‌‌ డేస్‌‌ను కుదించడంతో క్రికెట్‌‌ క్యాలెండర్‌‌లో కొన్ని రోజులు ఫ్రీ అవుతాయని, ఆ సమయంలో మరిన్ని టోర్నీలను ప్లాన్‌‌ చేయొచ్చని ఐసీసీ చెబుతోంది. దీనివల్ల ప్లేయర్లకు అదనంగా విశ్రాంతి ఏమీ దొరకదు. కానీ, టెస్టులకు ఆదరణ పెరుగుతుందని ఆలోచన.  ఒకవేళ ఫోర్‌‌ డే టెస్టు గురువారం మొదలై  ఆదివారం ముగిస్తే  టికెట్ల సేల్‌‌ (శని, ఆదివారాల్లో) పెరగడంతో పాటు టీవీల్లో చూసే వాళ్ల సంఖ్య కూడా పెరగొచ్చన్న అభిప్రాయం ఉంది. ఈ థియరీకి ఇంగ్లండ్‌‌ క్రికెట్‌‌ బోర్డు (ఈసీబీ), క్రికెట్‌‌ ఆస్ట్రేలియా (సీఏ) ప్రాథమికంగా మద్దతు తెలిపాయి. కానీ, ఈ మార్పుల వల్ల  టెస్టు క్రికెట్‌‌ఆత్మ  దెబ్బతింటుందని  పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం  వైట్‌‌బాల్‌‌ క్రికెట్‌‌ హవా నడుస్తున్నా.. టెస్టు క్రికెట్‌‌కు ఇప్పటికీ పెద్ద ఫ్యాన్‌‌ బేస్‌‌ ఉంది. కోహ్లీ లాంటి స్టార్​ క్రికెటర్లు సైతం.. టెస్టులే అత్యుత్తమ ఫార్మాట్‌‌ అని చాలాసార్లు చెప్పారు.  ఒక క్రికెటర్‌‌ అన్ని రకాల సామర్థ్యాలను పరీక్షించేది టెస్టులే అంటున్నారు.

క్రాస్‌‌ రోడ్స్‌‌లో టెస్టు క్రికెట్‌‌!

అభిమానుల నుంచి ఆటగాళ్ల వరకు టెస్టు క్రికెట్‌‌కు జై కొడుతున్నప్పటికీ.. ప్రస్తుతం వ్యాపార ప్రయోజనాలకు, చరిత్రకు మధ్య ఈ ఫార్మాట్‌‌ క్రాస్‌‌ రోడ్స్‌‌లో ఉన్నది. ఇది ఏ మాత్రం మంచిది కాదు.  ఒకవేళ నాలుగు రోజుల ఆట వర్కౌట్‌‌ కాకపోతే ఫ్యూచర్‌‌లో ఈ ఫార్మాట్‌‌ను మరింత కుదించే ప్రమాదం లేకపోలేదు. భవిష్యత్‌‌లో  ఫోర్‌‌ డే టెస్టులు పింక్‌‌ బాల్‌‌తోనే ఆడాలని నిర్ణయిస్తే  సూర్యాస్తమయ సమయంలో ఇబ్బందులు తలెత్తే చాన్సుంది. అలాగే, ఐసీసీ ప్రతిపాదించినట్టు రోజుకు 98 ఓవర్ల ఆట అన్ని దేశాల్లో..  ముఖ్యంగా ఉపఖండంలో సాధ్యం కాకపోచ్చు. ఏదేమైనా ఐసీసీ సరైన కారణాలు చూపిస్తేనే వాటాదారులు (స్టేక్‌‌హోల్డర్స్‌‌)  ఈ మార్పునకు అంగీకరించొచ్చు. అదే సమయంలో ఈ మధ్య చాలా మ్యాచ్‌‌లు నాలుగు రోజుల్లోపే ముగిస్తున్నాయి. పైగా  రిజల్ట్‌‌ ఎక్కువగా, డ్రాలు తక్కువగా నమోదవుతున్న విషయాన్ని కూడా మర్చిపోకూడదు.

బీసీసీఐ మదిలో ఏముందో?

నాలుగు రోజుల టెస్టుల కాన్సెప్ట్​పై బీసీసీఐ ఇంకా స్పందించడం లేదు. ఈ విషయంపై ఇప్పుడే కామెంట్‌‌ చేయడం తొందరపాటు అవుతుందన్న బోర్డు ప్రెసిడెంట్‌‌ గంగూలీ ఐసీసీ ప్రదిపాదనను పూర్తిగా పరిశీలించిన తర్వాతే మాట్లాడతా అని చెప్పాడు. ఐసీసీలో మెజారిటీ నిర్ణయాలకు బిగ్‌‌ త్రీ నేషన్స్‌‌ అయిన ఇండియా, ఇంగ్లండ్‌‌, ఆస్ట్రేలియా  బోర్డుల అంగీకారం చాలా ముఖ్యం.  ఈసీబీ, సీఏ ఫోర్‌‌ డేకు ఓకే అంటున్న నేపథ్యంలో  బీసీసీఐ ఏం నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.

ఐదు రోజులే ఉండాలా?

టెస్టులు ఐదు రోజులే జరగాలన్న రూల్‌‌ ముందు నుంచే ఉన్నది కాదు. గతంలో మూడు, నాలుగు, ఆరు రోజుల మ్యాచ్‌‌లతో పాటు ‘టైమ్‌‌ లెస్‌‌’ మ్యాచ్‌‌లూ నిర్వహించారు. ఆస్ట్రేలియా–ఇంగ్లండ్‌‌ మధ్య 1877లో జరిగిన తొలి టెస్ట్‌‌.. టైమ్‌‌ లెస్‌‌ మ్యాచ్‌‌. 1939 వరకూ 99 టైమ్‌‌ లెస్‌‌ మ్యాచ్‌‌లు జరిగాయి. అదే ఏడాది డర్బన్‌‌లో సౌతాఫ్రికా–ఇంగ్లండ్‌‌ మధ్య టెస్ట్‌‌ మ్యాచ్‌‌ ఏకంగా 12 రోజుల పాటు జరిగింది. చివరకు ఇంగ్లండ్‌‌ తమ స్వదేశానికి వెళ్లే  బోట్‌‌ బయల్దేరే టైమ్‌‌ కావడంతో మ్యాచ్‌‌ను డ్రాగా ప్రకటించారు.  ఆరు రోజుల టెస్టులు 78  జరిగాయి. అలాగే, మూడు రోజుల టెస్టు మ్యాచ్‌‌లు 121, నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌‌లు 132 జరిగాయి. 1973లో న్యూజిలాండ్‌‌, పాకిస్థాన్‌‌ సిరీస్‌‌లో చివరగా నాలుగు రోజుల టెస్ట్‌‌ నిర్వహించారు. ఆ తర్వాత 2017లో సౌతాఫ్రికా–జింబాబ్వే మధ్య ప్రయోగత్మకంగా ఫోర్‌‌ డే టెస్టుకు ఐసీసీ గ్రీన్‌‌ సిగ్నల్‌‌ ఇచ్చింది.  అప్పట్లో జట్ల బలాబలాలు, సిరీస్‌‌ ఫలితాన్ని తేల్చే మ్యాచ్‌‌లను దృష్టిలో ఉంచుకొని మ్యాచ్‌‌ డేస్‌‌ను నిర్ణయించేవారు.  సాధారంగా వీక్‌‌ టీమ్స్‌‌ నాలుగు రోజులు మ్యాచ్‌‌లు ఆడేవి.

Four-day Test match debate heats up with three nations behind the plan

Latest Updates