డెంగీకి కుటుంబం బలి.. పసిబిడ్డతో సహా..!

15 రోజుల్లో భర్త, బిడ్డ, తాత డెంగీకి బలి

ఇప్పుడు ఆమె కూడా..

మొన్న పుట్టిన పసికందుకూ డెంగీనే

ఒకే కుటుంబంలో నలుగురిని 15 రోజుల తేడాతో డెంగీ బలి తీసుకుంది. మొదట భర్త.. తర్వాత తాత.. అనంతరం కూతురును కోల్పోయిన నిండుగర్భిణి ఆ షాక్​ నుంచి తేరుకోకముందే బాబుకు జన్మనిచ్చి తానూ ఊపిరి వదిలింది. తల్లి కడుపులో నుంచి బయటకు వచ్చిన పసిగుడ్డుకు సైతం ప్రాణాపాయం పొంచి ఉంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీశ్రీనగర్ కు చెందిన గుడిమల్ల రాజగట్టు(31)  ఓ ప్రైవేట్​స్కూల్​లో టీచర్​గా చేస్తున్నారు. కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయన ఈ నెల10న స్థానిక ప్రైవేట్​ హాస్పిటల్​లో చేరారు. డెంగీ లక్షణాలున్నట్లు గుర్తించిన డాక్టర్లు చికిత్స చేసినా నయం కాలేదు. ప్లేట్​లెట్స్​ 33 వేలకు పడిపోవడంతో హైయ్యర్​సెంటర్​కు రెఫర్​చేశారు. కుటుంబీకులు 15న కరీంనగర్​లోని అపోలో రీచ్​హాస్పిటల్​కు తీసుకెళ్లగా మరునాడు మృతిచెందాడు. అతడు డెంగీతో చనిపోయినట్లు నిర్ధారిస్తూ డాక్టర్లు డెత్ సర్టిఫికెట్​జారీ చేశారు. తర్వాత ఐదు రోజులకు రాజగట్టు ఇంటికి సమీపంలో నివసించే అతడి తాత లింగయ్య (75) కూడా డెంగీతో మృతిచెందాడు.

కుటుంబసభ్యులు విషాదం నుంచి తేరుకోకముందే రాజగట్టు కూతురు శ్రీవర్షిణి(6) జ్వరం బారిన పడింది. ఈ నెల 26న ఆమెను పట్టణంలోని ప్రైవేట్​ హాస్పిటల్​కు తీసుకెళ్లారు. హాస్పిటల్​లో అడ్మిట్​చేయాలని డాక్టర్​ చెప్పినా మందులు తీసుకొని ఇంటికి వెళ్లారు. సరిగ్గా దీపావళి పండగపూట ఆ ఇంటి దీపం ఆరిపోయింది.  శ్రీవర్షిణి మృతిచెందింది. భర్త, తాత, కూతురు దూరమై విషాదంలో ఉన్న రాజగట్టు భార్య సోని (28)  సైతం జ్వరం బారిన పడింది. కుటుంబీకులు సోమవారం ఆమెను మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ లోని ప్రైవేటు హాస్పిటల్​కు తీసుకెళ్లారు. తొమ్మిది నెలల నిండు గర్భిణి కావడం, పరిస్థితి విషమంగా ఉండడంతో డాక్టర్లు సిజేరియన్​ చేశారు. బాబును ప్రసవించి 24 గంటలైనా గడవక ముందే బుధవారం మధ్యాహ్నం సోని ప్రాణాలు విడిచింది. శిశువుకు సైతం డెంగీ సోకడంతో పరిస్థితి ప్రమాదకరంగా ఉందని డాక్టర్లు చెప్పారని మృతురాలి బంధువులు తెలిపారు.

జిల్లా హాస్పిటల్​లో 67 పాజిటివ్​ కేసులు

జిల్లా హాస్పిటల్​లో మంగళవారం వరకు 67 డెంగీ పాజిటివ్​ కేసులు నమోదయ్యాయని, బాధితులకు మెరుగైన వైద్యం అందించడంతో కోలుకున్నారని డీఎంహెచ్​వో డాక్టర్​ భీష్మ తెలిపారు. రాజగట్టు, శ్రీవర్షిణి జ్వరంతో చనిపోయింది వాస్తవమే అయినా అది డెంగీనో కాదో తెలియదన్నారు. లింగయ్య కొంతకాలంగా టీబీ, బీపీతో బాధపడుతున్నాడని, ఈ క్రమంలో జ్వరం రావడంతో మరణించాడని పేర్కొన్నారు.

ఒంటరిగా శ్రీవికాస్

​రాజగట్టు, సోనిలకు 2011 సంవత్సరంలో వివాహమైంది. వీరికి కుమారుడు శ్రీవికాస్​(7), కూతురు శ్రీవర్షిణి (6) జన్మించారు. రెండో కాన్పు తర్వాత సోని కుటుంబ నియంత్రణ ఆపరేషన్​ చేయించుకుంది. కానీ సర్జరీ ఫెయిల్​ కావడంతో ఇటీవల మళ్లీ గర్భం దాల్చింది. పుట్టబోయే సంతానం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న దంపతులను, చిన్నారి శ్రీవర్షిణిని డెంగీ కాటేసింది. అమ్మా నాన్నలతో పాటు చెల్లి కూడా దూరం కావడంతో శ్రీవికాస్ ఒంటరిగా మిగిలా డు. రాజగట్టుకు తల్లిదండ్రులు, చెల్లెలు ఉండగా, సోనికి అమ్మానాన్నలు లేరు.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Latest Updates