అమెరికాలో నలుగురు భారతీయులు అరెస్ట్‌

అమెరికాలో నలుగురు భారతీయులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే వీరిపై H-1B వీసాలను మోసపూరితంగా ఉపయోగించారన్న అభియోగంతో అరెస్టు చేశారు. వీసా త్వరగా పొందడానికి  తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించినట్లు వీరిపై ఆరోపణలు ఉన్నాయి. అరెస్టైన వారిలో మొత్తం నలుగురు ఉండగా..వీరిలో ఇద్దరు తెలుగువాళ్లు ఉన్నారు. వీరిని వెంటరమణ మన్నం, సతీశ్‌ వేమూరిగా గుర్తించారు. మరో ఇద్దరు విజయ్ మానే, ఫెర్నాండో సిల్వ. వీరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా…కోర్టు 2,50,000 డాలర్ల బాండ్ పూచికత్తుతో బెయిల్ మంజూరు చేసిందని చెప్పారు.

వెంకటరమణ, సతీశ్ మేమూరి, విజయ్ మానేలు న్యూజెర్సీ కేంద్రంగా ప్రొక్యూర్ ప్రొఫెషనల్స్ ఇంక్, క్రిప్టో ఐటీ సొల్యూషన్స్ ఇంక్ కంపెనీలు నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ రెండు కంపెనీలతో పాటు మరో కంపెనీని(క్లయింట్ ఏ) వీరు నిర్వహించేవారన్నారు. అమెరికాకు రావాలనుకునే భారతీయ నిపుణులకు వీరు H-1B  వీసాలు ఇప్పించేవారనీ, ఇందుకోసం తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించారని అన్నారు.

H-1B  వీసాల జారీప్రక్రియను వేగవంతం చేసేందుకు ఆ భారతీయులు ఇప్పటికే తమ కంపెనీ(క్లయింట్ ఏ)లో పనిచేస్తున్నట్లు ఇమ్మిగ్రేషన్ శాఖకు తప్పుడు పత్రాలు సమర్పించారని తెలిపారు. వాస్తవానికి H-1B వీసా కోసం దరఖాస్తు చేసిన ఇండియన్లు ఏ కంపెనీలోనూ పనిచేయడం లేదన్నారు. ఒకవేళ ఈ నేరం రుజువు అయితే దోషులకు ఐదేళ్ల జైలుశిక్ష, 2.50 లక్షల జరిమానా విధిస్తారన్నారు.

Latest Updates