నిజామాబాద్ సర్కార్ హాస్పిటల్ లో ఒకేరోజు నలుగురు మృతి

  • ముగ్గురు కరోనా పేషెంట్లు, ఒకరు జనరల్‌‌ వార్డులోని వ్యక్తి
  • ఆక్సిజన్‍ అందకే చనిపోయారంటున్న బంధువులు
  • ఆక్సిజన్ ప్రాబ్లమ్‌‌ లేదంటున్న ఆఫీసర్లు

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్‌‌లోని గవర్నమెంట్‌‌ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్‍)లో దారుణం జరిగింది. కొవిడ్ బ్లాక్‍లో ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకుంటున్న ముగ్గురు ఇన్‍ పేషెంట్లు, జనరల్ వార్డులోని ఓ పేషెంట్ శుక్రవారం తెల్లవారుజామున ఉన్నట్టుండి చనిపోయారు.ఆక్సిజన్ అందకే మరణించారని మృతుల కుటుంబీకులు ఆరోపిస్తుండగా ఆరోగ్య పరిస్థితి విషమించే చనిపోయారని, ఆక్సిజన్ సరఫరాలో ఇబ్బందేం లేదని ఆఫీసర్లు, వైద్య సిబ్బంది చెబుతున్నారు. తెల్లవారుజామున 12.30 గంటలకు జరిగిన ఘటన ఉదయం 9 గంటల వరకూ బయటకు తెలియకపోవడం, మీడియాను లోనికి అనుమతించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

అసలేం జరిగింది?

కరోనా పేషెంట్లకు ట్రీట్‌‌మెంట్ అందించేందుకు జీజీహెచ్‌‌లో 200 బెడ్లతో వార్డు ఏర్పాటు చేశారు. ఐసీయూలో మరో 40 బెడ్స్ సిద్ధం చేశారు. గురువారం రాత్రి నాటికి 17 మంది అక్కడ ఇన్ పేషెంట్స్‌‌గా ట్రీట్‌‌మెంట్ తీసుకుంటున్నారు. వీళ్లలో ఎవర్నీ వెంటిలేటర్‌‌పై ఉంచి ట్రీట్‌‌మెంట్‌‌ ఇవ్వడం లేదు. గురువారం రాత్రి 10కి కొవిడ్ వార్డులోని ముగ్గురు పేషెంట్స్‌‌కు ఆక్సిజన్‍ అందలేదని వాళ్ల కుటుంబీకులు చెబుతున్నారు. డ్యూటీ నర్సులకు విషయం తెలియడంతో టెక్నీషియన్ కోసం వెతికారని, ఎవరూ అందుబాటులో లేకపోవడం, 4 గంటలు ఆక్సిజన్ ​అందకపోవడంతో ముగ్గురు పేషెంట్లు చనిపోయారని ఆరోపిస్తున్నారు. తాను మరీ కోపం చేస్తే ఓ చిన్న ఆక్సిజన్​ సిలిండర్ తెచ్చి పెట్టారని, అందులోనూ ఆక్సిజన్ లేకపోవడంతో ఊపిరి పీల్చడం కష్టమై తన తల్లి ప్రాణం విడిచిందని ఓ మృతురాలి కొడుకు చెప్పారు.

హాస్పిటల్ ఎదుట ఆందోళన

జీజీహెచ్‌‌లో నలుగురు మృతి చెందడంతో ఆందోళన జరగొచ్చని హాస్పిటల్‌‌ వద్ద  భారీగా పోలీసులను మోహరించారు. రెండు గేట్లను మూసి రాకపోకలపై ఆంక్షలు పెట్టారు. డెడ్ బాడీలను పూర్తిగా ప్యాక్‍ చేసి వాళ్ల ఊర్లకు పంపారు. వార్తను కవరేజ్ చేయడానికి వెళ్లిన మీడియాను ఆపేశారు. మృతుల బంధువులతో మాట్లాడేందుకూ అనుమతించలేదు. జీజీహెచ్‌‌లో ట్రీట్‌‌మెంట్‌‌ పొందుతున్న ఓ మహిళ చనిపోయిందని తెలుసుకున్న ఆమె తరఫు బంధువులు శుక్రవారం తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. గురువారం రాత్రి వరకు ఆరోగ్యంగా ఉన్న మహిళ అకస్మాత్తుగా ఎలా చనిపోయిందని డాక్టర్లు, సిబ్బందిని నిలదీశారు.

అధికారులు ఇట్లంటున్నరు

నలుగురు పేషెంట్లు మృతిచెందడానికి తీవ్ర అస్వస్థతే కారణమని హాస్పిటల్‌‌ సూపరింటెండెంట్‌‌ నాగేశ్వర్‌‌రావు చెప్పారు. జక్రాన్ పల్లికి చెందిన ఓ మహిళకు, భీమ్​గల్ ​మండలానికి చెందిన షుగర్ వ్యాధి గల మరో పేషెంట్‌‌కు, ఎడపల్లి మండలం ఏఆర్​పీ క్యాంప్‌‌కు చెందిన హైబీపీ గల మరో మహిళకు ఆక్సిజన్‌‌ లెవల్స్‌‌ ఒక్కసారిగా డ్రాప్ అయ్యాయన్నారు. మరొకరు కరోనా పేషెంట్ కాదని, పక్షవాతంతో కోమాలో సీరియస్‌‌గా ఉండటంతో మృతి చెందారని చెప్పారు. జీజీహెచ్‌‌లో పేషెంట్లు ఆక్సిజన్ అందకే మరణించారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కలెక్టర్‌‌ నారాయణరెడ్డి చెప్పారు.

ఆక్సిజన్‌‌ లేకే మా అమ్మ చనిపోయింది

గురువారం రాత్రి 10 మా అమ్మకు శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయింది. మరో ఇద్దరు పేషంట్లకూ ఆక్సిజన్ అందలేదు. నర్సులకు చెబితే టెక్నీషియన్ లేడన్నారు. స్టాఫ్‌‌పై సీరియస్ అయితే టెక్నీషియన్ చేసే పని తామెట్లా చేస్తామన్నరు. చిన్న సిలిండర్ తెచ్చి పెట్టిన్రు. అందులోనూ ఆక్సిజన్ సరిపడా లేదు. అప్పటికే గంట, గంటన్నర నుంచి ఆక్సిజన్ అందక ఇబ్బంది పడుతున్న పురానీపేట్ పేషెంట్‌‌ చనిపోయాడు. కాసేపటికి అమ్మ చనిపో యింది. తర్వాత మరో ఇద్దరు చనిపోయా రంట. అమ్మను డిశ్చార్జి చేస్తరని సంతోషపడుతున్న టైమ్‌‌లో ఇట్లయింది.

– చనిపోయిన పేషెంట్ కొడుకు

రైతులను భయపెట్టి భూములు గుంజుకున్నారు

Latest Updates