పరుగు మొదలు

భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు పట్టిందల్లా బంగారమవుతోంది. బడ్జెట్​ సెషన్​లో బిల్లుల్ని ఆమోదింపజేయడంలో రికార్డు సృష్టించింది. అదే జోష్​తో త్వరలో జరగనున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ప్లానింగ్​ రూపొందించింది. తన ఏలుబడిలో ఉన్న మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్​లలో మళ్లీ గెలుపు సాధించడమే కాకుండా, ఢిల్లీ గద్దెనుకూడా దక్కించుకోవాలని పక్కా ప్లాన్​తో ముందుకెళ్తోంది. ఈ నాలుగు రాష్ట్రాల్లో ఆర్నెల్లలోగా ఎన్నికలు జరగబోతున్నాయి.

మౌలిక సదుపాయాలతో ఓట్ల వేట

మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం ఐదేళ్ల ఫస్ట్ టర్మ్​ని విజయవంతంగా పూర్తి చేసుకుని సెకండ్​ టర్మ్ కోసం బిజీ బిజీగా వ్యూహరచనలో ఉంది. కిందటిసారి ఎన్నికల్లో బీజేపీ, శివసేన విడివిడి గా పోటీ చేశాయి. ఈసారి రెండు పార్టీలు కలిసే పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోక్​సభ ఎన్నికలకు ముందు శివసేన ఒంటికాలిపై లేచి బీజేపీని తిట్టిపోసినా, ఎన్నికల నగారా మోగగానే దోస్తీకి దిగింది. రాష్ట్రంలోని మొత్తం 48 సీట్లలో బీజేపీ 23 సీట్లు,  శివసేన 18 సీట్లు గెలుచుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే ఫలితాలు సాధించాలన్న గట్టి పట్టుదలతో బీజేపీ ఉంది. ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడానికి  ఫడ్నవీస్ సర్కార్  టాప్ ప్రయారిటీ ఇస్తోంది. ఇందులో భాగంగా ఆగమేఘాల మీద  మెట్రో లైన్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని డిసైడయి, మూడు మెట్రో లైన్లను ఓకే చేసింది. వీటితో పాటు పుణేలో మెట్రో లైన్ ఏర్పాటుకు సంబంధించి ఆర్థిక సాయం అందచేయాలని నిర్ణయించుకుంది.

రెండు జిల్లాల్లో  వాటర్ గ్రిడ్

మరాఠ్వాడా ప్రాంతం కొంతకాలంగా తీవ్ర నీళ్ల కొరత ఎదుర్కొంటోంది. తాగడానికి గుక్కెడు నీళ్లు దొరక్క ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై బీజేపీ సర్కార్  ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మరఠ్వాడాలోని  ఔరంగాబాద్,  జల్నా జిల్లాల్లో వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఔరంగాబాద్ జిల్లాలో 737 కిలోమీటర్ల పొడవున,  జల్నా జిల్లాలో 458 కిలోమీటర్ల పొడవున  పైప్ లైన్ వేస్తారు. మరఠ్వాడా ప్రాంతంలోని అనేక డ్యాంలను వాటర్ గ్రిడ్​కి కనెక్ట్ చేస్తారు. దీంతో అన్ని గ్రామాలకు నీళ్ల సరఫరా ఈజీ అవుతుంది.

కాంగ్రెస్​కి లీడర్​ సమస్య

అసెంబ్లీ ఎన్నికలకు గడువు దగ్గరపడుతున్నా కాంగ్రెస్​లో ఏమాత్రం జోష్ కనిపించడం లేదు. పార్టీ చీఫ్ పదవికి రాహుల్ రాజీనామా చేయడంతో జనం దగ్గరకు ఎవరి ఫొటో పట్టుకుని వెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొంది.   ఇక, జమ్మూ కాశ్మీర్​కి ప్రత్యేక హక్కులను కట్టబెట్టిన ఆర్టికల్–370 రద్దు ప్రభావం కూడా మహారాష్ట్ర  అసెంబ్లీ ఎన్నికలపై ఉంటుందని ఎనలిస్టులు భావిస్తున్నారు. కాశ్మీర్​పై నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయానికి శివసేన అండగా నిలిచింది. మోడీ సర్కారుని యూత్ బాగా సపోర్ట్ చేస్తోంది. యువతరం ఓట్లు బీజేపీ , శివసేన కూటమికి అనుకూలంగా పడతాయని రాజకీయ పండితులు భావిస్తున్నారు.

2014 లో బీజేపీ కి 122 సీట్లు

మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య 288. సర్కార్ ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 188. కిందటిసారి 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ, శివసేన విడివిడిగా పోటీ చేశాయి. బీజేపీ 122 సీట్లు, శివసేన 68 సీట్లు గెలుచుకున్నాయి. ఎన్నికల తర్వాత కూటమిగా ఏర్పడ్డాయి. బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలో ఈ కూటమి  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కిందటిసారి ఎన్నికల్లో కాంగ్రెస్​కి కేవలం 42 సీట్లు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి 41 సీట్లు వచ్చాయి. 2014 ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. సీట్ల పంపకం ఓకే అయితే ఈసారి కలిసి పోటీ చేసే అవకాశాలున్నాయి.

గిరిజనంపైనే గురి

జార్ఖండ్​లో ఈ ఏడాది నవంబరు చివరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. లేటెస్ట్​గా జరిగిన లోక్​సభ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ సత్తా చాటింది. మొత్తం 14 సీట్లలో 12 సీట్లను గెలుచుకుంది. బీజేపీయేతర కూటమికి కేవలం రెండు సీట్లే దక్కాయి. బీజేపీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ చాలా రోజుల నుంచి అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పనిచేయడం మొదలెట్టారు. లోక్​సభ ఎన్నికలప్పుడు ఇచ్చిన ‘జేఎంఎం ముక్త్ జార్ఖండ్’ నినాదాన్ని మళ్లీ ఉపయోగించాలని డిసైడ్ అయినట్లు తెలిసింది. జార్ఖండ్ ట్రైబల్ పాలిటిక్స్​కి కేరాఫ్ అడ్రస్ వంటిది. లోక్​సభ ఎన్నికల్లో ఆదివాసీల ప్రాబల్యం ఉన్న అనేక సీట్లలో బీజేపీకి పెద్ద సంఖ్యలో ఓట్లు పడ్డాయి. దీంతో గిరిపుత్రులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈ సీట్లలో గెలుపు సాధించడానికి పకడ్బందీ ప్లాన్ రెడీ చేసింది బీజేపీ.

కుమ్ములాటల్లో కాంగ్రెస్​

నాలుగు నెలల్లోగా ఎన్నికలు జరగబోతున్నా కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం బాగా లేదు. జార్ఖండ్ కాంగ్రెస్​లో ముఠా కల్చర్ ఎక్కువ. జనరల్​ ఎలక్షన్స్​లో చతికిలపడ్డా ఇప్పటికీ ఆ పార్టీ అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోంది. అయితే, ఓటమి షాక్ నుంచి కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలైన జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), జార్ఖండ్ వికాస్ మోర్చా (జేవీఎం) కోలుకుని అసెంబ్లీ ఎన్నికలకు తయారవుతున్నాయి.

జేఎంఎం కోట బద్దలు

రాష్ట్రంలో బలమైన రాజకీయ పార్టీగా పేరున్న జేఎంఎం,లోక్ సభ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. పార్టీకి కంచుకోట ల్లాంటి  అనేక నియోజకవర్గాల్లో ఓటమి పాలైంది. గతంలో శిబూ సోరెన్  పోటీ చేసి గెలిచిన ధుమ్ కా లో కూడా జేఎంఎం ఓడిపోయింది. దీంతో ఈ లోక్ సభ సీటు పరిధిలోని అన్ని అసెంబ్లీ సీట్లపై  బీజేపీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.సంప్రదాయంగా జేఎంఎంకు ఓటు బ్యాంకుగా ఉన్న కొన్ని కులాలు లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కి మద్దతు పలికాయి. అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే ట్రెండ్ ను కొనసాగేలా చేయడానికి  సీఎం రఘువర్ దాస్ ప్రయత్నాలు చేస్తున్నారు.

2014 ఎన్నికల ఫలితాలు

జార్ఖండ్ అసెంబ్లీలో  మొత్తం  సభ్యుల 81 మంది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 42 సీట్లు గెలుచుకుంది. సహజంగా జార్ఖండ్​లో ఏ ఒక్క రాజకీయ పార్టీకి మేజిక్ ఫిగర్ రాదు. జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి ఫుల్​ మెజారిటీ (41) రావడం ఇదే ఫస్ట్ టైమ్. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తన మిత్రపక్షాలైన జేఎంఎం, ఆర్జేడీ, జేడీ (యునైటెడ్)తో కలిసి ఒక కూటమిగా పోటీ చేసింది.

4 రాష్ట్రాలకు రంగంలోకి దిగిన ఇన్​ఛార్జ్​లు

ఈ ఏడాది చివరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్​, ఢిల్లీ రాష్ట్రాలకు బీజేపీ రీసెంట్​గా ఎలక్షన్​ ఇన్​ఛార్జ్​లను, కో–ఇన్​ఛార్జ్​లను నియమించింది. వీళ్లు రెగ్యులర్​ స్టేట్​ ఇన్​ఛార్జ్​లకు అదనం. ఎన్నికల రిసోర్స్​లను, క్యాంపెయిన్​ ప్లానింగ్​ను పక్కాగా రెడీ చేయటానికి బీజేపీ హైకమాండ్​ ఇలా కొత్త ట్రెండ్​ క్రియేట్​ చేసింది.

భూపేందర్ యాదవ్: బీజేపీ జనరల్​ సెక్రెటరీ. అమిత్​షాకి క్లోజ్​. గతంలో వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అసైన్​మెంట్లను సక్సెస్​ఫుల్​గా పూర్తి చేశారు. ఆ లిస్టులోని కొన్ని స్టేట్లు.. రాజస్థాన్​, గుజరాత్​, జార్ఖండ్​, బీహార్​, యూపీ. ప్రజెంట్​గా మహారాష్ట్ర బాధ్యతలు అప్పగించారు. దీనికోసం ఇద్దరు కో–ఇన్​ఛార్జ్​లను కేటాయించారు.

ప్రకాశ్ జవదేకర్: బీజేపీ సీనియర్​ మోస్ట్​ లీడర్​. సెంట్రల్​ మినిస్టర్​. గతంలో ఏపీ ఎలక్షన్​ ఇన్​ఛార్జ్​గా పని చేశారు. ఈయనకి ఇద్దరు మంత్రులు కో–ఇన్​ఛార్జ్​లుగా సాయం చేస్తారు. వాళ్లు.. హర్దీప్​ పూరి, నిత్యానంద్​ రాయ్​. పంజాబి, పూర్వాంచలి పాపులేషన్​ని దృష్టిలో పెట్టుకొని వీరికి ఈ డ్యూటీ వేశారు. జవదేకర్​ పోయినేడాది రాజస్థాన్​ ఎన్నికలను కూడా హ్యాండిల్​ చేశారు.

నరేంద్రసింగ్ తోమర్: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి. మధ్యప్రదేశ్​కి చెందిన సీనియర్​ నేత. గతంలో బీజేపీ యువ మోర్చాలో చురుకుగా మెలిగారు. ఇప్పుడు హర్యానా ఎలక్షన్​ ఇన్​ఛార్జ్​గా వ్యవహారాలు నడపాలి. ఈయనకి యూపీ మినిస్టర్​ భూపేందర్​సింగ్​ సింగ్​ కో–ఇన్​ఛార్జ్​​. వీళ్లిద్దరూ ఇప్పటికే బాధ్యతలు స్వీకరించి రాష్ట్రంలోని సీనియర్​ లీడర్లను ఎన్నికల ప్రచార రంగంలోకి దింపారు.

ఓం ప్రకాశ్ మాథుర్: బీజేపీ సీనియర్​ లీడర్​. పార్టీ నేషనల్​ జనరల్​ సెక్రెటరీ. రాజస్థాన్​ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్​​గానూ చేశారు.

టాప్​ లీడర్లు అవుట్​

ఈ ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో హర్యానాకూడా ఉంది. జనరల్​ ఎలక్షన్స్​లో మొత్తం పది సీట్లనూ బీజేపీయే క్లీన్​ స్వీప్​ చేసింది. కాంగ్రెస్ ప్రముఖులు భూపేందర్ హూడా, ఆయన కుమారుడు దీపేందర్ హూడా ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగించాలని బీజేపీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గట్టి పట్టుదలతో ఉన్నారు. హర్యానా పాలిటిక్స్​లో చక్రం తిప్పిన దేవీలాల్​ కుటుంబం, హూడా ఫ్యామిలీ పూర్తిగా సైడ్​ ట్రాక్​లోకి వెళ్లిపోయాయి. ప్రస్తుతానికి హర్యానాలో చెప్పుకోదగ్గ ప్రతిపక్షమనేదే లేదు.

మిషన్–75’

లోక్​సభ ఎన్నికలను ఇన్ స్పిరేషన్​గా తీసుకుని ‘మిషన్–75’ను డిక్లేర్ చేశారు బీజేపీ ఢిల్లీ పెద్దలు. మొత్తం 90 సీట్లలో 75 సీట్లలో గెలవాలని లోకల్ లీడర్లకు టార్గెట్ ఫిక్స్  చేశారు. దీంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సలహాలు, సూచనలతో ఎన్నికల్లో గెలుపుకోసం రోడ్ మ్యాప్ తయారు చేసుకుంటున్నారు ముఖ్యమంత్రి ఖట్టర్. లేటెస్ట్ గా కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తో పాటు ఉత్తర ప్రదేశ్ మంత్రి భూపేందర్ సింగ్ ను హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఇన్ చార్జ్ లుగా బీజేపీ హై కమాండ్  ప్రకటించింది. హర్యానా అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య 90. కిందటిసారి ఎన్నికల్లో బీజేపీ 47 సీట్లు గెలుచుకుంది.

ఏటికి ఎదురీదుతున్న ఆప్

ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగబోతున్నాయి. 2013, 2015 ఎన్నికల్లో గెలిచి అధికారానికి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఈసారి ఏటికి ఎదురీదుతోంది. కొన్నేళ్లుగా ఆప్  పొలిటికల్ గ్రాఫ్  డౌన్ ట్రెండ్​లో కొనసాగుతోంది. లోక్​సభ ఎన్నికల్లో మొత్తం ఏడు సీట్లలో ఒక్క సీటును కూడా ఆప్ గెలుచుకోలేకపోయింది. మొత్తం ఏడు సీట్లనూ గెలుచుకుని బీజేపీ ఫుల్​ జోష్​లో ఉంది. ఢిల్లీ సీఎం కుర్చీకి బీజేపీ దూరమై దాదాపు 22 ఏళ్లు కావస్తోంది. మారిన రాజకీయ పరిస్థితుల్లో ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో పాగా వేయాలని బీజేపీ  పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. నిన్న మొన్నటివరకు ఢిల్లీ కాంగ్రెస్​కి షీలా దీక్షిత్ పెద్ద దిక్కుగా ఉండేవారు. ఆమె మరణంతో లోకల్​గా పార్టీని నడిపించే లీడర్ లేకుండా పోయారు. ఇప్పటివరకు ఢిల్లీ పీసీసీ చీఫ్​గా ఎవరినీ హై కమాండ్ నియమించలేదు. దీంతో ఈసారి బీజేపీ, ఆప్ మధ్యే పోటీ ప్రధానంగా ఉండబోతోంది.

కమలం మిషన్–60

2015 మధ్యంతర ఎన్నికల్లో  మొత్తం 70 అసెంబ్లీ సీట్లకు గాను 67 సీట్లను ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకుంది. కమలం పార్టీకి కేవలం మూడు సీట్లే దక్కాయి. కేజ్రీవాల్ సర్కార్ ఫెయిల్యూర్స్​ని ప్రజలకు వివరించి ఓట్లు కొల్లగొట్టాలని బీజేపీ లీడర్లు భావిస్తున్నారు. కిందటిసారి కేజ్రీవాల్​కి గట్టి మద్దతుదారులుగా ఉన్న ముస్లింలను ఈసారి తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పాత ఢిల్లీలో ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆయా ప్రాంతాలపై బీజేపీ నాయకులు ఫోకస్ పెట్టారు. అక్కడి ప్రాంతాల్లో కనీస వసతుల మెరుగుదలకు  అవసరమైన పథకాలు రెడీ చేశారు.

Latest Updates