రూ.6,200 కోట్ల ఈక్విటీలను ఎఫ్​పీఐలు అమ్మేశారు

బడా కంపెనీల రిజల్ట్సే నిర్ణయిస్తాయ్‌!
ట్రేడ్‌‌వార్‌‌ చర్చలు కూడా ముఖ్యమే
మరింత కన్సాలిడేషన్ ఉండొచ్చంటున్న ఎనలిస్టులు

న్యూఢిల్లీ: యూఎస్‌‌–చైనా ట్రేడ్‌‌వార్ వంటి అంతర్జాతీయ అంశాలు, కంపెనీల మూడో క్వార్టర్‌‌ ఫలితాలు ఈవారం మార్కెట్‌‌ను నడిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిలయన్స్‌‌ ఇండస్ట్రీస్‌‌, హిందుస్థాన్ యూనిలీవర్‌‌, విప్రో వంటి పెద్ద కంపెనీల క్వార్టర్‌‌ ఫలితాలు ఈ వారమే విడుదలవుతున్నాయి. ‘‘ ఇన్ఫోసిస్‌‌ ఫలితాలపై సోమవారం ఉదయమే మార్కెట్‌‌ స్పందించే అవకాశాలు ఉన్నాయి. ట్రేడ్‌‌వార్‌‌ వార్తలనూ ఇన్వెస్టర్లు జాగ్రత్తగా గమనిస్తారు. మార్కెట్లో మరికొంత కన్సాలిడేషన్‌‌కు అవకాశం ఉంది’’ అని రెలిగేర్‌‌ బ్రోకింగ్‌‌కు చెందిన అజిత్‌‌ మిశ్రా అన్నారు. ఇండియాలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌‌ శుక్రవారం సాయంత్రం ఫలితాలను ప్రకటించడం తెలిసిందే. జూలై–సెప్టెంబరు క్వార్టర్‌‌లో కన్సాలిడేటెడ్‌‌ ప్రాతిపదికన నికరలాభం 2.2 శాతం తగ్గి రూ.4,019 కోట్లకు పడిపోయిందని తెలిపింది.

ఇదే విషయమై శామ్‌‌కో సెక్యూరిటీస్‌‌ అండ్‌‌ స్టాక్‌‌నోట్‌‌ సీఈఓ జిమీత్‌‌ మోడీ మాట్లాడుతూ కార్పొరేట్‌‌ నంబర్లు మార్కెట్‌‌ మూడ్‌‌ను ప్రభావితం చేస్తాయని చెప్పారు. కొన్నింటి ఫలితాలు కాస్త నిరాశపర్చాయని, కొన్ని కంపెనీల ఫలితాలు బాగున్నాయని అన్నారు. కంపెనీల ఫలితాల వల్ల ఎఫ్‌‌పీఐలు తిరిగి ఇండియా మార్కెట్లవైపు ఆకర్షితులు అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. స్థూల ఆర్థిక అంశాలను పరిశీలిస్తే టోకుధరల సూచీ ద్రవ్యోల్బణం వివరాలు సోమవారం విడుదలవుతాయి. ఇవి కూడా ట్రేడింగ్‌‌ను ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయి. మాన్యుఫ్యాక్చరింగ్, విద్యుత్‌‌ ఉత్పత్తి, గనుల రంగాలు డీలాపడటం వల్ల ఈ ఏడాది ఆగస్టులో పారిశ్రామిక ప్రగతి సూచీ 1.1 శాతం తగ్గింది. రిలయన్స్‌‌, అంబుజా, విప్రో, ఏసీసీ వంటి కంపెనీల ఫలితాలు మార్కెట్లో కొంత అనిశ్చితిని సృష్టించవచ్చని ఎపిక్‌‌ రీసెర్చ్‌‌ సీఈఓ ముస్తఫా నదీమ్‌‌ అన్నారు. ట్రేడ్‌‌వార్‌‌పై ట్రంప్ సానుకూలంగా మాట్లాడటంతో అంతర్జాతీయ మార్కెట్లు శుక్రవారం ర్యాలీ చేశాయి. అయితే ఎర్రసముద్రం వద్ద ఇరాన్ ఆయిల్‌‌ ట్యాంకర్‌‌పై దాడి జరగడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. ముడిచమురు ధరలు రెండుశాతం పెరిగాయి. గతవారం బీఎస్‌‌ఈ సెన్సెక్స్‌‌ 453 పాయింట్లు లాభపడింది.

రూ.6,200 కోట్ల విలువైన ఈక్విటీలను ఎఫ్​పీఐలు అమ్మేశారు

ఆర్థికమాంద్యం ఏర్పడుతుందని ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు నెలకొనడం, ట్రేడ్‌‌వార్‌‌ కొనసాగుతూనే ఉండటంతో ఫారిన్ పోర్ట్‌‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌‌పీఐ) ఈ నెలలో ఇప్పటి వరకు రూ.6,200 కోట్లను మార్కెట్ల నుంచి వెనక్కి తీసుకున్నారు. ఈ నెల 1–11 తేదీల మధ్య ఈక్విటీ సెగ్మెంట్‌‌ నుంచి రూ.4,955.2 కోట్లు, డెట్‌‌ సెగ్మెంట్‌‌ నుంచి రూ.1,261.9 కోట్లు ఉపసంహరించుకున్నారు. గత నెలలో ఎఫ్‌‌పీఐలు రూ.6,557 కోట్లు ఇన్వెస్ట్‌‌ చేశారు. ఎఫ్‌‌పీఐలపై సర్‌‌చార్జ్‌‌ విధిస్తున్నట్టు ప్రకటించినప్పటి నుంచి వీరు షేర్లను అమ్ముకుంటున్న సంగతి తెలిసిందే. అయితే అదనపు సర్‌‌చార్జ్‌‌ను తొలగించామని ప్రకటించాక, వీళ్లు తిరిగి ఇండియా మార్కెట్లవైపు మొగ్గారు. అంతర్జాతీయ పరిస్థితులు ప్రతికూలంగా ఉండడంతో నిధులను వెనక్కి తీసుకుంటున్నారు. ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడం, ఐఎంఎఫ్‌‌, ఏడీబీ, మూడీస్‌‌ వంటి సంస్థలు వృద్ధిరేటును తగ్గించడంతో ఎఫ్‌‌పీఐల సెంటిమెంట్‌‌ దెబ్బతిన్నదని మార్నింగ్‌‌స్టార్‌‌ ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ సీనియర్ ఎనలిస్ట్‌‌ హిమాన్షు శ్రీవాస్తవ చెప్పారు. కార్పొరేట్ల మూడో క్వార్టర్‌‌ ఫలితాలు, అంతర్జాతీయ పరిస్థితులు, ఎకానమీ అభివృద్దికి ప్రభుత్వం ప్రకటించే చర్యలను బట్టి వీళ్లు తదుపరి నిర్ణయాలు తీసుకుంటారని ఎనలిస్టులు అంటున్నారు.

Latest Updates