కోట్పా చట్టంలో సవరణలను వెనక్కి తీసుకోండి

దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు నాలుగు కోట్ల మంది సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపారస్తులపై ప్రభావం చూపుతున్న కోట్పా చట్టంలో ప్రతిపాదిత సవరణలను వెనక్కి తీసుకోవాలని ప్రధాని మోడీని కోరింది ఫెడరేషన్‌ ఆఫ్‌ రిటైలర్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఆర్‌ఏఐ).  ఈ ప్రతిపాదిత సవరణల కారణంగా  పొగాకు సంబంధిత ఉత్పత్తులను దేశవ్యాప్తంగా విక్రయించే చిల్లర వ్యాపారస్తుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం ఏర్పడే అవకాశాలున్నాయన్నారు. సవరణలను వెనక్కి తీసుకోవాలని ఇవాళ నిరసనకు దిగిన ఎఫ్‌ఆర్‌ఏఐ తెలంగాణా చాఫ్టర్‌.. రాష్ట్రంలోని దాదాపు 6.5 లక్షల సూక్ష్మ వ్యాపారవేత్తలు, వారిపై ఆధారపడ్డ 30 లక్షల మంది ప్రజల జీవనోపాధి  నుంచి కాపాడాల్సిందిగా సీఎం కేసీఆర్ ను కోరింది.

ఈ అంశం గురించి  సలావుద్దీన్‌ డెక్కనీ, వైస్‌ ప్రెసిడెంట్‌, ఫెడరేషన్‌ ఆఫ్‌ రిటైలర్స్‌ అసొసియేషన్‌ ఆఫ్‌ ఇండియా  అండ్ జనరల్‌ సెక్రటరీ, పాన్‌ షాప్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా, హైదరాబాద్‌ మాట్లాడుతూ ‘‘మేము సవినయంగా గౌరవనీయ భారత ప్రధానమంత్రి మా పట్ల సానుభూతి చూపాల్సిందిగా,  సంబంధిత మంత్రివర్గాన్ని తక్షణమే ప్రతిపాదిత కోట్పా సవరణ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందిగా ఆదేశించాలని అభ్యర్థిస్తున్నాము. ఎందుకంటే ఈ చట్టాలు అత్యంత కఠినమైనవి. దశాబ్దాలుగా విడిగా సిగిరెట్లు  విక్రయించడం వంటి వ్యాపారాలు కూడా నేరంగా పరిగణించడంతో పాటుగా చిన్న అతి క్రమణలకు కూడా కరడుగట్టిన నేరగాళ్లలా ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించేలా చట్టాలు దీనిలో ఉన్నాయి. మరణానికి కారణమయ్యేలా ప్రమాదకరమైన డ్రైవింగ్‌కు రెండు సంవత్సరాల జైలుశిక్షతో పోలిస్తే ఇది అసాధారణాలలో కెల్లా అసాధారణం అనిపిస్తుంది. ఇది ఓ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా ఒకరిపై యాసిడ్‌ పోయడం లేదా నిర్లక్ష్యంతో ఒకరి మరణానికి కారణం కావడం వంటి అంశాలతో సమానంగా పాన్‌, బీడీ, సిగిరెట్‌ విక్రయదారులను నిలిపింది. తమ రోజువారీ సంపాదన కోసం తీవ్రంగా కష్టపడే నిరుపేద, బడుగు వర్గాల ప్రజలకు సంబంధించి ఇంతటి కఠినమైన చట్టాలను ఎలా రూపొందించగలిగారు ?’’

‘‘ఇప్పటికే భారతదేశంలో పొగాకు నియంత్రణకు  సంబంధించి అత్యంత కఠినమైన నియంత్రణ చట్టాలు ఉన్నాయి. ఈ కారణం చేతనే చట్టబద్ధమైన పొగాకు వినియోగం గణనీయంగా తగ్గింది. ప్రస్తుత చట్టాలతో అక్రమ, స్మగుల్డ్‌ సిగిరెట్లు వృద్ధి చెందుతున్నాయి .. ఈ చట్టాల వల్ల సంఘ వ్యతిరేక శక్తులకు ప్రయోజనం కలుగుతుంది. అలాంటప్పుడు ఈ అత్యంత కఠినమైన పొగాకు నియంత్రణ చర్యలు తీసుకోవడమనేది ఇతర ఆరోగ్య సమస్యలైనటువంటి కరోనా వైరస్‌తో పోరాటం, మధుమేహం, ఊబకాయం, మానసిక ఆరోగ్యం, గాలి కాలుష్యం తదితర కారణాల వల్ల పెరుగుతున్న వ్యాధుల కన్నా తీవ్రమైనదా అన్న సందేహం వస్తుంది. కరోనా వైరస్‌లా కాకుండా ఈ తరహా విధాన నిర్ణయాలు పూర్తిగా మన విధాన నిర్ణేతల చేతుల్లోనే ఉంటాయి. వారు తప్పనిసరిగా సానుభూతితో పరిశీలించాల్సి ఉంది. నేడు, మేము ఓ కమ్యూనిటీగా బాధితులుగా భావిస్తుండటంతో పాటుగా మమ్మల్ని  లక్ష్యంగా చేసుకున్నారనీ భావిస్తున్నాము. దయతో మమ్మల్ని ఈ కష్టాల నుంచి గట్టెక్కించాల్సిందిగా మోడీజీకి విజ్ఞప్తి చేస్తున్నాము’’అని అన్నారు.

 

Latest Updates